సంక్రాంతి వేడుకలకు ముస్తాబైన శిల్పారామం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల్లో సంక్రాంతి సందడి నెలకొంది. ఈ ఏడాది పర్యాటక ప్రదేశాలు, శిల్పారామాల్లో సంక్రాంతి సంబరాలకు ఏపీ శిల్పారామం, ఏపీటీడీసీ ఏర్పాట్లు చేశాయి. విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, తిరుపతి, కడప, పులివెందుల, అనంతపురం, పుట్టపర్తి శిల్పారామాల్లో 14 నుంచి 16వ తేదీ వరకు మూడు రోజులపాటు ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించనున్నారు.
సందర్శకులను అలరించేలా ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. మహిళలకు ముగ్గుల పోటీలు, ‘సంక్రాంతి లక్ష్మి’ పేరుతో సంప్రదాయ వస్త్రధారణ పోటీలు నిర్వహించి బహుమతులు అందించనున్నారు. తెలుగు సంస్కృతికి అద్దం పట్టేలా హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, జానపద, సంప్రదాయ కళారీతుల ప్రదర్శనకు సర్వం సిద్ధంచేశారు. బుల్లితెర హాస్యనటులతో హాస్యవల్లరి, భోజనప్రియులకు నోరూరించేలా పల్లె రుచులతో ఫుడ్ కోర్టులను ఏర్పాటుచేస్తున్నారు.
నేటి నుంచి భవానీ ద్వీపంలో..
దేశంలోనే అతిపెద్ద నదీ ద్వీపమైన విజయవాడ భవానీ ఐలాండ్‌లో బుధవారం నుంచి సోమవారం వరకు ఆరు రోజులపాటు ‘సంక్రాంతి ఫెస్ట్’ నిర్వహించనున్నారు. పల్లెటూరి సంప్రదాయ జీవనాన్ని ప్రతిబింబించేలా ఈ ఫెస్ట్‌లో వినూత్న కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. చేతివృత్తి కళాకారుల స్టాల్స్, ఎగ్జిబిషన్‌తోపాటు మహిళలు, చిన్నారులకు ముగ్గులు, వంటల పోటీలు, సంప్రదాయ వస్త్రధారణ, జానపద గీతాలు, డ్రాయింగ్, గాలిపటాల తయారీ పోటీలు నిర్వహించనున్నారు. చిన్నారులకు మన సంస్కృతిలోని సైన్స్ గొప్పదనాన్ని చాటిచెప్పేలా థీమ్స్‌ను రూపొందించారు.
పాపికొండల యాత్రకు ఫుల్ డిమాండ్...
సంక్రాంతి సందర్భంగా పర్యాటకులు పాపికొండల బోటింగ్‌కు క్యూకడుతున్నారు. ప్రస్తుతం భద్రాచలం వైపున పోచవరం, దేవీపట్నంలోని గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ల నుంచి 29 బోట్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇప్పటికే చాలాబోట్లలో అడ్వాన్స్ బుకింగ్‌లు ఊపందుకున్నాయి. ఆదివారం, సోమవారాల్లో పర్యాటక శాఖ బోట్లు ముందస్తు బుకింగ్‌లతో నిండిపోయాయి. పోచవరం నుంచి పెద్దలకు రూ.950, చిన్నారులకు రూ.750,
గండిపోచమ్మ నుంచి పెద్దలకు రూ.1,250, చిన్నారులకు రూ.1,050గా టికెట్ ధర ఉంది. ఇక పర్యాటక శాఖ హోటళ్లు, రిసార్టులు సైతం నిండిపోయాయి.
పాపికొండల అందాలు
Comments
Please login to add a commentAdd a comment