కరోనా కారణంగా భారీగా దెబ్బతిన్న రంగం పర్యాటకం. ట్రావెల్ బ్యాన్, కఠిన ఆంక్షల కారణంగా లెక్కకు అందని నష్టం వాటిల్లింది ఈ రంగానికి. ముఖ్యంగా లక్షల మంది ఉపాధి లేకుండా పోయారు. మరోవైపు టూరిజం ఆకర్షణగా ఉన్న ప్రాంతాలు.. ఉనికిని కోల్పోయే స్థితికి చేరుకున్నాయి. ఈ తరుణంలో థాయ్‌లాండ్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
థాయ్‌లాండ్‌కు టూర్ మీద వెళ్లే వాళ్లు ఇకపై డబ్బులు చెల్లించాల్సిందే. ఈ మేరకు 300 బహ్త్(9 డాలర్లు-మన కరెన్సీలో 665 రూ.) టూరిస్ట్ ఎంట్రీ ఫీజును ఫిక్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఎంట్రీ ఫీజును సందర్శన ప్రాంతాల అభివృద్ధి కోసం, అలాగే సందర్శకుల ఇన్సూరెన్స్ కోసం ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ ఎంట్రీ ఫీజు నిర్ణయం ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
కాకపోతే విమాన ప్రయాణికుల విషయంలో.. ఈ ఫీజును విమాన ఛార్జీలకు ఏప్రిల్ నుంచి జత చేయనున్నట్లు పేర్కొంది. అయితే ఇతర మార్గాల గుండా వచ్చే సందర్శకుల విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక ఈ ఫీజు.. చాలాదేశాల్లో వసూలు చేస్తున్న టూరిస్ట్ ఫీజుకు సమానంగానే ఉందని, కానీ, సందర్శకులకు కలిగే ప్రయోజనాలు మాత్రం అదనంగా ఉంటున్నాయని లెక్కలతో సహా చెప్తోంది థాయ్‌లాండ్ ప్రభుత్వం.
ఒకవైపు ప్రపంచం అంతా ఒమిక్రాన్, కరోనా కేసుల భయంతో ఆంక్షలు విధిస్తుంటే.. థాయ్‌లాండ్ మాత్రం టూరిస్టులకు వెల్‌కమ్ చెప్తోంది. భారత్ నుంచి రాజధాని బ్యాంకాక్‌కు ఎక్కువ మంది క్యూ కడతారన్న విషయం తెలిసిందే. ఇక కరోనా కారణంగా దెబ్బతిన్న థాయ్ టూరిజాన్ని.. తిరిగి నిలదొక్కుకునేలా చేసేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తోంది. ఈ క్రమంలోనే టూరిజం ఎంట్రీ ఫీజు విధించింది. ప్రస్తుతం యాభై లక్షల మంది సందర్శకులు వస్తారని థాయ్ ప్రభుత్వం భావిస్తోంది. యూరప్, అమెరికాల నుంచి రెగ్యులర్ టూరిస్టుల తాకిడి ఉందని ప్రకటించుకుంది. మరోవైపు భారత్, చైనా గనుక తమ ప్రజలకు సడలింపులు ఇస్తే.. ఆ సంఖ్య 90 లక్షలకు చేరుతుందని భావిస్తోంది. ఒకవేళ భూమార్గం సరిహద్దులు గనుక తెరిస్తే.. ఆ సంఖ్య కోటి యాభై లక్షలకు చేరొచ్చని అంచనా వేస్తోంది.
చదవండి: మహీంద్రా గ్రూప్స్ సంచలన నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment