హిమాలయ పర్యాటక దేశమైన భూటాన్ తమ దేశానికి వచ్చే పర్యాటకులకు శుభవార్త చెప్పింది. తమ దేశంలో పర్యటించే టూరిస్టులకు విధించే డైలీ ఫీజును సగానికి తగ్గించింది. ఇప్పటి వరకు 200 డాలర్లు (రూ.16,500) ఉన్న డైలీ ఫీజును 100 డాలర్లు (రూ.8,250)లకు తగ్గిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.
"సస్టైనబుల్ డెవలప్‌మెంట్ ఫీజు" పేరుతో పర్యాటకుల నుంచి వసూలు చేస్తున్న ఈ డైలీ ఫీజును గత సంవత్సరం సెప్టెంబర్‌లో 65 డాలర్ల నుంచి ఏకంగా 200 డాలర్లకు పెంచింది భూటాన్. ఈ మొత్తాన్ని కాలుష్య నివారణకు వెచ్చించనున్నట్లు అప్పట్లో పేర్కొంది. ఇప్పుడు తగ్గించిన డైలీ ఫీజు సెప్టెంబర్ నెల నుంచి అమలులోకి వస్తుందని, నాలుగు సంవత్సరాల పాటు కొనసాగుతుందని భూటాన్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
కొన్నేళ్ల ముందు వరకూ బయటి దేశాలతో సంబంధాలు లేకుండా భూటాన్ 1974లో తొలిసారిగా 300 మంది పర్యాటకులను తమ దేశ సందర్శనకు అనుమతించింది. 2019లో ఈ సంఖ్య 3,15,600కి పెరిగింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 15.1 శాతం పెరిగింది.
పర్యాటకుల రద్దీని పెద్దగా ఇష్టపడని భూటాన్.. తమ దేశంలోని శిఖరాల పవిత్రతను కాపాడేందుకు పర్వతారోహణను నిషేధించింది. సందర్శన ఫీజు వసూలు కారణంగా ఆ దేశంలో పర్యటించేవారి సంఖ్య తక్కువగానే ఉంటోంది. అయితే 3 బిలియన్ డాలర్లున్న తమ ఆర్థిక వ్యవస్థ మరింత పెంచుకోవాలని భావిస్తున్న భూటాన్ ఇందుకోసం పర్యాటక రంగం నుంచి వస్తున్న 5 శాతం ఆదాయాన్ని 20 శాతానికి పెంచుకోవాలని చూస్తోంది.
ప్రధానంగా బౌద్ధ దేశమైన భూటాన్‌లో అనేక మతపరమైన, సాంస్కృతిక కార్యక్రమాలు సెప్టెంబర్-డిసెంబర్ కాలంలో ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో డైలీ ఫీజును సగానికి తగ్గించడం వల్ల పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని ఆ దేశ పర్యాటక శాఖ డైరెక్టర్ జనరల్ దోర్జీ ధ్రాధుల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
గత జూన్‌లోనే పర్యాటకుల బస రుసుములపై ప్రభుత్వం నిబంధనలను సడలించింది. కానీ ఆశించినస్థాయిలో పర్యాటకుల సంఖ్య పెరగలేదు. గత జనవరి నుంచి 56,000 మందికిపైగా పర్యాటకులు భూటాన్‌ను సందర్శించారని, ఇందులో దాదాపు 42,000 మంది భారతీయులే ఉన్నారని ధ్రాధుల్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment