పోలికలికలు | twins special | Sakshi
Sakshi News home page

పోలికలికలు

Published Mon, Nov 2 2015 11:12 PM | Last Updated on Sun, Sep 3 2017 11:54 AM

పోలికలికలు

పోలికలికలు

కవలలని చూడండి.  ఎత్తు పొడుగు రూపూ రంగు... అన్నీ ఒకేలా ఉన్నా ఒకరితో ఒకరిని పోల్చితే ఒకరు తక్కువా ఒకరు ఎక్కువా అయ్యే అవకాశం ఉంటుంది. పిల్లలకు స్ఫూర్తి కలిగించడానికి పేరెంట్స్ తరచూ వాళ్లను ఇతరులతో పోలుస్తూ ఉంటారు. అది తోబుట్టువులతో కావచ్చు... పక్కింటి పిల్లలతో కావచ్చు.... క్లాస్‌మేట్స్‌తో కావచ్చు.... అలా పోల్చడం వల్ల పిల్లల మనస్థయిర్యం కుంటుపడి తరచూ నైరాశ్యంలో కూరుకుపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి పోల్చక పోతే పిల్లలు ఎలా ఎదగాలి? దీనికీ మంచి సమాధానమే ఇస్తున్నారు. పేరెంట్సే ఒక ఉదాహరణ కావాలి. పేరెంట్స్ ప్రవర్తనే ప్రోత్సాహం కావాలి. పేరెంట్స్ నడవడికే స్ఫూర్తి కావాలి.
 
గాంధీజీ, నేతాజీ, నెహ్రూజీ.. భారతావనికి పేరుతెచ్చిన ఇలాంటి ఎందరో మహనీయుల గురించి పిల్లలకు చెప్పడం అంటే వారి అడుగుజాడల్లో కొంతమంచినైనా భావితరానికి పంచుతున్నామన్నట్టే. కానీ, తోబుట్టువునో, పక్కింటి అబ్బాయినో, ఇరుగింటి అమ్మాయినో ఉదాహరణగా చూపిస్తూ -‘నీ వయసే కదా..! నువ్వూ అలా ఉండచ్చు కదా!’ అనడమో.. ‘నీ క్లాసే కదా, ఎప్పుడూ క్లాస్ ఫస్టే.. నువ్వూ ఉన్నావు ఎందుకు తిండి దండగ...’ అని తిట్టడమో చేస్తున్నారంటే కచ్చితంగా పిల్లల భవిష్యత్తుకు కీడు తలపెడుతున్నారన్నమాటే. అందుకు ఈ రెండు ఉదాహరణలే నిదర్శనం....

 తోబుట్టువుల్లో ‘పోలిక’ పెద్ద సమస్య...
 రాకేష్- రవి ఇద్దరూ కవలపిల్లలు. ఇద్దరూ 8వ తరగతి చదువుతున్నారు. తల్లిదండ్రులిద్దరూ సాప్ట్‌వేర్ ఇంజినీర్లవడంతో పిల్లలను ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తున్నారు.  రాకేష్ అన్నింటా ఫస్ట్ వస్తుండటంతో స్నేహితులు, టీచర్లు..‘రవీ, మీరిద్దరూ ఒకేసారి పుట్టారు. ఒకేలా ఉంటారు. కానీ, రాకేష్‌లా ఎందుకు చదవవు’ అనేవారు. ఇంట్లో ఇలాంటి పోలికలేవీ లేకపోవడంతో ఆ మాటలను రవి  పట్టించుకునేవాడు కాదు. కానీ, ప్రతీసారి పేరెంట్ టీచర్ మీటింగ్‌లో తల్లిదండ్రులతో ‘రాకేష్ అన్నింటా బెస్ట్, రవినే ఇంప్రూవ్ చెయ్యండి’ అనేవారు టీచర్లు. దీంతో కొన్నాళ్లుగా ఇంట్లో కూడా తల్లిదండ్రులు ‘అన్నయ్య చేయగలిగిన పనిని నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు.. అన్నయ్యను చూసైనా నేర్చుకో’ అంటుండేవారు. ప్రతీ చిన్న దానికీ పోలిక ఎక్కువైంది. అప్పటిదాకా కొంతవరకే వెనకబాటులో ఉండే రవి ఇంకా వెనకబడిపోయాడు. ఏ పని చేయాలన్నా అన్నయ్యలాగా సవ్యంగా చేయలేనేమో అనే భయపడేవాడు. అన్నయ్య లాగా మార్కులు రావు అనే భయంతోనే స్కూల్‌కి సరిగా వెళ్లడం లేదు. ఇంట్లోనూ చిన్నపాటి దొంగతనాలు కూడా చేస్తున్నాడు. తల్లిదండ్రులు ఎదురు తిరుగుతున్నాడు. దీంతో తల్లిదండ్రి నిపుణులను కలిశారు.

‘దీనినే ఇంటర్ పర్సన్ కంపేరిజన్ అంటారు’ అన్నారు పిల్లల మనస్తత్వ నిపుణులు. ‘తోబుట్టువులతో పోల్చి చూపితే బాగుపడతారు అనుకుంటారు. కానీ, అది వారిని మరింత కృంగిపోయేలా చేస్తుంది’ అని చెబుతున్నారు సైకియాట్రిస్ట్ డా.కల్యాణ్. రవికి కౌన్సెలింగ్ చేసిన డాక్టర్ రవి ఏమన్నాడో చెబుతూ- ‘అంకుల్, ప్రతీసారి అన్నయ్యలాగా అలా ఉండు, ఇలా ఉండు అంటారు. నేనెంత మంచి పని చేసినా ఎవరూ మెచ్చుకోరు. అదే చెడ్డ పనులు చేస్తే త్వరగా గుర్తిస్తున్నారు. ఇదే బాగుంది కదా!’ అన్నాడు. ఈ ప్రవర్తననే కాండక్ట్ డిజార్డర్ అంటాం. రవితో పాటు తల్లిదండ్రులకు, అన్నకి కూడా ఆరునెలలుగా కౌన్సెలింగ్ ఇవ్వడం వల్ల అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. తోబుట్టువులతో పోల్చి చూడటం అందరిళ్లలో సాధారణంగా జరుగుతుంటుంది. కానీ, ఆ ‘పోలికే’ వారి ఎదుగుదలలో అసాధారణ ప్రభావాలను చూపుతుంది’ అని వివరించారు డా. కళ్యాణ్.

గతాన్ని ప్రస్తుత కాలంతో పోల్చడం తగదు
షైని తొమ్మిదో క్లాస్. టెన్నిస్ అంటే ప్రాణం. టోర్నమెంట్ గెలవాలనే ఆలోచనతో స్కూల్‌కెళ్లకుండా ప్రాక్టీస్‌మీదే దృష్టి పెట్టేది. అయినా, టీచర్లు, పేరెంట్స్ ఆమెను ప్రోత్సహించేవారు. దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ అయ్యి, కోలుకోవడానికి కొన్ని నెలలు పట్టింది. దీంతో ప్రాక్టీస్‌లో వెనకబడింది. కోచ్, పేరెంట్స్ ఆమె వెనకపడటాన్ని జీర్ణించుకోలేకపోయారు. ‘ఇది వరకు ఎంత బాగా ఆడేదానివి, ఇప్పుడిలా అయిపోయావేంటి..’ అంటుండేవారు. ఫిజికల్ పిట్‌నెస్ బాగైనప్పటికీ పదే పదే ఈ మాటల వల్ల ఆమె మెంటల్ ఫిట్‌నెస్‌ను దెబ్బతీశాయి. దీంతో ‘నేను చాలా వెనకబడిపోయాను, గెలవలేను’ అని ఆత్మన్యూనతతో టోర్నమెంట్ వరకు వెళ్లి, అందులో పాల్గొనకుండానే ఇంటికి వచ్చేసింది. టెన్నిస్‌ను పూర్తిగా వదిలేసింది. చదువులోనైనా రాణిద్దామని స్కూల్‌కి రెగ్యులర్‌గా వెళ్లడం మొదలుపెట్టింది. కానీ, ఆశించిన మార్కులు, గుర్తింపు రాలేదు. దీంతో ఎందులోనూ రాణించలేను అని తనపై తను నమ్మకం కోల్పోయింది. బాగా డెప్రెషన్‌కు లోనై, ఇమ్యూనిటీ తగ్గి, స్వైన్‌ఫ్లూ బారిన పడింది. దీనినే ‘ఇంట్రా పర్సన్ చైల్డ్ కంపేరిజన్’ అంటున్నారు సైకియాట్రిస్ట్‌లు. అంటే, పిల్లలను ప్రోత్సహించాలి అని గతానికి- నేటికీ పోల్చి చూపడం అన్నమాట. షైని సాధారణ స్థితికి రావడానికి రెండేళ్లు పట్టింది.

శక్తికి మించిన భారాన్ని మోపి ‘పోలిక’ వద్దు...
పిల్లలు మాట వినడం లేదు. మొండిగా ప్రవర్తిస్తున్నారు. తమ కుటుంబ స్థితి ఏంటో తెలుసు కోవడం లేదు. మార్కులు సరిగా రావడం లేదు. ఏం చేయాలి...??! ఇలాంటప్పుడే ‘పోలిక’ మంత్రం మైండ్‌లోకి వస్తుంది. ఆ పదాన్ని పిల్లల ఎదుట పదే పదే నోరు ఉచ్చరిస్తుంది.

దీంతో పాటు తరచూ ఉపయోగించే ‘పోలిక’...
తల్లిదండ్రులు తమ కలలను పిల్లల ద్వారా తీర్చుకోవాలనుకుంటారు. దీంతో పిల్లల శక్తికి మించిన భారాన్ని మోపి, దాంట్లో వారు అనుకున్నస్థాయిలో విజేతలు కానప్పుడు ఆందోళన చెందుతారు. అప్పుడే ‘గతంలో మేం కనీస వసతులు లేకుండా ఎలా చదువుకున్నామో తెలుసా! ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా ఈ మాత్రం సాధించలేకపోతున్నావు’ అంటూ తమ గతానికి- పిల్లల ప్రస్తుతానికి కంపేరిజన్ చేస్తూ మాట్లాడతారు. ఇది సాధారణంగా అందరి ఇళ్లలోనూ చూస్తుంటాం.

ఇక కొందరు పేరెంట్స్ అప్పటి వరకు ఒక మాదిరి కాలనీలలో ఉండి పిల్లల కోసం హైలొకాలిటీకి మారుతారు.  పిల్లలకు హై సొసైటీని పరిచయం చేయాలనే తాపత్రయంతో. అక్కడకు చేరాక ‘మీరు కూడా ఈ కాలనీలోని పిల్లల్లాగే ఉండాలి’ అని చెబుతారు. దీంతో గత వాతావరణం.. అక్కడి పిల్లలు, ప్రస్తుత వాతావరణం.. ఇక్కడి పిల్లల ప్రవర్తన.. వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి.మరికొందరు పేరెంట్స్ మామూలుగా చదివే తమ పిల్లవాడిని చాలా స్ట్రిక్ట్‌గా ఉండే స్కూల్‌లో చేర్పిస్తారు. అక్కడి పిల్లల్లాగే చదవమని ఒత్తిడి చేస్తుంటారు.  ఇంకొంతమంది పేరెంట్స్ పిల్లల స్టడీ గ్రాఫ్ కొద్దిగా పడిపోయినా చాలు భవిష్యత్తులో వారు చేరబోయే కోర్సుల్లో సరిగ్గా రాణించలేరని ఇప్పుడే భయపడుతూ తోటివారితో కంపేర్ చేస్తుంటారు. దీనిని ‘పేరెంటల్ యాంగ్జైయిటీ కంపేరిజన్’ అంటారు.

