Bhavani island
-
విజయవాడ భవానీ ఐలాండ్ లో వన భోజనాల సందడి (ఫొటోలు)
-
Vijayawada: విజయవాడ భవానీ ద్వీపంలో కార్తీక మాసం సందడి (ఫొటోలు)
-
‘బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకి వెళ్లే యోచన లేదు’
విజయవాడ: బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకి వెళ్లే ప్రసక్తే లేదని మంత్రి ఆర్కే రోజా తేల్చిచెప్పారు. గతంలో రెండుసార్లు పిలిచినప్పుడు వెళ్లడం కుదరలేదని.. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ ఎపిసోడ్లో తర్వాత అన్‌స్టాపబుల్ షోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నానని మంత్రి రోజా పేర్కొన్నారు. లోకేష్ పాదయాత్ర చేసినా, పవన్ వారాహి అంటూ వచ్చినా వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం తథ్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధిస్తామని రోజా ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంచితే, విజయవాడ భవానీ ద్వీపంలో సంక్రాంతి ముగింపు వేడుకల్లో రోజా పాల్గొన్నారు. దీనిలో భాగంగా మాట్లాడుతూ.. భవానీ ద్వీపంలో సంక్రాంతి సంబరాలు బాగా జరిగాయి. ఏపీ పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నాం. టెంపుల్ టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించాం. నదీతీరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం.. పబ్లిక్-ప్రైవేటు విధానంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం’ అని పేర్కొన్నారు. -
పర్యాటకంలో సంక్రాంతి సందడి
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల్లో సంక్రాంతి సందడి నెలకొంది. ఈ ఏడాది పర్యాటక ప్రదేశాలు, శిల్పారామాల్లో సంక్రాంతి సంబరాలకు ఏపీ శిల్పారామం, ఏపీటీడీసీ ఏర్పాట్లు చేశాయి. విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, తిరుపతి, కడప, పులివెందుల, అనంతపురం, పుట్టపర్తి శిల్పారామాల్లో 14 నుంచి 16వ తేదీ వరకు మూడు రోజులపాటు ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించనున్నారు. సందర్శకులను అలరించేలా ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. మహిళలకు ముగ్గుల పోటీలు, ‘సంక్రాంతి లక్ష్మి’ పేరుతో సంప్రదాయ వస్త్రధారణ పోటీలు నిర్వహించి బహుమతులు అందించనున్నారు. తెలుగు సంస్కృతికి అద్దం పట్టేలా హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, జానపద, సంప్రదాయ కళారీతుల ప్రదర్శనకు సర్వం సిద్ధంచేశారు. బుల్లితెర హాస్యనటులతో హాస్యవల్లరి, భోజనప్రియులకు నోరూరించేలా పల్లె రుచులతో ఫుడ్ కోర్టులను ఏర్పాటుచేస్తున్నారు. నేటి నుంచి భవానీ ద్వీపంలో.. దేశంలోనే అతిపెద్ద నదీ ద్వీపమైన విజయవాడ భవానీ ఐలాండ్‌లో బుధవారం నుంచి సోమవారం వరకు ఆరు రోజులపాటు ‘సంక్రాంతి ఫెస్ట్’ నిర్వహించనున్నారు. పల్లెటూరి సంప్రదాయ జీవనాన్ని ప్రతిబింబించేలా ఈ ఫెస్ట్‌లో వినూత్న కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. చేతివృత్తి కళాకారుల స్టాల్స్, ఎగ్జిబిషన్‌తోపాటు మహిళలు, చిన్నారులకు ముగ్గులు, వంటల పోటీలు, సంప్రదాయ వస్త్రధారణ, జానపద గీతాలు, డ్రాయింగ్, గాలిపటాల తయారీ పోటీలు నిర్వహించనున్నారు. చిన్నారులకు మన సంస్కృతిలోని సైన్స్ గొప్పదనాన్ని చాటిచెప్పేలా థీమ్స్‌ను రూపొందించారు. పాపికొండల యాత్రకు ఫుల్ డిమాండ్... సంక్రాంతి సందర్భంగా పర్యాటకులు పాపికొండల బోటింగ్‌కు క్యూకడుతున్నారు. ప్రస్తుతం భద్రాచలం వైపున పోచవరం, దేవీపట్నంలోని గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ల నుంచి 29 బోట్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇప్పటికే చాలాబోట్లలో అడ్వాన్స్ బుకింగ్‌లు ఊపందుకున్నాయి. ఆదివారం, సోమవారాల్లో పర్యాటక శాఖ బోట్లు ముందస్తు బుకింగ్‌లతో నిండిపోయాయి. పోచవరం నుంచి పెద్దలకు రూ.950, చిన్నారులకు రూ.750, గండిపోచమ్మ నుంచి పెద్దలకు రూ.1,250, చిన్నారులకు రూ.1,050గా టికెట్ ధర ఉంది. ఇక పర్యాటక శాఖ హోటళ్లు, రిసార్టులు సైతం నిండిపోయాయి. పాపికొండల అందాలు -
అలా.. జల విహారం!
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా జల విహారానికి (బోటింగ్) ఆదరణ పెరుగుతోంది. పర్యాటక శాఖతో పాటు ప్రైవేటు బోట్లు టూరిస్టులతో నిత్యం కళకళలాడుతున్నాయి. ఫలితంగా ఏటా ఆదాయం రెట్టింపు అవుతుండడంతో పాటు ఒక్క బోటింగ్ నుంచే కార్పొరేషన్‌కు ఎక్కువ రాబడి వస్తుండడం విశేషం. ఈ క్రమంలో పర్యాటక శాఖ కొత్త బోట్ల కొనుగోలుకు కసరత్తు చేస్తోంది. తొలిదశలో భాగంగా విజయవాడ (భవానీ ద్వీపం), నాగార్జున సాగర్, విశాఖ ఫిషింగ్ హార్బర్లో అత్యాధునిక సౌకర్యాలతో 40 మంది ప్రయాణ సామర్థ్యం కలిగిన స్టీల్ బోట్లను అందుబాటులోకి తేనుంది. వీటి కోసం సుమారు రూ.7 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. తర్వాతి దశలో రాజమండ్రి, శ్రీశైలంలోనూ కొత్తవి తీసుకురానున్నారు. గతంతో పోలిస్తే రెట్టింపు ఆదాయం.. రాష్ట్రంలో ప్రస్తుతం 45 పర్యాటక శాఖ బోట్లు ఉండగా వాటిలో 40 బోట్లు నిత్యం నడుస్తున్నాయి. మరో 72 ప్రైవేటు బోట్లు పర్యాటకులకు సేవలందిస్తున్నాయి. గతంలో కరోనా కారణంగా ఎక్కడికక్కడ బోటింగ్ నిలిచిపోవడంతో ఆదాయం ఒక్కసారిగా పడిపోయింది. అయితే ప్రస్తుతం వస్తున్న రాబడి కరోనా ముందు నాటి సాధారణ పరిస్థితులను తలపిస్తుండటం విశేషం. కరోనా మొదటి వేవ్‌లో సుదీర్ఘ విరామం తర్వాత బోటింగ్ ప్రారంభమవగా సెప్టెంబర్ 2020 నుంచి ఏప్రిల్ 2021 (17వ తేదీ) వరకు రూ.2.79 కోట్ల ఆదాయం వచ్చింది. సెకండ్ వేవ్ విరామం అనంతరం సెప్టెంబర్ 2021 నుంచి ఏప్రిల్ 2022 (17వ తేదీ) వరకు రూ.4.72 కోట్ల రాబడి నమోదైంది. ఇటువంటి తరుణంలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు పర్యాటకశాఖ చర్యలు చేపడుతోంది. బోటింగ్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది! పర్యాటకులు జల విహారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే బోటింగ్ ద్వారా రాబడి కూడా గణనీయంగా పెరుగుతోంది. డిమాండ్, అవసరాన్ని బట్టి కొత్త ప్రదేశాల్లోనూ బోటింగ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆలోచిస్తున్నాం. – ఆరిమండ వరప్రసాద్ రెడ్డి, ఏపీటీడీసీ చైర్మన్ -
భవానీ ద్వీపం: పడవ సరదాలో పర్యాటకులు (ఫోటోలు)
-
వారం రోజుల్లో కొత్త టూరిజం పాలసీ: మంత్రి అవంతి
సాక్షి, విజయవాడ: భవాని ఐల్యాండ్‌ను ఈ నెల 10వ తేదీన తిరిగి ప్రారంభిస్తామని టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వారం రోజుల్లో కొత్త టూరిజం పాలసీని తీసుకువస్తున్నట్లు చెప్పారు. బోటింగ్‌కు ఇప్పటికే అనుమతినిచ్చామని, ప్రకాశం బ్యారేజీ గేట్లు మూసివేసిన తరువాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి వస్తుందన్నారు. పాపికొండలకు తప్ప అన్ని చోట్లకు బోటింగ్‌కు అనుమతినిచ్చామని చెప్పారు. బోటింగ్ జరిగే చోట కమాండ్ కంట్రోల్ రూం పని చేస్తుందని, గతంలో జరిగిన ఘటనలు దృష్టిలో ఉంచుకొని అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. రాబోయే రోజుల్లో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అవంతి చెప్పారు. చదవండి: నాడు భయమేసింది.. నేడు సంతోషంగా ఉంది: పెద్దిరెడ్డి -
భవానీ ఐలాండ్‌ను పునరుద్దరిస్తాం
-
‘భవానీ ద్వీపంలో రూ.2 కోట్ల ఆస్తి నష్టం’
సాక్షి, అమరావతి : ఇటీవల వచ్చిన వరదలతో భవానీ ద్వీపం ఐదడుగుల మేర నీట మునిగి, రూ.2 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని ఆంధ్రపదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. బరంపార్కు, భవానీ ద్వీపంలో వరద వల్ల దెబ్బతిన్న ప్రాంతాన్ని మంత్రి మంగళవారం పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. వరదల వల్ల భవానీ ద్వీపంలోని రక్షణ గోడ, ల్యాండ్ స్కేపింగ్, టవర్, రెస్టారెంట్లు, మ్యూజికల్ ఫౌంటేన్‌కు తీవ్ర నష్టం జరిగిందన్నారు. భవానీ ద్వీపానికి చిహ్నమైన పైలాన్ కాంక్రీట్ బేస్మెంట్ దెబ్బతిన్నదని, 44 రోజుల్లో వీటిని పునరుద్ధరించేందుకు అధికారులకు ఆదేశాలిచ్చినట్లు మంత్రి తెలిపారు. భవానీ ద్వీపంలో టీడీపీ హయాంలో నాసిరకం పనులు జరిగాయని, వరదలు వస్తాయని తెలిసినా కూడా అందుకు తగిన విధంగా భవానీ ద్వీపాన్ని అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. దీనిపై విచారణ జరిపిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం విజయవాడ కనకదుర్గమ్మ గుడి నుంచి భవానీ ఐలాండ్‌కు రోప్‌వే ఏర్పాటు చేసేందుకు అధ్యయనం చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. గత ప్రభుత్వం లాగా బాహుబలి గ్రాఫిక్స్ చూపించబోమని ఎద్దెవావ చేశారు. లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తడం సహజమని, అందుకే లోతట్టు ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టేటప్పుడు జాగ్రత్తలు వహించాలన్నారు. రాష్ట్రాన్ని టూరిజంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని, ద్వీపంలోకి సెప్టెంబర్ 1 నుంచి సందర్శకుల్ని యధావిధిగా అనుమతిస్తామని వివరించారు. -
భవానీ ద్వీపాన్ని సందర్శించిన మంత్రులు
సాక్షి, విజయవాడ: కృష్ణా నదిలో నెలవైన భవానీ ద్వీపాన్ని మంత్రులు అవంతి శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా భవానీ ద్వీపం అభివృద్ధితోపాటు పర్యాటక ప్రాంతాలలో మౌలిక వసతులు కల్పించడం వంటి అంశాలపై అధికారులతో మంత్రులు చర్చించారు. పర్యాటక అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన విషయమై అధికారులతో జరిగిన ఈ సమావేశంలో మంత్రులతోపాటు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్ పాల్గొన్నారు. -
పర్యాటకం ఢమాల్
సాక్షి, విజయవాడ: కృష్ణానదిలో రివర్ బోటింగ్ అండ్ అడ్వంచర్ సంస్థ బోటు బోల్తాపడి 22 మంది మృత్యువాత పడ్డాక పర్యాటక శాఖ ఆదాయం నేలచూపులు చూస్తోంది. నదిలో బోట్లు ఎక్కడానికే ప్రజలు భయపడుతున్నారు. నిన్న, మొన్నటి వరకు భవానీ ద్వీపం భారీగా తరలి వచ్చే సందర్శకులతో నిత్య కల్యాణం, పచ్చ తోరణం అన్నట్లు కళకళలాడేది. వారంలో కనీసం రెండు మూడు వేడుకలు జరిగేవి. పర్యాటక సంస్థ బోట్లతో పాటు ప్రైవేటు బోట్లతో సందర్శకులు నదీ విహారం చేసేవారు. అయితే ప్రస్తుతం భవానీద్వీపం సందర్శకులు లేక వెలవెలపోతోంది. ఆదాయానికి భారీగా గండి సాధారణ రోజుల్లో ఐదారు వందల మంది, శని,ఆదివారాల్లో రెండువేల మంది వరకు సందర్శకులు వచ్చేవారు. కృష్ణానదిలో బోటు ప్రమాదం జరిగిన రోజు సుమారు ఐదువేల మంది పర్యాటకులు భవానీద్వీపంలో ఉన్నారు. రెండు వేల మంది వరకు వస్తే ద్వీపానికి, బోటింగ్‌కు కలిసి లక్ష రూపాయల ఆదాయం వచ్చేది. సాధారణ రోజుల్లో రూ.25 వేల ఆదాయం సమకూరేది. ప్రమాదం జరిగిన తరువాత పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. గత శని, ఆదివారాల్లో కేవలం రెండు మూడు వందల మంది మాత్రమే వచ్చారని, ఆదాయం రూ.10 వేలకు మించి రాలేదని పర్యాటక సంస్థ సిబ్బంది పేర్కొన్నారు. వారం రోజులుగా రోజుకు 100 మంది లోపే వచ్చారు. కార్తీకమాసంలో వారానికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయం వచ్చింది. గత వారంలో రూ.50 వేలు కూడా రాలేదని సిబ్బంది పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన తరువాత ద్వీపం నిర్వహణ ఖర్చులు రావడం లేదు. పోలీసుల ఆంక్షలు గతంలో కంపెనీల పార్టీలకు భవానీద్వీపాన్ని, బోట్లను అద్దెలకు ఇచ్చేవారు. ప్రమాదం జరిగిన తరువాత పోలీసు ఆంక్షలు బాగా పెరిగిపోయాయి. గత ఆదివారం భవానీద్వీపంలో ఓ ప్రైవేటు