ఇంటి కత్తెరలో పోకచెక్క | Traditional Scene Asadhamasam | Sakshi
Sakshi News home page

ఇంటి కత్తెరలో పోకచెక్క

Published Mon, May 22 2017 2:17 AM | Last Updated on Tue, Sep 5 2017 11:40 AM

ఇంటి కత్తెరలో పోకచెక్క

ఇంటి కత్తెరలో పోకచెక్క

ధన్‌ధన్‌... దభేల్‌ దభేల్‌.. ఖణేల్‌ ఖణేల్‌... వంటగది డీటీఎస్‌లో మోగిపోతోంది. గిన్నెల శబ్దాలు ఠాప్‌ఠాప్‌ మంటున్నాయి. ఈ వారంలో ఈ విన్యాసాలు మూడోసారి! కుకర్‌ హ్యాండిళ్లు విరిగిపోవటం, పచ్చడి మెత్తగా కాటుకలా అయిపోతున్నా మిక్సీని బర్‌ర్‌ర్‌ మని తిప్పుతూనే ఉండటం, ఇడ్లీలకని గ్రైండర్‌లో వేసిన పప్పు వడియాల పిండిలా నురగలు కక్కటం,  చిక్కటి ఫిల్టర్‌ కాఫీ డికాషన్‌ కాస్తా చూరునీళ్లలా పల్చగా మారిపోవడం... ఇవన్నీ శ్రీమతికి కోపం వచ్చిందనడానికి సంకేతాలు.

మొగుళ్ల అరుపులు.... పెళ్లాల అలకలు... అందరిళ్లలోనూ ఉండేవే. కాకపోతే మా ఇంట్లో మాత్రం కొంచెం వెరయిటీ. ఎందుకంటే నేనసలు అరిచే మొగుణ్ణి కాను... మా ఆవిడ అలిగే రకం కాదు... మావి మౌనయుద్ధాలు గిన్నెల మీద పరోక్ష ప్రతాపాలూ. అసలు పెళ్లిచూపుల్లోనే నాకు తను బాగా నచ్చింది. నెక్ట్స్‌ సీన్‌ పెళ్లి. ఎదురు చూసినంతకాలం పట్టలేదు... ఫెళ్లున పెళ్లయిపోయింది. పెళ్లయిన వారానికే మరో ట్రెడిషనల్‌ సీన్, ఆషాఢమాసం. మా కాపురంలో చిన్న బ్రేక్‌. తను వాళ్ల పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ విరామంలోనే తొలి వివాదం. మా మధ్య మొదటి తగాదా. కారణం చిన్న నిర్లక్ష్యం.

మా ఆవిడ వాళ్ల అమ్మవాళ్లింట్లో ఉండగా ఓ రోజు తలుపు సందులో పడి మా అమ్మ వేలు నలిగింది. బొటబొటా రక్తం కారిపోయింది. నొప్పితో అమ్మ విలవిలలాడి పోయింది. ఆ రాత్రి మా ఆవిడ ఫోన్‌ చేస్తే నేను వేలు నలిగిన విషయం చెవినేశాను. తను క్యాజువల్‌గా ‘అవునా’ అని ఊరుకుంది. తర్వాత ఆ విషయం నేనూ మర్చిపోయానూ, తనూ మర్చిపోయింది. అమ్మ మాత్రం మర్చి పోలేదు. తన వేలు నలిగినట్టు తెలిసి, తెలిసినవాళ్లవీ తెలియని వాళ్లవీ ఫోన్లూ పరామర్శలూ వెల్లువెత్తుతున్నాయి కానీ కోడలి దగ్గరనుంచి ఒక్క కాల్‌ కూడా రాకపోయేసరికి అనుమానంగా అడిగింది నన్ను ‘ఏరా! తనకి తెలుసా నాకు వేలు నలిగిందని’ అని.

‘తెలుసమ్మా! ఆ రోజే చెప్పాన్నేను’ అన్నాను. దాంతో అవమానంగా ఫీలయ్యింది.   సరిగ్గా అప్పుడే నా ఫోన్‌ మోగింది. చూస్తే తనే.
‘ఇదిగో అమ్మా తన దగ్గర నుంచే ఫోన్‌. మాట్లాడతావా’ అంటూ కాల్‌ ఆన్సర్‌ చేసి, అమ్మ చేతికిచ్చాను సెల్లు. పొడిపొడిగా రెండు మాటలు మాట్లాడి తిరిగి ఫోన్‌ నా చేతికిచ్చేసింది. నేను కాసేపు అవీ ఇవీ మాట్లాడాక లోపలికొచ్చి ‘ఇంతకీ కూర ఏం చేస్తున్నావమ్మా’ అనడిగాను. ఆ ప్రశ్నే వినపడనట్టుగా... ‘మీ ఆవిడ నాతో ఒక్కమాట కూడా మాట్లాడలేదేంటీ’.. అంది సీరియస్‌గా.

‘అదేంటే, ఇప్పుడేగా మాట్లాడిందీ’ అన్నా వినిపించుకోలేదు. ‘ఒకపక్క నా వేలు నలిగి ఇంత బాధపడుతుంటే... అయ్యో! మీ వేలు నలిగిందట కదా, ఎలా ఉంది అత్తయ్యగారూ అని అడగనన్నా అడగలేదు మీ ఆవిడ. ఇట్లా అయితే ముందర ముందర నాకు ఇంకా ఏవైనా అయితే కనీసం ముఖం కూడా చూడదేమో మీ ఆవిడ...’ అమ్మ గొంతు రుద్ధమయింది. చెప్పొద్దూ... నాక్కూడా కోపమొచ్చింది తనమీద. వెంటనే ఫోన్‌ చేశా. ‘అవునూ... మా అమ్మకి వేలు నలిగిందని చెప్పా కదా... పలకరించావా?‘ అనడిగా... నా గొంతులో ఏదో మార్పు. అవతలి నుంచి తనేదో చెప్పబోతున్నా వినిపించుకోలేదు.

ఆ తర్వాత పెళ్లిలో జరిగిన లోటుపాట్లను ఏకరువు పెట్టాను. అప్పటి వరకు మది పొరల్లో ఎక్కడో దాగి ఉన్నవన్నీ పొంగుకొచ్చేశాయి ఒక్కసారిగా. కొద్దిక్షణాలు నిశ్శబ్దం... తర్వాత వెక్కిళ్లు వినిపించాయి. నా తొందరపాటుకు బాధేసింది. తనని ఓదార్చాలని చూశాను. కానీ అంతగా కన్విన్స్‌ అయినట్లు కనిపించలేదు. ఆ గొడవ తీరి తిరిగి ఇద్దరం మామూలు కావడానికి తలప్రాణం తోకకొచ్చింది. తను కాపురానికొచ్చింది. వచ్చీ రాగానే వంట ఇంటి బాధ్యత తీసేసుకుంది. ఆ తర్వాత వంట తగాదాలు మొదలయ్యాయి.
 
మేము తినే కూరలకీ వాళ్లు తినే కూరలకీ చాలా తేడాలు. చారులో పులుసులో కాకరకాయ కూరలో చక్కెర వేసేది తను. చోద్యంగా చూసేవాళ్లం మేము. చింతకాయ పచ్చడిలో బెల్లం, టమోటా పచ్చడిలో పంచదార పడకపోతే తినం మేం. వాళ్లేమో వైస్‌ వెర్సా. ఇలా కాదు అలా అని అంటే... వంట గదిలో నుంచి విచిత్రమైన సౌండ్‌ వచ్చేది. ఒక ముఖ్య పాత్ర కుయ్యో మని మూలిగేది. మరుసటి రోజు దాని నుదుటిన చిన్న సొట్ట కనిపించేది. నేనవి పెద్దగా పట్టించుకునేవాణ్ణి కాదు.

దాంతో పెళ్లయిన కొద్ది రోజులకే నాకు పెళ్లాం కొంగు పట్టుకు తిరిగే మొగుణ్ణని పేరొచ్చేసింది. మా అమ్మే నాకు ఆ కిరీటం పెట్టింది. మా అక్కలు ఆ కిరీటానికి మరికొన్ని అలంకారాలు చేశారు.  కానీ తను మాత్రం నన్ను ‘అమ్మకూచి’ అంటుంది. ఇలా తల్లీ భార్యల మధ్య అడకత్తెరలో పోకచెక్కలా అయ్యింది నా పరిస్థితి. ఇంట్లో గిన్నెల సౌండ్లు... ఆఫీసులో నేనుండగా అమ్మ సెల్లు కంప్లెయింట్లు షరా మామూలే. ఎవరికీ ఏటూ చెప్పలేక ఓ మూణ్ణాలుగు నెలల్లోనే నాకు తోడుగా బీపి వచ్చేసింది.

వీటన్నిటి నడుమా పెద్ద పిల్ల కడుపులో పడింది. ఐదోనెలలో పురిటికి తీసుకెళ్లి కాన్పు అయిన ఐదోనెలకు తీసుకొచ్చి దింపుతామని మా అత్తగారూ మరదలూ వచ్చారు. ‘అబ్బే! మాకు ఆన వాయితీ లేదలా. కావాలంటే తొమ్మిదోనెల వచ్చాక తీసుకుపోయి మళ్లీ నెల తిరిగేలోపే తీసుకొచ్చి దిగబెట్టాలి’ అంటూ అమ్మ కుండబద్దలు కొట్టింది. అప్పుడు కూడా ఆ కోపాన్ని పాపం కుక్కలా మా కుక్కరే అనుభవించింది. ఆ తర్వాత బారసాల విషయంలోనూ సారె విషయంలోనూ వచ్చిన మాట పట్టింపుల్లో వంట గదిలో పాత్రలు గడగడలాడటం జరిగిపోతూనే ఉంది. వాటి దోవన అవి నడుస్తుండగానే మరో బుజ్జి తల్లి వచ్చేసింది మా మధ్యకు.

పిల్లల పెంపకంలోనూ మనస్పర్ధలు మామూలే.. తను చిన్నపిల్ల... పిల్లల పెంపకం పెద్దగా తెలియదు అని అమ్మ... ‘ఏం... నేను కన్నతల్లిని కాదా... నాకు తెలియదా వాళ్లకి ఎప్పుడు ఏం చెయ్యాలో’ అంటూ మా ఆవిడ...  పౌడర్‌ డబ్బాలు సొట్టబుగ్గలతో సిగ్గుపడితే కాటుక భరిణెలు ఎగిరి ఎక్కడో పడిపోయేవి.   అమ్మకు అది అర్థం అయ్యింది కాబోలు... ఏదో ఒకటి అనబోవడం.. మధ్యలోనే ఆ మాట మింగేసి మీరూ మీరూ ఒకటే మధ్యలో నేనేగా పరాయిదాన్నీ అనే పాత సినిమా డైలాగుని డెలివర్‌ చేయడం.

ఇప్పటికి మా ఇంట్లో మిక్సీ ఎన్ని జార్లైనా మార్చుకోనీ... కుకర్‌ కొత్త హ్యాండిళ్లు ఎనైన్నా తగిలించుకోనీ... ఫ్రిజ్జూ వాషింగ్‌ మిషనూ టీవీ కవర్లెనైన్నా తొడుక్కోనీ... మా సమ్‌సార నౌక సాగిపోతూనే ఉంది.అది సమస్యారంలో చిక్కుకోకుండా... కనీసం ఇట్లా అయినా ముందుకు వెళ్లేలా చూడు భగవంతుడా అని రోజుకు ఒక్కసారైనా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాను.

ఆ పూటకు నో వంట
‘అమ్మా.. నాన్నా.. నాకు ఉద్యోగం వచ్చింది’ అంటూ ఆనందంగా ఇంటికొస్తాడు చంద్రశేఖర్‌(వినోద్‌కుమార్‌). ‘సరే లే రా’ అని చాలా మామూలుగా అంటుంది తల్లి(వాణిశ్రీ). ‘మూడు వేల మందిలో ఈ ఉద్యోగం నాకే వచ్చింది తెలుసా అమ్మా’ అంటాడు నిష్టూరంగా. ‘నీ  తెలివి తేటలతోనే ఉద్యోగం వస్తే, ఇంతకు ముందంతా రాలేదేం?’ అంతా కోడలు అమ్ములు(సౌందర్య) అదృష్టం. ఇది ఇంట్లో కాలు పెట్టింది.. నీకు ఉద్యోగం వచ్చింది’ అని మురిసిపోతుంది వాణిశ్రీ. సీన్‌ కట్‌ చేస్తే ఇద్దరూ కిచెన్‌లో ఉంటారు.

చందూకి కోడిగుడ్డు ఇగురు ఇష్టమని వాణిశ్రీ వండుతుంటుంది. కాదు.. కాదు ఆయనకి ఆమ్లెట్టే ఇష్టమని చంద్రశేఖర్‌ భార్య(సౌందర్య)మరో పొయ్యి వెలిగిస్తుంది. సీన్‌ కట్‌ చేస్తే డైనింగ్‌ టేబుల్‌పై అమ్మ చేసిన ఇగురు, భార్య చేసిన ఆమ్లెట్లు ఉంటాయి. చంద్రశేఖర్‌ లొట్టలేస్తూ లాగించి రెండిటినీ మెచ్చుకుంటాడు. అక్కడి నుంచి అత్త, కోడళ్ల మధ్య ఈగో క్లాషెస్‌. కిచెన్‌లో గిన్నెలు డీటీఎస్‌ ఎఫెక్ట్స్‌తో నేలను తాకుతుంటాయి. కప్పులు, ప్లేట్లు ముక్కలవుతుంటాయి. తుఫాను తాకిడికి అల్లల్లాడిన చెట్టు కొమ్మల్లాగా తలుపులు దబ దబా కొట్టుకుంటాయి. చందూ ఇంటికొచ్చే టైమయింది. అత్త, కోడలు వంట ప్రయత్నం చేయరు. చంద్రమోహన్‌కి కడుపులో ఎలుకలు పరిగెడుతుంటాయి. వంట చేయమని భార్యని(వాణిశ్రీ), కోడల్ని ప్రాధేయపడతాడు. ఎవరూ స్రై్టక్‌ విరమించరు. సో... ఆ పూటకి నో వంట. వంటింటికి రెస్ట్‌.
– డి.వి.ఆర్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement