గోల్కొండ.. పర్యాటకానికి అండ
పంద్రాగస్టు వేడుకలతో సందర్శకుల తాకిడి
* చార్మినార్‌ను వెనక్కి నెట్టిన వైనం
సాక్షి, హైదరాబాద్: గోల్కొండ కోట పర్యాటకరంగానికి ఊతమిస్తోంది. సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాదిలోనే గత ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాలను గోల్కొండ కోటపై ప్రభుత్వం నిర్వహించింది. మువ్వన్నెల జెండా రెపరెపలు గోల్కొండకు కొత్త ఊపునిచ్చాయి. దీంతో గోల్కొండకు పర్యాటకుల తాకిడి పెరిగింది. అప్పటి వరకు తెలంగాణలో అత్యధిక పర్యాటకులు సందర్శించే చారిత్రక స్థలంగా రికార్డుల్లో నమోదైన చార్మినార్‌ను వెనక్కునెట్టి గోల్కొండ అగ్రస్థానాన్ని ఆక్రమించింది.
మరోసారి గోల్కొండ కోట మీద జాతీయ పతాకం సగర్వంగా ఎగరనుండటంతో ఈసారి కూడా కోట ఖ్యాతి మరింత విస్తరించనుంది. పంద్రాగస్టు వేడుకలను కోటలో నిర్వహించటంతో గత సంవత్సరం ఆగస్టులో దేశవిదేశాల్లో దానికి ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. దీంతో సరిహద్దులు దాటి పర్యాటకులు కోట వైపు క్యూ కట్టారు. గత సంవత్సరం ఆగస్టు వరకు నెలకు సగటున లక్ష మంది పర్యాటకులు కోటను సందర్శిస్తూ రాగా... ఆ తర్వాత అది 1.60 లక్షలకు చేరుకుంది. అప్పటి వరకు సగటున నెలకు లక్షన్నర మంది పర్యాటకులతో తొలిస్థానంలో ఉన్న చార్మినార్ ఇప్పుడు రెండోస్థానానికి పడిపోయింది.
గోల్కొండకు పర్యాటకుల తాకిడి స్థిరంగా ఉంటుందని గుర్తించిన కేంద్రపురావస్తు శాఖ ప్రత్యేక చర్యలకూ సిద్ధమైంది. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కోటలోని ‘సౌండ్ అండ్ లైట్ షో’కు కూడా పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది. దీన్ని కూడా మరింత ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ సిద్ధమైంది. గత ఆగస్టు 15కు పూర్వం సగటున రోజుకు వంద మంది సౌండ్ అండ్ లైట్ షోను సందర్శిస్తుండగా ఒక్కసారిగా ఆ సంఖ్య 500 ను చేరుకోవటం విశేషం. అప్పటి వరకు రోజుకు రూ.పది వేలలోపు ఆదాయం ఉండగా అది ప్రస్తుతం రూ.75 వేలకు చేరింది. ముఖ్యంగా విదేశీ పర్యాటకుల రాక భారీగా పెరిగింది. సగ టున నెలకు 1200 విదేశీ పర్యాటకులు కోట దర్శనానికి వస్తుండడం విశేషం.