భవానీ ద్వీపం చూసి ఆశ్చర్యపోయారు
* సింగపూర్ ప్రతినిధుల ఏరియల్ సర్వే అద్భుతంగా సాగింది: మంత్రి నారాయణ
* అద్భుతమైన మాస్టర్ ప్లాన్ ఇస్తామన్నారు
* రేపు సాయంత్రానికి కార్యాచరణ ప్రణాళిక ఇస్తారు
* హెలికాప్టర్ నుంచి కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాలు, కొండలు, పంట పొలాలు, గ్రామాలను పరిశీలించిన సింగపూర్ బృందం
* గ్రామాల్లో భారీగా పోలీసు బలగాలు
సాక్షి, హైదరాబాద్/ విజయవాడ బ్యూరో: రాజధాని మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో సింగపూర్ ప్రతినిధులతో కలిసి చేసిన ఏరియల్ సర్వే అద్భుతంగా సాగిందని రాజధాని నిర్మాణ సలహా కమిటీ చైర్మన్, రాష్ట్ర మున్సిపల్ మంత్రి నారాయణ చెప్పారు. ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితులు, రూపురేఖలను చూసి అద్భుతమైన రాజధాని నిర్మించవచ్చని సింగపూర్ ప్రతినిధులు అభిప్రాయపడ్డట్లు తెలిపారు. రాజధాని ప్రాంతంలో ఏరియల్ సర్వే అనంతరం నారాయణ బుధవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి (వీజీటీఎం) పరిధిలో 200 కిలోమీటర్ల ఏరియల్ సర్వే జరిగిందని తెలిపారు. కృష్ణా నది మధ్యలో ఉన్న భవానీ ద్వీపాన్ని చూసి సింగపూర్ బృందం ఆశ్చర్యపోయిందని చెప్పారు. తాము ఇటువంటి ద్వీపాలను కృత్రిమంగా నిర్మించామని, ఇక్కడ సహజసిద్ధమైనవి ఉన్నాయని అన్నారని తెలిపారు. ఆ ప్రాంతంలో ఉన్న నదీ పరీవాహకం, కొండ ప్రాంతాలను చూసి అచ్చెరువొందారన్నారు. గొప్ప మాస్టర్‌ప్లాన్ ఇస్తామని వారు చెప్పారన్నారు. గురువారం ఉదయం మున్సిపల్, పట్టణాభివృద్ధి, రవాణా, విద్యుత్ తదితర శాఖల అధికారులతో సింగపూర్ ప్రతినిధులతో కలిసి సుదీర్ఘ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. బుధవారం రాత్రికే మాస్టర్ ప్లాన్ డిజైన్‌కు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక ఇస్తామని సింగపూర్ ప్రతినిధులు చెప్పారన్నారు.
పంట పొలాలు, గ్రామాల పరిశీలన
బుధవారం రాజధాని ప్రాంతంలో సింగపూర్ ప్రతినిధులు జరిపిన ఏరియల్ సర్వేలో కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాలు, కొండలు, పంట పొలాలు, గ్రామాలను పరిశీలించారు. రాష్ట్ర మంత్రి నారాయణ నేతృత్వంలో సింగపూర్ ప్రతినిధులు టన్ సూన్ కిం, జులియన్ గో, లిమ్స్‌వీ కెంగ్, ఫ్రాన్సిస్ చోంగ్, లిక్సియా ఒంగ్, కూ తెంగ్ చెయ్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో వచ్చి ఏరియల్ సర్వే చేశారు. అమరావతి, తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని గ్రామాలు, సాగులో ఉన్న పంటలను పరిశీలించారు. అనంతరం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళ్లారు. ముందుగా రాజధాని ప్రాంతంలో సింగపూర్ బృందం పర్యటనకు ఏర్పాట్లు చేశారు. అయితే, రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఏరియల్ సర్వేతో సరిపెట్టారు. సింగపూర్ బృందాన్ని అడ్డుకుంటామని రైతులు హెచ్చరించడంతో ఆ గ్రామాల్లో రెండు రోజులుగా పోలీసులు భారీ ఎత్తున బలగాలను మోహరించారు.
డిజైనింగ్ వరకే ఈ ఎంఓయూ
రాజధాని మాస్టర్‌ప్లాన్‌పై సింగపూర్ సంస్థలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలపై వచ్చిన విమర్శలకు మంత్రి నారాయణ వివరణ ఇచ్చారు. ఈ అవగాహన ఒప్పందం రాజధాని డిజైన్‌కే పరిమితమని చెప్పారు. భవిష్యత్‌లో జరిగే నిర్మాణ లేదా ఇతరత్రా పనుల నిర్వహణకు ఈ సంస్థలే కొనసాగవచ్చు లేదా వేరే సంస్థలు రావచ్చునని తెలిపారు. ఎంఓయూ కుదుర్చుకున్న రెండు సంస్థలూ అక్కడి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నాయని చెప్పారు. ఇక్కడి ఇన్‌కాప్ చైర్మన్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సాంబశివరావు, అక్కడి సంస్థ సీఈవో ఒప్పందంపై సంతకాలు చేశారని తెలిపారు. ఒప్పందంపై అనుమానాలు అక్కర్లేదని అన్నారు.