state tourism department
-
50 చారిత్రక ప్రాంతాల అభివృద్ధి
నాగార్జునసాగర్: బౌద్ధమతవ్యాప్తికి తోడ్పడిన తెలంగాణలోని నాగార్జునసాగర్ తీరాన ప్రపంచ బౌద్ధమత సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుద్ధజయంతిని పురస్కరించుకుని శనివారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని శ్రీపర్వతారామంలో గల మహాçస్తూప ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సాగర్‌లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేల శిక్షణకార్యక్రమం సందర్భంగా శ్రీపర్వతారామాన్ని సందర్శించారని, ఆయన అప్పటికప్పుడు రూ.25 కోట్లు మంజూరు చేయడంతో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. అనంతరం మరో 50 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. మరో వందకోట్ల నిధులు కేంద్రం నుంచి తెచ్చి రాష్ట్రంలోని 50 చారిత్రక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. అంతకుముందు ఆయన శ్రీలంకవాసులు ఏర్పాటు చేసిన బుద్ధుని పాదాల చెంత పుష్పగుఛ్చాలు ఉంచారు. ఈ కార్యక్రమంలో శ్రీలంక పార్లమెంటు సభ్యుడు వెన్.అతురల్యేరతన్‌తెరో, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, బుద్ధవనం స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పన్యాల భూపతిరెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
అక్రమాస్తులు @ రూ.100కోట్లు!
విజయవాడ/సీతమ్మధార (విశాఖ): ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు.. రాష్ట్ర పర్యాటక శాఖ ఎస్టేట్ ఆఫీసర్ ఆర్.శివరావు, నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ హనుమంతు శంకరరావు ఇళ్లల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో శివరావుకు రూ.80 కోట్లు, శంకరరావుకు రూ.20 కోట్ల అక్రమాస్తులున్నట్లు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏసీబీ సెంట్రల్ టీమ్‌కు చెందిన 25మంది అధికారులు డీఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో విజయవాడలోని రాష్ట్ర పర్యాటక శాఖ కార్యాలయంలో ఎస్టేట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న శివరావు ఇంటితో పాటు, ఆయన బంధువుల ఇళ్లల్లో మొత్తం 6చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో శివరావు భార్య, అత్త, బావమరిది, బంధువుల ఇళ్లపై దాడులు చేశారు. వారి పేరు మీద దాదాపు రూ.80కోట్ల విలువ చేసే భూములు, స్థలాలు, ఇళ్లకు చెందిన డాక్యుమెంట్లు, చెక్కులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ నగరంలో బందరు రోడ్డు పక్కనే ఉన్న టిక్కిల్ రోడ్డులో శ్వేత టవర్స్‌లో నివాసం ఉంటున్న శివరావు ఇంట్లో 793 గ్రాముల బంగారు ఆభరణాలు, కిలో వెండి ఆభరణాలు, చెక్కులు డాక్యుమెంట్లు సోదాల్లో దొరికాయి. సోదాల్లో మొత్తం 14 ఇంటి ఫ్లాట్లు, 2 ఫ్లాట్లు 2ఇళ్లు, 0.96సెంట్ల వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. తమ సమీప బంధువులైన అన్నపూర్ణమ్మ, సుబ్బారావు, శ్రీనివాసరావు పేర్లతో 4 స్థలాలు కంకిపాడు, కంచికచర్లలో కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారుల సోదాల్లో డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. ప్రస్తుతానికి స్వాధీనం చేసుకున్న మొత్తం శివరావు అక్రమాస్తులు బహిరంగ మార్కెట్లో సుమారు రూ.80 కోట్లు ఉండవచ్చని ఏసీబీ అధికారులు చెప్పారు. కాగా విచారణ గురువారం కూడా కొనసాగుతుందని తెలిపారు. ఇంకా బ్యాంకు లాకర్లు తెరవాల్సి ఉందని డీఎస్పీ రమాదేవి చెప్పారు. నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్‌పై కేసు నమోదు.. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ హనుమంతు శంకరరావు ఇళ్లలో సోదాలు జరిపిన అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, నర్సీపట్నం, మధురవాడ, బొబ్బిలి, పలాస, టెక్కలి, భీమిలిలో సోదాలు నిర్వహించారు. రామకృష్ణ ప్రసాద్ వెల్లడించిన వివరాల ప్రకారం..ఈ సోదాల్లో విశాఖపట్నం ఎంవీపీకాలనీ, సెక్టార్–4లో 207 గజాల స్థలంలో ఇల్లు, మధురవాడ వాంబేకాలనీలో 267 గజాల్లో మూడు ఆంతస్తుల భవనం, భీమిలి, సంగివలస, నేరెళ్ల వలసలో 60 సెంట్ల భూమి ఉన్నట్లు గుర్తించారు. చిట్టివలస స్టేట్‌బ్యాంకు, భీమిలి స్టేట్‌బ్యాంకులో రూ.5 లక్షలు, బొబ్బిలి కరూర్ వైశ్యా బ్యాంకులో రూ.2లక్షల 50 వేలు విలువ గల బంగారం తనఖాలో ఉన్నట్లు గుర్తించారు. కొన్ని స్థలాలు బినామీల పేరుతో ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.20 కోట్ల పైన ఉంటుంది. శంకరావును అరెస్టు చేసి గురువారం ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. -
పర్యాటక శాఖ కార్తీకమాసం టూర్ ప్యాకేజీలు
సాక్షి, హైదరాబాద్: కార్తీక మాసం సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ పలు కొత్త టూర్ ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. హైదరాబాద్ నుంచి వెళ్లి వచ్చేలా ఇవి అందుబాటులో ఉంటాయని తెలిపింది. హైదరాబాద్ నుంచి వేములవాడ, కొండగట్టు, ధర్మపురికి వెళ్లే శాతవాహన రీజియన్ టూర్ టికెట్ ధర పెద్దలకు రూ.1,000, పిల్లలకు రూ.800గా పేర్కొంది. కాకతీయ రీజియన్ టూర్లో కాళేశ్వరం, వేయి స్తంభాల గుడి, రామప్ప, యాదగిరిగుట్ట, కీసరగుట్ట పర్యటనకు పెద్దలకు రూ.1,350, పిల్లలకు రూ.1,080గా నిర్ణయించింది. ఇక పంచారామం టూర్లో భాగంగా అమరావతి, పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం, సామర్లకోట పర్యటనకుగాను పెద్దలకు రూ.2,700, పిల్లలకు రూ.2,160... హైదరాబాద్-అనంతగిరి పర్యటన పెద్దలకు రూ.699, పిల్లలకు రూ.560గా తెలిపింది. హైదరాబాద్-కీసరగుట్ట-శామీర్‌పేట టూర్‌కుగాను పెద్దలకు రూ.500, పిల్లలకు రూ.400 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ నెల 31 నుంచి నవంబర్ 29 వరకు ఈ ప్యాకేజీ టూర్లు అందుబాటులో ఉంటాయని.. బషీర్‌బాగ్‌లోని సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయం నుంచి నిర్దేశిత సమయాల్లో ప్రారంభమవుతాయని పేర్కొంది. -
గోల్కొండ.. పర్యాటకానికి అండ
పంద్రాగస్టు వేడుకలతో సందర్శకుల తాకిడి * చార్మినార్‌ను వెనక్కి నెట్టిన వైనం సాక్షి, హైదరాబాద్: గోల్కొండ కోట పర్యాటకరంగానికి ఊతమిస్తోంది. సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాదిలోనే గత ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాలను గోల్కొండ కోటపై ప్రభుత్వం నిర్వహించింది. మువ్వన్నెల జెండా రెపరెపలు గోల్కొండకు కొత్త ఊపునిచ్చాయి. దీంతో గోల్కొండకు పర్యాటకుల తాకిడి