పాలవెల్లి రిసార్ట్స్
సాక్షి, విశాఖపట్నం: ప్రకృతి అందాలతో అలరారే రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో పర్యాటకరంగం కొత్తపుంతలు తొక్కేలా సరికొత్త ఆలోచనలతో పర్యాటకశాఖ ముందుకెళ్తోంది. పెట్టుబడుల రాకకు ప్రధాన అవరోధాలుగా ఉన్న నియమ నిబంధనలు మార్చి కొత్తదారుల్ని అన్వేషించింది. రాష్ట్రవ్యాప్తంగా 68 ప్రాంతాల్లో వాటర్ స్పోర్ట్స్, ట్రెక్కింగ్, అడ్వెంచర్ స్పోర్ట్స్ ప్రాజెక్టులకు ప్రాధాన్యమిచ్చేందుకు నిబంధనల్ని మరింత సరళతరం చేసింది.
కొత్తగా రాబోతున్న ప్రాజెక్టులకు కనిష్టంగా రూ.20 లక్షల నుంచి గరిష్టంగా రూ.70 లక్షల వరకు మాత్రమే పెట్టుబడులుగా నిర్దేశించింది. వాటర్ స్పోర్ట్స్‌లో బిడ్ వేయాలంటే ఐదేళ్ల అనుభవం ఉండాలనే నిబంధన ఉంది. దీన్ని ఏడాదికి తగ్గించింది. ఒకవేళ ఆసక్తి ఉండి అనుభవం లేని ఎవరైనా పాల్గొనాలని భావిస్తే కన్సోటియం తీసుకున్నా సరిపోతుంది. టూరిజం ప్రాజెక్టులకు బిడ్ ఫీజును రూ.లక్ష నుంచి రూ.10 వేలకు తగ్గించింది. దీంతోపాటు టెండర్లలో కనీస ఆదాయం వాటా వాటర్ స్పోర్ట్స్‌కు 15 శాతం, అడ్వెంచర్ స్పోర్ట్స్‌కు 25 శాతం, ట్రెక్కింగ్‌కు 10 శాతంగా నిర్ణయించింది.
ఇందులో ఎవరు ఎక్కువగా టెండర్లలో కోట్‌చేస్తే వారికి అవకాశం కల్పించేలా నిబంధనల్ని మార్చింది. ఈ నేపథ్యంలో సోమవారం విజయవాడలో ప్రీ బిడ్డింగ్ సమావేశం నిర్వహిస్తోంది. టూరిజం ఎండీ కన్నబాబు ఆధ్వర్యంలో పర్యాటకశాఖ కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment