- రూ.1.25 కోట్లతో అభివృద్ధి
- పర్యాటక శాఖ కసరత్తు
- నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు
సాక్షి, విజయవాడ : కృష్ణా- గుంటూరు జిల్లాల మధ్య రాష్ట్ర రాజధాని ఏర్పడే అవకాశాలు ఉండడంతో ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ఆ శాఖ అధికారులు నడుం బిగించారు. ఇందులో భాగంగా కొండపల్లి ఖిల్లాకు కొంత హంగులు సమకూర్చనున్నారు. ఇటీవల పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చందనాఖాన్ నగరానికి వచ్చినప్పుడు ఖిల్లాను సందర్శించి అక్కడి సమస్యలను పర్యాటకుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో పర్యాటకులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు 13వ ఆర్థిక సంఘం నిధుల్లో రూ.1.25 కోట్లు విడుదల చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రూ. కోటితో లైటింగ్, సౌండ్ ఏర్పాట్లు
కొండపల్లి ఖిల్లాపై పర్యాటకుల్ని ఆకట్టుకునే విధంగా చక్కటి లైటింగ్, పర్యాటకులకు ఆహ్లాదం కలిగించే విధంగా సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేయనున్నారు. దీనికి కోటి రూపాయలు కేటాయించారు.
మౌలిక వసతులకు రూ.25 లక్షలు
ఖిల్లా మార్గాలను అభివృద్ధి చేయడంతోపాటు కొండను కెమికల్ క్లీనింగ్ చేయించేందుకు రూ.15 లక్షలు మంజూరు చేశారు. మంచి నీటి సదుపాయం, పర్యాటకులకు మౌలిక సదుపాయాల కల్పనకు రూ.10 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది.
కేంద్ర ప్రభుత్వ నిధులు ఏమయ్యాయి?
కొండపల్లి ఖిల్లాను అభివృద్ధి చేయడంతోపాటు ఇక్కడ హస్తకళాకారులకు సహాయం చేయడానికి యూపీఏ ప్రభుత్వం రూ. ఐదు కోట్లు మంజూరు చేసింది. కొండపల్లి సర్క్యూట్ పేరుతో జిల్లాలో పర్యాటక ప్రాంతాలన్నింటినీ కలుపుతూ టూర్ ప్యాకేజ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే ఆ నిధుల్ని ఇప్పటివరకు రాష్ట్ర పర్యాటక శాఖాధికారులు ఉపయోగించలేదు. 13 ఆర్థిక సంఘం నిధులతోపాటు కేంద్రం మంజూరు చేసిన రూ. ఐదు కోట్లనూ కలిపి అభివృద్ధి చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.