పెరిగింది. అప్పటి వరకు తెలంగాణలో అత్యధిక పర్యాటకులు సందర్శించే చారిత్రక స్థలంగా రికార్డుల్లో నమోదైన చార్మినార్‌ను వెనక్కునెట్టి గోల్కొండ అగ్రస్థానాన్ని ఆక్రమించింది. మరోసారి గోల్కొండ కోట మీద జాతీయ పతాకం సగర్వంగా ఎగరనుండటంతో ఈసారి కూడా కోట ఖ్యాతి మరింత విస్తరించనుంది. పంద్రాగస్టు వేడుకలను కోటలో నిర్వహించటంతో గత సంవత్సరం ఆగస్టులో దేశవిదేశాల్లో దానికి ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. దీంతో సరిహద్దులు దాటి పర్యాటకులు కోట వైపు క్యూ కట్టారు. గత సంవత్సరం ఆగస్టు వరకు నెలకు సగటున లక్ష మంది పర్యాటకులు కోటను సందర్శిస్తూ రాగా... ఆ తర్వాత అది 1.60 లక్షలకు చేరుకుంది. అప్పటి వరకు సగటున నెలకు లక్షన్నర మంది పర్యాటకులతో తొలిస్థానంలో ఉన్న చార్మినార్ ఇప్పుడు రెండోస్థానానికి పడిపోయింది. గోల్కొండకు పర్యాటకుల తాకిడి స్థిరంగా ఉంటుందని గుర్తించిన కేంద్రపురావస్తు శాఖ ప్రత్యేక చర్యలకూ సిద్ధమైంది. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కోటలోని ‘సౌండ్ అండ్ లైట్ షో’కు కూడా పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది. దీన్ని కూడా మరింత ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ సిద్ధమైంది. గత ఆగస్టు 15కు పూర్వం సగటున రోజుకు వంద మంది సౌండ్ అండ్ లైట్ షోను సందర్శిస్తుండగా ఒక్కసారిగా ఆ సంఖ్య 500 ను చేరుకోవటం విశేషం. అప్పటి వరకు రోజుకు రూ.పది వేలలోపు ఆదాయం ఉండగా అది ప్రస్తుతం రూ.75 వేలకు చేరింది. ముఖ్యంగా విదేశీ పర్యాటకుల రాక భారీగా పెరిగింది. సగ టున నెలకు 1200 విదేశీ పర్యాటకులు కోట దర్శనానికి వస్తుండడం విశేషం. -
పర్యాటక కేంద్రంగా శ్రీపర్వతారామం
నాగార్జునసాగర్,న్యూస్‌లైన్ : నాగార్జునసాగర్‌లో శ్రీపర్వతారామాన్ని ప్రత్యేక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ చందనాఖన్ తెలి పారు. బుద్ధపూర్ణిమ ఉత్సవాలను పురస్కరించుకుని నాగార్జునసాగర్‌లోని శ్రీపర్వతారామంలోని సమావేశ మంది రంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమం ఆమె మాట్లాడారు. అనంతరం వ్యాలీ ఆఫ్ స్థూపాస్, బుద్ధభూమి, బోధిసత్వ పార్కు జాతక ప్యానల్, శ్రీపర్వతారామం బ్రోచర్, మహోన్నత భారతీయుడు పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాగార్జునసాగర్ జలాశయం తీరంలో నిర్మించిన శ్రీపర్వతారామం, ప్రవేశద్వారం, బుద్ధచరిత వనం, స్థూపవనం, శ్రీలంక ప్రభుత్వం బహూకరించిన బుద్ధవిగ్రహాలను శ్రీపర్వతారామానికి అంకితం చేస్తున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం గొప్ప బౌద్ధ పర్యాటక స్థావర ంగా దేశ,విదేశీయులను ఆకర్షిస్తుందన్నారు. ఇప్పటికీ ఈ ప్రాజెక్టు ఒక భాగం కూడా పూరి ్తకాలేదని రూ. 22 కోట్లు మంజూరు కాగా కేవలం రూ.10 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయని తెలిపారు. ఇదిపూర్తయితే పర్యాటక అభివృది ్ధసంస్థకు ఆదాయాన్ని, స్థానికులకు ఉద్యోగాలను కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యాటక సంస్థ ఎండీ కే.ఎస్‌రెడ్డి, ఈడీ మధుసూదన్, ఏడీసీ.శ్రీనివాస్, రాష్ట్ర ఆర్ట్‌గ్యాలరీ డెరైక్టర్ శివనాగిరెడ్డి, ఈశ్వరీయ బ్రహ్మకుమారి శకుంతల ,బొర్ర గోవర్దన్, సాగర్ డీవీఎమ్ వెంకటేశ్వర్రావు, డీటీఓ మహీధర్ పాల్గొన్నారు. అలరించిన చండాలిక నృత్యనాటిక బుద్ధజయంతి ఉత్సవాల భాగంగా పర్యాటక శాఖ నిర్వహించిన చండాలిక నృత్యనాటిక ఆహుతులను అలరించింది. అంటరానితనాన్ని పారదోలిన బుద్ధుని శిష్యుడు ఆనందునికి దప్పిక తీర్చడానికి ప్రకృతి అనే చండాలిక నీరు పోసిన దృశ్యం ప్రేక్షకుల హృదయాలను కదిలించింది. పద్మశ్రీ అవారు ్డ గ్రహిత శోభానాయుడు, శిష్యురాలు శ్రీదేవి బృందం ప్రదర్శనను, ఈ నాటకాన్ని పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆమెను ప్రశంసించారు. ప్రారంభమైన రైలు శ్రీపర్వతారామంలో పర్యాటకలను అ న్ని ప్రాంతాలకు తిప్పడానికి రైలును ప్రారంభించారు. పిల్లలు,పెద్దలు శ్రీపర్వతారామంలో రెలైక్కి సందడి చేశారు. సమావేశమందిరం చిన్నగా ఉండడంతో సందర్శకులంతా నిలబడే నాటక ప్రదర్శనను చూశారు. -
ప్రయాణించే ‘ఇల్లు’
చాలా ప్రాంతాలు తిరగాలని ఉంటుంది. కాని ఇల్లు దాటాలంటే రూట్ మ్యాప్ నుంచి రూమ్‌లు తీసుకోవడం దాకా బోలెడన్ని సమస్యలు. అందుకే... ఒళ్లు నలగకుండా కళ్లు తిప్పుకోలేని అందమైన పర్యాటక ప్రాంతాలను చూసిరావాలనుకునే వారి కోసం ఓ ఇల్లు లాంటి వాహనం పరిచయమైంది. కారవాన్ టూరిజం పేరుతో రాష్ట్ర పర్యాటకశాఖ వినూత్నశైలిలో సమర్పిస్తున్న ఈ కదిలే ఇల్లు ఇటీవలే పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది. ఏమిటీ స్పెషల్? ఈ విలాసవంతమైన వాహ నం ఒక పరిమిత కుటుంబం సంతృప్తిగా, సుఖంగా టూర్ ను పూర్తి చేసేందుకు రూపకల్పన చేయడం జరిగింది. అచ్చం ఇంట్లోనే ఉన్నంత హాయిగా నచ్చిన ప్రదేశానికి వెళ్లి వచ్చేయడానికి ఇది ఉపకరిస్తుంది. పూర్తిగా ఎయిర్‌కండిషన్ చేసిన ఈ కారవాన్ 7 సీటర్ వాహనం. ఇందులో 2 సీట్లు సోఫా కమ్ బెడ్ సౌకర్యం ఉంది. ప్రయాణంలో విసుగు పుట్టకుండా నచ్చిన సినిమానో, మరొకటో చూసేందుకు వీలుగా రెండు ఎల్ఇడి స్క్రీన్లు కూడా అమర్చారు. దీనితో పాటే డివిడి ప్లేయర్ కూడా సిద్ధంగా ఉంచారు. దీనిలోనే రిఫ్రిజరేటర్, మైక్రోఓవెన్, అటాచ్డ్ టాయిలెట్, డ్రైవర్‌కు మనకు మధ్య పూర్తి పార్టిషన్, డ్రైవర్‌తో మాట్లాడేందుకు ఇంటర్‌కమ్... వంటివి కూడా ఉన్నాయి. మార్గమధ్యంలో వాహనాన్ని నిలిపి, ఎండ పడకుండా నీడలో సేద తీరుతూ కబుర్లు చెప్పుకుంటూ ఫలహారాలు తీసుకోవాలనుకుంటే వాహనంపై నుంచి ఎక్స్ట్రా రూఫ్ టాప్ కూడా మీ కోసం దిగొస్తుంది. డ్రైవర్‌తో సహా అందుబాటులోకి వచ్చే ఈ వాహనంలో బాగా దూర ప్రయాణానికైతే అదనపు డ్రైవర్‌ను కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఎక్కడికైనా... ఈ వాహనాన్ని హైదరాబాద్ నుంచి ఏ ప్రాంతానికి కావాల్సి వచ్చినా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు. కనీసం 8 గంటల సమయం, 80 కి.మీ కోసం రూ.4 వేలు తీసుకుంటారు. అలాగే 12 గంటలు 200 కి.మీకైతే రూ. 6,000 వసూలు చేస్తారు. 24 గంటలు, 400 కి.మీ అయితే రూ.10వేలు చెల్లించాలి. ప్రతి అదనపు కిలో మీటరు దూరానికి రూ.25, అదనపు గంటకు రూ.300 చొప్పున చెల్లించాలి. (పన్నులు అదనం). మరిన్ని వివరాలకు... టోల్ఫ్రీనెం.180042545454 సంప్రదించవచ్చు. - ఎస్.సత్యబాబు ఈ తరహా విలాసవంతమైన వాహనాన్ని మధ్యప్రదేశ్‌లో తొలుత పరిచయం చేశారు. ఆ తర్వాత మేము అందుబాటులోకి తెచ్చాం. వ్యక్తిగత ప్రయాణాలకు రూముల అద్దెల వంటి ఖర్చులు లెక్కేసుకుంటే ఇది అందుబాటులో ఉన్నట్టే. పర్యాటకు లు హైదరాబాద్‌లోని పర్యాటకభవన్ నుంచి కానీ, ట్యాంక్‌బండ్, బషీర్‌బాగ్‌లలో ఉన్న టూరిజం కార్యాలయాల్లో కానీ ఈ వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు. - మధుసూదన్, పర్యాటకశాఖ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (మార్కెటింగ్ ) -
ఉభయచర విమానం ప్రారంభం
ముంబై: రాష్ట్రంలోనే తొలిసారిగా సోమవారం సీ ప్లేన్ (ఉభయచరం) సేవలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర పర్యాటక శాఖ (ఎంటీడీసీ), మారిటైమ్ ఎనర్జీ హెలి ఎయిర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఈహెచ్‌ఏఐఆర్) సంయుక్త ఆధ్వర్యంలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పర్యాటక శాఖ మంత్రి ఛగన్ చంద్రకాంత్ భుజ్‌బల్ పచ్చజెండా ఈ సేవలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు ప్రధాన కార్యదర్శి సుమీత్ మల్లిక్, ఎంటీడీసీ మేనేజింగ్ డెరైక్టర్ జగదీష్ పాటిల్, సంయుక్త మేనేజింగ్ డెరైక్టర్ సతీష్ సోని, ఎంఈహెచ్‌ఏఐఆర్ డెరైక్టర్ సిద్ధార్ధ వర్మ, యాంబివాలీ సిటీ సీఈఓ వివేక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యాటక మంత్రి ఛగన్ భుజ్‌బల్ మాట్లాడుతూ పర్యావరణ రంగం సిగలో ఇదొక కలికితురాయని అన్నారు. పర్యాటకులకు అత్యుత్తమ సేవలు అందిస్తున్నామన్నారు. ఈ సేవలతో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కాగా రన్ వేలు లేకపోయినప్పటికీ నగరం నుంచి సమీపంలోని ఇతర ప్రాంతాలకు జలమార్గంద్వారా ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు ఇవి చేరవేస్తాయి. తొలి విడతలో భాగంగా యాంబీవ్యాలీ లోయ, ములా డ్యాం (మెహరాబాద్/షిర్డీ), పవనాడ్యాం (లోణవాలా), వరస్గావ్ డ్యాం (లావాసా), ధూం డ్యాం (పంచగని, మహాబలేశ్వర్) ప్రాంతాలకు సీ ప్లేన్ సేవలను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. వచ్చే నెల ఐదో తేదీనుంచి ప్రయాణికులు డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.ఎంఈహెచ్‌ఏఐఆర్.ఇన్ ద్వారా టికెట్లను కొనుగోలు చేయొచ్చు. ఈ సీ ప్లేన్ లో రెండు మోడళ్లు ఉన్నాయి. ఇందులో ఒకదానిలో నలుగురు, మరొక మోడల్లో తొమ్మిది మంది ప్రయాణించేందుకు వీలవుతుంది. -
కాకతీయ ఉత్సవాలకు రూ. 30 లక్షలు
సాక్షి, హన్మకొండ : కాకతీయ ఉత్సవాలకు రూ. 30 లక్షలు విడుదల చేస్తూ రాష్ట్ర పర్యాటక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో డిసెంబర్ 20, 21, 22 తేదీల్లో మూడు రోజుల పాటు ఖిలావరంగల్, వేయిస్తంభాల గుడి వేదికలుగా ముగింపు ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఇప్పటికే నిధుల లేమి కారణంగా కాకతీయ ఉత్సవాలు అరకొరగా సాగుతున్నాయి. ఉత్సవాల నిర్వాహణకు కోటి రూపాయలు విడుదల చేస్తామని గతేడాది ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పటి వరకు రెండు విడతలుగా రూ. 60 లక్షలు విడుదల చేసింది. ఆ నిధులన్నీ గతంలో నిర్వహించిన కార్యక్రమాలకు సంబంధించిన బకాయిలు చెల్లించడానికే సరిపోయాయి. డిసెంబర్లో జరిగే ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు నిధుల కేటాయించాల్సిందిగా ఇటీవలే జిల్లా కలెక్టర్ కిషన్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేసింది.