ప్రయాణించే ‘ఇల్లు’ | Traveling on the 'Home' ... | Sakshi
Sakshi News home page

ప్రయాణించే ‘ఇల్లు’

Published Fri, Mar 21 2014 3:08 AM | Last Updated on Sat, Sep 2 2017 4:57 AM

ప్రయాణించే ‘ఇల్లు’

ప్రయాణించే ‘ఇల్లు’

చాలా ప్రాంతాలు తిరగాలని ఉంటుంది. కాని ఇల్లు దాటాలంటే రూట్ మ్యాప్ నుంచి రూమ్‌లు తీసుకోవడం దాకా బోలెడన్ని సమస్యలు. అందుకే... ఒళ్లు నలగకుండా కళ్లు తిప్పుకోలేని అందమైన పర్యాటక ప్రాంతాలను చూసిరావాలనుకునే వారి కోసం ఓ ఇల్లు లాంటి వాహనం పరిచయమైంది. కారవాన్ టూరిజం పేరుతో రాష్ట్ర పర్యాటకశాఖ వినూత్నశైలిలో సమర్పిస్తున్న ఈ కదిలే ఇల్లు ఇటీవలే పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది.

 ఏమిటీ స్పెషల్?
 

ఈ విలాసవంతమైన వాహ నం ఒక పరిమిత కుటుంబం సంతృప్తిగా, సుఖంగా టూర్ ను పూర్తి చేసేందుకు రూపకల్పన చేయడం జరిగింది. అచ్చం ఇంట్లోనే ఉన్నంత హాయిగా నచ్చిన ప్రదేశానికి వెళ్లి వచ్చేయడానికి ఇది ఉపకరిస్తుంది. పూర్తిగా ఎయిర్‌కండిషన్ చేసిన ఈ కారవాన్ 7 సీటర్ వాహనం. ఇందులో 2 సీట్లు సోఫా కమ్ బెడ్ సౌకర్యం ఉంది. ప్రయాణంలో విసుగు పుట్టకుండా నచ్చిన సినిమానో, మరొకటో చూసేందుకు వీలుగా రెండు ఎల్‌ఇడి స్క్రీన్‌లు కూడా అమర్చారు. దీనితో పాటే డివిడి ప్లేయర్ కూడా సిద్ధంగా ఉంచారు. దీనిలోనే రిఫ్రిజరేటర్, మైక్రోఓవెన్, అటాచ్డ్ టాయిలెట్, డ్రైవర్‌కు మనకు మధ్య పూర్తి పార్టిషన్, డ్రైవర్‌తో మాట్లాడేందుకు ఇంటర్‌కమ్... వంటివి కూడా ఉన్నాయి. మార్గమధ్యంలో వాహనాన్ని నిలిపి, ఎండ పడకుండా నీడలో సేద తీరుతూ కబుర్లు చెప్పుకుంటూ ఫలహారాలు తీసుకోవాలనుకుంటే వాహనంపై నుంచి ఎక్స్‌ట్రా రూఫ్ టాప్ కూడా మీ కోసం దిగొస్తుంది. డ్రైవర్‌తో సహా అందుబాటులోకి వచ్చే ఈ వాహనంలో బాగా దూర ప్రయాణానికైతే అదనపు డ్రైవర్‌ను కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
 

హైదరాబాద్ నుంచి ఎక్కడికైనా...
 

ఈ వాహనాన్ని హైదరాబాద్ నుంచి ఏ ప్రాంతానికి కావాల్సి వచ్చినా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు. కనీసం 8 గంటల సమయం, 80 కి.మీ కోసం రూ.4 వేలు తీసుకుంటారు. అలాగే 12 గంటలు 200 కి.మీకైతే రూ. 6,000 వసూలు చేస్తారు. 24 గంటలు, 400 కి.మీ అయితే రూ.10వేలు చెల్లించాలి. ప్రతి అదనపు కిలో మీటరు దూరానికి రూ.25, అదనపు గంటకు రూ.300 చొప్పున చెల్లించాలి. (పన్నులు అదనం). మరిన్ని వివరాలకు...
 టోల్‌ఫ్రీనెం.180042545454 సంప్రదించవచ్చు.
 - ఎస్.సత్యబాబు
 
 
 ఈ తరహా విలాసవంతమైన వాహనాన్ని మధ్యప్రదేశ్‌లో తొలుత పరిచయం చేశారు. ఆ తర్వాత మేము అందుబాటులోకి తెచ్చాం. వ్యక్తిగత ప్రయాణాలకు రూముల అద్దెల వంటి ఖర్చులు లెక్కేసుకుంటే ఇది అందుబాటులో ఉన్నట్టే. పర్యాటకు లు హైదరాబాద్‌లోని పర్యాటకభవన్ నుంచి కానీ, ట్యాంక్‌బండ్, బషీర్‌బాగ్‌లలో ఉన్న టూరిజం కార్యాలయాల్లో కానీ ఈ వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు.
 - మధుసూదన్, పర్యాటకశాఖ
 ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (మార్కెటింగ్ )
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement