న్యూఢిల్లీ: దేశీయంగా పర్యాటక రంగానికి ఊతమిచ్చే దిశగా వీసా ప్రక్రియను సరళతరం చేయడంపై ప్రభుత్వం కసరత్తు చేయాలని, యూజర్‌లకు సులభతరంగా ఉండేలా చూడాలని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ పేర్కొంది. అలాగే భారత్ వచ్చే టూరిస్టుల్లో భద్రతపరమైన ఆందోళనలను తొలగించేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించింది. కన్సల్టెన్సీ సంస్థ నాంగియా ఆండర్సన్‌తో కలిసి రూపొందించిన నివేదికలో ఫిక్కీ ఈ మేరకు ప్రతిపాదనలు చేసింది.
ఈ రిపోర్టు ప్రకారం 2022 – 2027 మధ్య కాలంలో భారత్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య ఏటా 12 శాతం పెరగనుంది. ఇతరత్రా అవసరాలపై వెచ్చించగలిగే స్థాయిలో ఆదాయాలు పెరుగుతుండటం, మధ్య తరగతి జనాభా వృద్ధి చెందుతుండటం, పర్యాటకానికి గమ్యస్థానంగా భారత్ గుర్తింపు పొందుతుండటం తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి.
మహమ్మారిపరమైన సవాళ్లు తలెత్తినప్పటికీ 2022లో భారత్‌కు 62 లక్షల మంది విదేశీ టూరిస్టులు వచ్చారు. ఇది 2021లో వచ్చిన 15.2 లక్షల మందితో పోలిస్తే దాదాపు 307 శాతం అధికం. 2022లో భారత స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) ట్రావెల్, టూరిజం రంగం వాటా 9.2 శాతంగా నిల్చింది. 4.46 కోట్ల ఉద్యోగాలు కల్పించింది. పర్యాటకుల దృష్టికోణంలో భారత్‌ను ఆకర్షణీయ గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు అమలు చేయతగిన విధానాలను రూపొందించడానికి ఈ రిపోర్ట్ ఉపయోగపడగలదని నాంగియా ఆండర్సన్ మేనేజింగ్ పార్ట్‌నర్ సూరజ్ నాంగియా చెప్పారు.
నివేదికలోని మరిన్ని అంశాలు ..
►వీసా ప్రక్రియలను క్రమబద్ధీకరించాలి. మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలి. పర్యాటకం వృద్ధికి ఊతమిచ్చేందుకు ప్రైవేట్ రంగంతో భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలి. టెక్నాలజీని వినియోగించుకోవాలి.
►టూరిస్ట్ పోలీసుల సంఖ్యను పెంచడం ద్వారా పర్యాటకులకు భద్రతపరమైన భరోసా కల్పించాలి. టూరిస్టుల వేధింపులు, వారిపై నేరాలను కట్టడి చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలి.
► భారత్‌లో ఆకర్షణీయమైన, విశిష్టమైన సాంస్కృతిక, సహజ సిద్ధ పర్యాటక స్థలాలు ఉన్నాయి. హెరిటేజ్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం, వెల్‌నె స్ టూరిజం వంటివి ఆఫర్ చేయడం ద్వారా వాటిని అభివృద్ధి చేయవచ్చు. ఇందుకోసం మార్కెటింగ్‌పరమైన ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం, ప్రైవేట్ రంగంతో కలిసి పనిచేయడం వంటి అంశాలు పరిశీలించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment