పర్యాటకులు లేక వెలవెలబోతున్న భవానీద్వీపం
సాక్షి, విజయవాడ: కృష్ణానదిలో రివర్ బోటింగ్ అండ్ అడ్వంచర్ సంస్థ బోటు బోల్తాపడి 22 మంది మృత్యువాత పడ్డాక పర్యాటక శాఖ ఆదాయం నేలచూపులు చూస్తోంది. నదిలో బోట్లు ఎక్కడానికే ప్రజలు భయపడుతున్నారు. నిన్న, మొన్నటి వరకు భవానీ ద్వీపం భారీగా తరలి వచ్చే సందర్శకులతో నిత్య కల్యాణం, పచ్చ తోరణం అన్నట్లు కళకళలాడేది. వారంలో కనీసం రెండు మూడు వేడుకలు జరిగేవి. పర్యాటక సంస్థ బోట్లతో పాటు ప్రైవేటు బోట్లతో సందర్శకులు నదీ విహారం చేసేవారు. అయితే ప్రస్తుతం భవానీద్వీపం సందర్శకులు లేక వెలవెలపోతోంది.
ఆదాయానికి భారీగా గండి
సాధారణ రోజుల్లో ఐదారు వందల మంది, శని,ఆదివారాల్లో రెండువేల మంది వరకు సందర్శకులు వచ్చేవారు. కృష్ణానదిలో బోటు ప్రమాదం జరిగిన రోజు సుమారు ఐదువేల మంది పర్యాటకులు భవానీద్వీపంలో ఉన్నారు. రెండు వేల మంది వరకు వస్తే ద్వీపానికి, బోటింగ్‌కు కలిసి లక్ష రూపాయల ఆదాయం వచ్చేది. సాధారణ రోజుల్లో రూ.25 వేల ఆదాయం సమకూరేది. ప్రమాదం జరిగిన తరువాత పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. గత శని, ఆదివారాల్లో కేవలం రెండు మూడు వందల మంది మాత్రమే వచ్చారని, ఆదాయం రూ.10 వేలకు మించి రాలేదని పర్యాటక సంస్థ సిబ్బంది పేర్కొన్నారు. వారం రోజులుగా రోజుకు 100 మంది లోపే వచ్చారు. కార్తీకమాసంలో వారానికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయం వచ్చింది. గత వారంలో రూ.50 వేలు కూడా రాలేదని సిబ్బంది పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన తరువాత ద్వీపం నిర్వహణ ఖర్చులు రావడం లేదు.
పోలీసుల ఆంక్షలు
గతంలో కంపెనీల పార్టీలకు భవానీద్వీపాన్ని, బోట్లను అద్దెలకు ఇచ్చేవారు. ప్రమాదం జరిగిన తరువాత పోలీసు ఆంక్షలు బాగా పెరిగిపోయాయి. గత ఆదివారం భవానీద్వీపంలో ఓ ప్రైవేటు కార్యక్రమం కోసం నిర్వాహకులు మూడు నెలల క్రితం బుక్ చేసుకున్నారు. తొలుత నిర్వహకులకు ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలని పర్యాటక సంస్థ చెప్పినట్లు సమాచారం. చివరకు పోలీసుల అనుమతులతో అతికష్టం మీద ఆ కార్యక్రమం జరిగింది. బోట్లను సూర్యాస్తమయం తరువాత తిప్పడం లేదు. శని, ఆదివారాల్లో గ్రూపు బుకింగ్‌లను నిలుపుదల చేశారు. పోలీసులు, పర్యాటక అధికారులు ఇప్పుడు తీసుకున్న జాగ్రత్తలో సగమైన గతంలో తీసుకుని ఉంటే ప్రమాదం జరిగి 22 మంది ప్రాణాలు పోయేవి కావని సందర్శకులు పేర్కొంటున్నారు.
పడవల్లో ప్రయాణానికి అర్చకులు విముఖత
పవిత్ర సంగమం వద్ద కృష్ణమ్మకు హారతులు ఇచ్చేందుకు రోజూ 15 మంది అర్చకులు బోట్లలో నది మధ్యలోకి వెళ్తారు. బోటు ప్రమాదం అనంతరం అర్చకులు బోట్లలో నదిలోకి వెళ్లేందుకు అంగీకరించడంలేదని దుర్గగుడి వర్గాలు పేర్కొన్నాయి. బోట్లకు బదులుగా జట్టీ, లేదా ఫంట్ ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులు భావిస్తున్నారు. నది మధ్యలో ఏర్పాటు చేసిన ఫంట్‌ను ఒకటికి రెండుసార్లు పర్యాటకశాఖ, జల వనరులశాఖ అధికారులతో తనిఖీ చేయించనున్నారు.
పవిత్ర సంగమం వద్ద బోల్తాపడిన బోటు ఇదే (ఫైల్)
Comments
Please login to add a commentAdd a comment