ఆషాఢమొస్తోంది..
25న గోల్కొండ జగదాంబ జాతరతో ఆరంభం జూలై 2న విజయవాడ దుర్గమ్మకు బోనం సమర్పణ 9న ఉజ్జయిని మహంకాళి ఉత్సవం 10న రంగం, ఫలహారం బండి ఊరేగింపు 16న పాతబస్తీలో సమర్పణ.. 17న ఘటాల ఊరేగింపు కాకతీయుల కాలంలో ప్రారంభం
ప్రాధాన్యమిచ్చిన కుతుబ్‌షాహీలు
నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది. ఆషాఢమాసంలో నిర్వహించే చారిత్రక బోనాల జాతరకు సిటీ సిద్ధమవుతోంది.ఈ నెల 25న గోల్కొండ జగదాంబ జాతరతో ప్రారంభమయ్యే ఉత్సవాలు.. నెలరోజుల పాటు నగరవ్యాప్తంగా జరగనున్నాయి. డప్పువాయిద్యాలు.. పోతురాజుల విన్యాసాలు.. పలహారం బండ్ల ఊరేగింపు.. తొట్టెల సమర్పణ తదితర వేడుకలు అంబరాన్ని తాకనున్నాయి.
తెలంగాణ సంస్కృతి, ఆచార వ్యవహారాలకు అద్దం పట్టేలా నగరంలో ఆషాఢమాస బోనాల జాతరను ఏటా కన్నుల పండువగా నిర్వహిస్తారు. ఉత్సవాలకు ప్రభుత్వం ఈసారి రూ.10 కోట్లు మంజూరు చేసింది.కాకతీయుల కాలంలో బీజం పడి.. కుతుబ్‌షాహీల పాలనలో ప్రాచుర్యం పొందిన బోనాల జాతరకు ఘన చరిత్ర ఉంది.
గోల్కొండ కోట గొల్లకోటగా కాకతీయుల పాలనతో ఉండేది. ఆనాడు బండరాళ్ల మధ్య స్వయంభూగా వెలసిన జగదాంబిక మహంకాళి అమ్మవారికి ఆలయాన్ని నిర్మించి, నిత్య పూజలు చేసేవారు. మరోపక్క రాజ్యంలో వ్యాధులు ప్రబలకుండా, కరువు కాటకాలు రాకుండా గ్రామాల్లో ఎల్లమ్మ తల్లికి పూజలు చేసేవారు. పంటలు చేతికి వచ్చాక ఆషాఢమాసంలో అమ్మవారికి ఉత్సవాలు నిర్వహించేవారు. ఈ వేడుకను కాకతీయ పాలకు అధికారికంగా గొల్లకొండ నుంచి నిర్వహిండం ప్రారంభిచారని చారిత్రక కథనం. అనంతర కాలంలో గొల్లకొండ ‘గోల్కొండ’గా మారి కుతుబ్‌షాహీల పాలన మొదలైంది. ఈ పాలకులు సైతం ప్రజల నమ్మకాన్ని గౌరవించి అమ్మవారి ఉత్సవాలకు అధిక ప్రాధాన్యమిచ్చారు. బోనాలను అధికారికంగా నిర్వహించిన ఘనత కుతుబ్‌షాహీలదే. వీరి అనంతరం పాలన సాగించిన అసఫ్‌జాహీలు సైతం ఆషాఢ బోనాలను అధికారికంగా కొనసాగించారు. కుతుబ్‌షాహీల కాలం నుంచి స్థానిక ముస్లింలు బోనాల ఏర్పాట్లు, నిర్వహణలో హిందువులకు సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా అమ్మవారి తొట్టెల ఊరేగింపుతోపాటు కోటలో బందోబస్తు ఏర్పాట్లలో కూడా మస్లింలు సహకరిస్తున్నారు.
స్వాతంత్య్రానంతరం..
కోటలో బోనాల ఉత్సవాలు కొనసాగాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో దేవాదాయశాఖ ఏటా ఉత్సవాల నిర్వహణకు కమిటీని నియమించి ఉత్సవాలు నిర్వహించేవారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించారు. రాష్ట్రంలో మొట్టమొదటిగా బోనాలు ప్రారంభమయ్యేది గోల్కొండ కోటలోనే. గత రెండేళ్లుగా దేవాదాయశాఖ అమ్మవార్ల ఆలయానికి కార్యనిర్వహణ అధికారిని, ఉత్సవ కమిటీని నియమించింది. ప్రభుత్వం తరఫున మంత్రులు పట్టువస్త్రాలను సమర్పిస్తున్నారు.