కార్యక్రమం కోసం నిర్వాహకులు మూడు నెలల క్రితం బుక్ చేసుకున్నారు. తొలుత నిర్వహకులకు ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలని పర్యాటక సంస్థ చెప్పినట్లు సమాచారం. చివరకు పోలీసుల అనుమతులతో అతికష్టం మీద ఆ కార్యక్రమం జరిగింది. బోట్లను సూర్యాస్తమయం తరువాత తిప్పడం లేదు. శని, ఆదివారాల్లో గ్రూపు బుకింగ్‌లను నిలుపుదల చేశారు. పోలీసులు, పర్యాటక అధికారులు ఇప్పుడు తీసుకున్న జాగ్రత్తలో సగమైన గతంలో తీసుకుని ఉంటే ప్రమాదం జరిగి 22 మంది ప్రాణాలు పోయేవి కావని సందర్శకులు పేర్కొంటున్నారు. పడవల్లో ప్రయాణానికి అర్చకులు విముఖత పవిత్ర సంగమం వద్ద కృష్ణమ్మకు హారతులు ఇచ్చేందుకు రోజూ 15 మంది అర్చకులు బోట్లలో నది మధ్యలోకి వెళ్తారు. బోటు ప్రమాదం అనంతరం అర్చకులు బోట్లలో నదిలోకి వెళ్లేందుకు అంగీకరించడంలేదని దుర్గగుడి వర్గాలు పేర్కొన్నాయి. బోట్లకు బదులుగా జట్టీ, లేదా ఫంట్ ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులు భావిస్తున్నారు. నది మధ్యలో ఏర్పాటు చేసిన ఫంట్‌ను ఒకటికి రెండుసార్లు పర్యాటకశాఖ, జల వనరులశాఖ అధికారులతో తనిఖీ చేయించనున్నారు. పవిత్ర సంగమం వద్ద బోల్తాపడిన బోటు ఇదే (ఫైల్) -
భవానీ ద్వీప పర్యాటక అభివృద్ధి సంస్థ ఏర్పాటు
అమరావతి: విజయవాడ నగరానికి సమీపంలో కృష్ణా నది మధ్యలో ఉన్న పర్యాటక ప్రాంతం భవానీ ద్వీపానికి మహర్దశ పట్టనుంది. ఆ ద్వీపం అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా భవానీ ద్వీప పర్యాటక సంస్థ(బీఐటీసీ)ను ఏర్పాటు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రూ. 50 కోట్ల మూలధనంతో ఏర్పాటు కానున్న ఈ సంస్థ పరిధిలోకి అమరావతి, విజయవాడ పరిధిలోని ద్వీపాలను చేరుస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. -
‘డ్రాగన్’ చేతికి భవానీ ద్వీపం
* పారిశ్రామిక టౌన్షిప్ ఏర్పాటు చేయించేందుకు సర్కారు యత్నం * చైనా బృందానికి ప్రత్యేక హెలీకాప్టర్ సమకూర్చిన వైనం సాక్షి, హైదరాబాద్/విజయవాడ బ్యూరో: కృష్ణమ్మ గర్భంలో కొలువుదీరి ఆంధ్రప్రదేశ్ పర్యాటక చిత్రపటంలో ప్రముఖంగా చోటు దక్కించుకున్న భవానీ ద్వీపాన్ని చైనాలోని అతిపెద్ద ప్రైవేటు కమర్షియల్ స్పేస్ డెవలపర్ డాలియన్ వాండా కంపెనీ చేతికి అప్పగించేందుకు ఏపీ సర్కారు సన్నద్ధమవుతోంది. భవానీ ద్వీపాన్ని విదేశీ కంపెనీలకు అప్పగించాలనే యోచనలో ఉన్న ప్రభుత్వానికి వాండా గ్రూప్ ప్రతినిధుల పర్యటన కలిసొచ్చింది. 133 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ద్వీపంలో ఐదు నక్షత్రాల హోటల్ నిర్మించేందుకు వాండా గ్రూపు ప్రతినిధులు ఆసక్తి కనబరిచినట్లు అధికార వర్గాల సమాచారం. జూలై 15 నాటికి సింగపూర్ నుంచి సీడ్ కేపిటల్ ప్లాన్ అందిన తర్వాత భవానీ ద్వీపాన్ని లీజుకిచ్చేందుకు సర్కారు పెద్దలు ఉద్యుక్తులవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. సీఎం ఆహ్వానంతో.... :ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన సమయంలో వాండా కంపెనీ ప్రతినిధుల్ని ఆహ్వానించారు. డాలియన్ వాండా గ్రూప్‌తో పారిశ్రామిక టౌన్షిప్ ఏర్పాటు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం పోటీ పడుతోంది. వాండా గ్రూప్ పారిశ్రామిక టౌన్‌షిప్‌కు అనువైన స్థలం కోసం కొద్దిరోజులుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటిస్తోంది. అందులో భాగంగా గురువారం మన రాష్ట్రానికీ వచ్చింది. దీంతో మాథ్యూ అబాట్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం రెండు రోజుల నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాలను పరిశీలించింది. గురువారం రాజధాని ప్రాంతంలోని అనంతవరం, నిడమర్రుతోపాటు కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలోని మల్లవల్లి ప్రాంతాల్లో పర్యటించింది. శుక్రవారం ప్రకాశం జిల్లా దొనకొండ, నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్టుకు సమీపంలోని కత్తువపల్లి ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలను పరిశీలించింది. భవానీ ద్వీపం ఏరియల్ వ్యూ కోసం ఏపీఐఐసీ, ఇన్‌క్యాప్ ఉన్నతాధికారులు హెలీకాప్టర్‌ను రప్పించారు. అందులోనే చైనా బృందం విజయవాడ నుంచి దొనబండ అటు నుంచి కృష్ణపట్నం పోర్టు అక్కడి నుంచి తిరుపతి వెళ్లింది. వాండాపైఆసక్తి తెలియజెప్పేందుకే చైనా బృందానికి ప్రభుత్వం రెడ్‌కార్పెట్ వేసినట్లు తెలుస్తోంది. -
విదేశీ సంస్థలకు భవానీ ద్వీపం
అమితాసక్తి చూపుతున్న సింగపూర్ * కట్టబెట్టే యోచనలో ప్రభుత్వం సాక్షి, విజయవాడ బ్యూరో: విజయవాడ పర్యాటకానికి మణిదీపంలాంటి భవానీ ద్వీపాన్ని విదేశీ సంస్థలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. సింగపూర్ కంపెనీలకు దీంతోపాటు పక్కనే ఉన్న మరికొన్ని ద్వీపాలను లీజుకిచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే దీనిపై ప్రభుత్వ ఉన్నతాధికారులతో పలు దఫాలుగా సింగపూర్ కంపెనీలు చర్చలు జరిపాయి. రాజధాని మాస్టర్‌ప్లాన్ హడావుడి పూర్తయిన తర్వాత ప్రభుత్వం ఈ లీజుపై దృష్టి పెట్టనుంది. ప్రకాశం బ్యారేజీకి ఎగువన కృష్ణానదిలో 7 వేల ఎకరాల్లో పలు ద్వీపాలున్నాయి. ఇందులో 133 ఎకరాల భవానీద్వీపం అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. రాష్ట్ర విభజనకు ముందే దీన్ని అభివృద్ధి చేయాలని పర్యాటక శాఖ ప్రణాళిక రూపొందించింది. ఎన్నికల తర్వాత టీడీపీ అధికారంలోకి రావడంతో దీనిపై తనకు చాలా ప్లానింగ్ ఉందని పాత ప్రణాళికలను పక్కన పెట్టాలని స్వయంగా చంద్రబాబు పర్యాటక శాఖకు సూచించారు. సింగపూర్‌లోని సెంటోసా ద్వీపం తరహాలో దీన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని ఆయన పలుమార్లు చెప్పారు. మాస్టర్‌ప్లాన్ తయారుచేసిన సింగపూర్ కంపెనీల్లో ఒకదానికి వాటిని అభివృద్ధి చేసి 33 ఏళ్లపాటు నిర్వహించుకునే అవకాశం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిసింది. గతంలో ఆందోళనలు నిర్వహించిన టీడీపీ కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భవానీ ద్వీపాన్ని ప్రైవేటుకు లీజుకిచ్చే ప్రయత్నాన్ని టీడీపీ అడ్డుకుంది. ఆ ప్రయత్నం విరమించుకునే వరకూ అప్పటి టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, ప్రస్తుత మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆందోళనలు నిర్వహిం చారు. ఇప్పుడు ద్వీపాన్ని అభివృద్ధి చేయకుండా ఏకంగా విదేశీ కంపెనీల చేతుల్లో పెట్టేందుకు సిద్ధమవుతుండడం విశేషం. -
'నన్ను అందరూ దానకర్ణుడు అంటారు'
విజయవాడ: కృష్ణానది కరకట్టల ఆక్రమణలపై ఎంపీ గోకరాజు గంగరాజు స్పందించారు. కరకట్టలపై ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టలేదని తెలిపారు. బీజేపీ కార్యాలయ నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు రావన్నారు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇవ్వడానికి తాను కూడా సిద్ధమేనని ప్రకటించారు. తాను కట్టిన భవనాలు ఆక్రమణలు అయితే భవానీ ఐలాండ్ ఆక్రమణ కాదా అని ఆయన ప్రశ్నించారు. తమ భవనాలు ఒక రూలు, భవానీ ఐలాండ్ కు మరో రూలా అని ప్రశ్నించారు. తనను అందరూ దానకర్ణుడు అంటారని, కబ్జాదారుడు అనడానికి ఆధారాల్లేవన్నారు. మంతెన సత్యనారాయణ రాజు ప్రకృతి వైద్యాలయంపై కథనాలు రావడం తగదన్నారు. 2 లీటర్ల నీళ్లు తాగితే తనకు వాంతులు రావని చెప్పారు. తక్కువ డబ్బుకే వైద్యం చేస్తున్నారని, వ్యాపారం అని విమర్శించడం తగదని పేర్కొన్నారు. నది ఒడ్డున ఒక్క అంగుళం కూడా ప్రభుత్వ భూములు లేవని, అన్ని రైతుల భూములేనని చెప్పారు. బీజేపీ కార్యాలయానికి అనుమతులు రాకుంటే మరోచోట స్థలం ఇస్తానని ప్రకటించారు. -
భవానీ ద్వీపం చూసి ఆశ్చర్యపోయారు
* సింగపూర్ ప్రతినిధుల ఏరియల్ సర్వే అద్భుతంగా సాగింది: మంత్రి నారాయణ * అద్భుతమైన మాస్టర్ ప్లాన్ ఇస్తామన్నారు * రేపు సాయంత్రానికి కార్యాచరణ ప్రణాళిక ఇస్తారు * హెలికాప్టర్ నుంచి కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాలు, కొండలు, పంట పొలాలు, గ్రామాలను పరిశీలించిన సింగపూర్ బృందం * గ్రామాల్లో భారీగా పోలీసు బలగాలు సాక్షి, హైదరాబాద్/ విజయవాడ బ్యూరో: రాజధాని మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో సింగపూర్ ప్రతినిధులతో కలిసి చేసిన ఏరియల్ సర్వే అద్భుతంగా సాగిందని రాజధాని నిర్మాణ సలహా కమిటీ చైర్మన్, రాష్ట్ర మున్సిపల్ మంత్రి నారాయణ చెప్పారు. ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితులు, రూపురేఖలను చూసి అద్భుతమైన రాజధాని నిర్మించవచ్చని సింగపూర్ ప్రతినిధులు అభిప్రాయపడ్డట్లు తెలిపారు. రాజధాని ప్రాంతంలో ఏరియల్ సర్వే అనంతరం నారాయణ బుధవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి (వీజీటీఎం) పరిధిలో 200 కిలోమీటర్ల ఏరియల్ సర్వే జరిగిందని తెలిపారు. కృష్ణా నది మధ్యలో ఉన్న భవానీ ద్వీపాన్ని చూసి సింగపూర్ బృందం ఆశ్చర్యపోయిందని చెప్పారు. తాము ఇటువంటి ద్వీపాలను కృత్రిమంగా నిర్మించామని, ఇక్కడ సహజసిద్ధమైనవి ఉన్నాయని అన్నారని తెలిపారు. ఆ ప్రాంతంలో ఉన్న నదీ పరీవాహకం, కొండ ప్రాంతాలను చూసి అచ్చెరువొందారన్నారు. గొప్ప మాస్టర్‌ప్లాన్ ఇస్తామని వారు చెప్పారన్నారు. గురువారం ఉదయం మున్సిపల్, పట్టణాభివృద్ధి, రవాణా, విద్యుత్ తదితర శాఖల అధికారులతో సింగపూర్ ప్రతినిధులతో కలిసి సుదీర్ఘ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. బుధవారం రాత్రికే మాస్టర్ ప్లాన్ డిజైన్‌కు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక ఇస్తామని సింగపూర్ ప్రతినిధులు చెప్పారన్నారు. పంట పొలాలు, గ్రామాల పరిశీలన బుధవారం రాజధాని ప్రాంతంలో సింగపూర్ ప్రతినిధులు జరిపిన ఏరియల్ సర్వేలో కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాలు, కొండలు, పంట పొలాలు, గ్రామాలను పరిశీలించారు. రాష్ట్ర మంత్రి నారాయణ నేతృత్వంలో సింగపూర్ ప్రతినిధులు టన్ సూన్ కిం, జులియన్ గో, లిమ్స్వీ కెంగ్, ఫ్రాన్సిస్ చోంగ్, లిక్సియా ఒంగ్, కూ తెంగ్ చెయ్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చి ఏరియల్ సర్వే చేశారు. అమరావతి, తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని గ్రామాలు, సాగులో ఉన్న పంటలను పరిశీలించారు. అనంతరం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళ్లారు. ముందుగా రాజధాని ప్రాంతంలో సింగపూర్ బృందం పర్యటనకు ఏర్పాట్లు చేశారు. అయితే, రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఏరియల్ సర్వేతో సరిపెట్టారు. సింగపూర్ బృందాన్ని అడ్డుకుంటామని రైతులు హెచ్చరించడంతో ఆ గ్రామాల్లో రెండు రోజులుగా పోలీసులు భారీ ఎత్తున బలగాలను మోహరించారు. డిజైనింగ్ వరకే ఈ ఎంఓయూ రాజధాని మాస్టర్‌ప్లాన్‌పై సింగపూర్ సంస్థలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలపై వచ్చిన విమర్శలకు మంత్రి నారాయణ వివరణ ఇచ్చారు. ఈ అవగాహన ఒప్పందం రాజధాని డిజైన్‌కే పరిమితమని చెప్పారు. భవిష్యత్‌లో జరిగే నిర్మాణ లేదా ఇతరత్రా పనుల నిర్వహణకు ఈ సంస్థలే కొనసాగవచ్చు లేదా వేరే సంస్థలు రావచ్చునని తెలిపారు. ఎంఓయూ కుదుర్చుకున్న రెండు సంస్థలూ అక్కడి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నాయని చెప్పారు. ఇక్కడి ఇన్కాప్ చైర్మన్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సాంబశివరావు, అక్కడి సంస్థ సీఈవో ఒప్పందంపై సంతకాలు చేశారని తెలిపారు. ఒప్పందంపై అనుమానాలు అక్కర్లేదని అన్నారు.