పిల్లల మనస్తత్వం అర్థంకాకుండా ఉంటే నిపుణుల సూచనలు తీసుకోండి. మీ కాలనీ, అపార్‌‌టమెంట్‌లలో నెలకు ఒకసారైనా గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి, నిపుణుల చేత అర్థమయ్యేలా స్పీచ్ ఇప్పించండి. మీ అబ్బాయి చదివే స్కూల్‌లో పేరెంట్-టీచర్ మీటింగ్ సమయంలోనూ నిపుణుల చేత ఈ తరహా క్లాసులు నిర్వహించడం అందరికీ మేలు చేస్తుందని పాఠశాల యాజమాన్యానికి తెలియజేయండి. పోలిక లేకుండానే మీ పిల్లలను విజేతలుగా నిలపండి.    - సాక్షి ఫ్యామిలీ
 
మంచి కన్నా చెడే అధికం...
పోలిస్తే పోయేదేముందిలే అనుకుంటారు. కానీ, పోయేది మీ పిల్లల భవిష్యత్తే.  ఎదుటివారితో పోల్చినప్పుడు ‘వారి’లా నేను సాధించలేను  అనే ‘నెగిటివ్ ఎఫెక్ట్’ పిల్లవాడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది.  సొంతంగా ఆలోచించే శక్తి సన్నగిల్లుతుంది. దీంతో ప్రపంచంలో ఏం జరుగుతుంది... ‘ఎందుకు? ఏమిటి? ఎలా?’ అని తెలుసుకోవాలనే ఆసక్తి తగ్గిపోతుంది.కంపేరిజన్ అధికంగా ఉన్న వాతావరణంలో పెరిగిన పిల్లలు పెద్దయ్యాక తరచూ డిప్రెషన్‌కి వెళ్లే ప్రమాదం ఉందని, వారి మీద వారు నమ్మకం కోల్పోవడం వల్ల భయం, ఆందోళనలతో ఏ పనినీ సవ్యంగా చేయలేక నిస్తేజంగా మారిపోతారని’ అమెరికన్ మెంటల్ హెల్త్ యూనివర్శిటీ పరిశోధకులు చెబుతున్నారు.
 
పోల్చకుండా పిల్లలను అభివృద్ది వైపు నడిపే మార్గాలు
ముందు గుర్తుంచుకోవాల్సింది... మీ పిల్లలు అందరి పిల్లల్లా కాదు అని.మీ పిల్లల కళ్ల ద్వారా ప్రపంచాన్ని చూడాలే తప్ప, మీ కళ్ల ద్వారా వారి ప్రపంచాన్ని చూడాలనుకోకూడదు. పిల్లలు ఎలా ఉన్నారో అలాగే వారిని అంగీకరించండి. నడకరాని పిల్లవాడు తనకు తానుగా నడక నేర్చుకున్నట్టు.. పడిపోతుంటే మీ వేలును అందించేలా ఉండండి. పిల్లల్లో ఉన్న బలాలను ముందు చెప్పాకే తర్వాత లోపాలను ఎలా సరిదిద్దుకోవాలో చెప్పండి. పిల్లల్లో ఉన్న ఆరోగ్య సమస్యలు, బలహీనతలు, జ్ఞాపకశక్తి.. ముందు వీటిని గుర్తించి సరిదిద్దండి. ఈ సమస్యలను కంపేరిజన్‌తో పారదోలచ్చు అనుకోకండి. పక్కింటి వారినో, ఎదురింటివారినో ఉదాహరణగా చూపడం కన్నా మీరే బెస్ట్‌గా పిల్లల ముందు నిలవండి. మాటలతో చెప్పడం కాకుండా మీ ప్రవర్తనతో ఆదర్శంగా నిలవండి. మానవ సహజంగా ఉండే బలహీనతలు, వాటిని అధిగమించడానికి ఉపయోగపడే నీతికథలు చెబుతూ ఉండండి. పిల్లలు ఎప్పుడెప్పుడో చేసిన అన్ని తప్పులను ఒకేసారి వేలెత్తి చూపకుండా అప్పటి ప్రధానాంశాన్ని మాత్రమే తీసుకొని హెచ్చరిస్తే మంచిది.
 - ఇన్‌పుట్స్: డా.కల్యాణ్, చైల్డ్ సైకియాట్రిస్ట్, లూసిడ్ డయాగ్నోస్టిక్స్, హైదరాబాద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement