
ప్రేమ కానుక
సందర్భం
ఎల్లుండి వాలెంటైన్స్ డే!
ఆత్మీయులకు కలకాలం నిలిచి ఉండే బహుమతిని ఇవ్వాలనిపించే సందర్భం...ఆ బహుమతిలాగానే నా ప్రేమ కూడా... అని చెప్పకుండా చెప్పే సందర్భం కూడ!!ఏమిస్తే బావుంటుంది? వజ్రంలా మెరిసే అమ్మాయిలకు వజ్రాన్ని బహుమతిగా ఇవ్వడమే సరైన ఆప్షన్. ఎలా కొనాలి? వజ్రాల ఆభరణాన్ని కొనే ముందు గుర్తుకు రావాల్సింది... ఆత్మీయుల మీద ప్రేమ మాత్రమే కాదు...ఐదు ప్రధానమైన విషయాలు కూడ. ఆ ఐదు సూత్రాలే ఈ ‘5 సి’లు!!
డైమండ్ నాణ్యతను తెలిపేవి ముఖ్యంగా నాలుగు అంశాలు. వాటినే అయిదు ‘సి’లు అని వ్యవహరిస్తారు. అవి... కలర్, క్లారిటీ, క్యారట్, కట్, సర్టిఫికేట్! అంటే... వజ్రం రంగు, స్వచ్ఛత, బరువు, సానబట్టిన విధానం, సర్టిఫికేట్. ఈ ఐదు ‘సి’లు ప్రధానమైనవి.
క్లారిటీ: క్లారిటీ పరీక్షలో... వజ్రాన్ని అసలు పరిమాణం కంటే పదింతలు చేసి చూపించే భూతద్దంలో పరిశీలిస్తారు. వజ్రంలో నీడ, చుక్క, మరక, గీత వంటి దోషాలు స్పష్టంగా కనిపిస్తాయి.
కట్: వజ్రం ఆకృతిని నిర్ధారించేది కట్. సాధారణంగా ఎక్కువమంది రౌండ్ కట్‌నే ఇష్టపడతారు. ఇది ఎవర్‌గ్రీన్ స్టయిల్ కూడ. చాలా రకాల ఆభరణాలు, డిజైన్లలో అమరుతుంది. దీనికి ఎక్కువ ముఖాలను చెక్కుతారు కాబట్టి మెరుపు, ధర ఎక్కువ.
కలర్: స్వచ్ఛత, రంగును బట్టి ఇంగ్లిష్ అక్షరం ‘డి’ నుంచి ‘జడ్’ వరకు శ్రేణులను నిర్ణయిస్తారు. ‘డి’ కేటగిరీ నుంచి ‘ఎఫ్’ వరకు వజ్రం తెల్లగానే ఉంటుంది. ‘జి’ నుంచి క్రమంగా వజ్రంలో పసుపు రంగు శాతం పెరుగుతూ వస్తుంది. ‘జడ్’ శ్రేణి వజ్రం పసుపురంగులో ఉంటుంది.
క్యారట్: ఇది వజ్రం బరువు. క్యారట్‌లో నూరోవంతు ‘సెంట్’. వజ్రం బరువు పెరిగే కొద్దీ దాని ఖరీదు అనూహ్యంగా పెరుగుతుంది. మార్కెట్‌లో కనిపించే పెద్ద నెక్లెస్‌లు, గాజులలో తక్కువ బరువు వజ్రాలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి.
సర్టిఫికేట్: పై నాలుగు ‘సి’లను పరిశీలించుకుని ఆభరణం కొనేస్తారు. కానీ, మరో ప్రధానమైన ‘సి’ సర్టిఫికేట్ తీసుకోవడం మర్చిపోకూడదు. ఆ సర్టిఫికేట్‌లో మనం కొన్న వజ్రం క్లారిటీ, కలర్ గ్రేడ్‌లను నమోదు చేస్తారు. ఆ షాపు అనుసరిస్తున్న ప్రమాణాలు ఏ సంస్థ సూత్రీకరించినవి అనే వివరాలు కూడా సర్టిఫికేట్‌లో ఉంటాయి. కొనుగోలుదారులు తిరిగి ఆ ఆభరణాన్ని విక్రయించాలనుకున్నప్పుడు అదే దుకాణదారు వజ్రాల ఖరీదును యథాతథంగా లేదా ఆనాటి మార్కెట్ ధర ప్రకారం చెల్లించాలి. అప్పుడు సర్టిఫికేట్ కీలకం అవుతుంది.
వజ్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఆభరణంగా అందాన్ని ఇనుమడింపచేయడమే కాదు, కాలంతోపాటు విలువ పెరుగుతుంది. అందుకే ఈ ‘వాలెంటైన్స్ డే’కి మీ ఇష్టులను వజ్రంతో ఆశ్చర్యచకితులను చేయండి.
సర్టిఫికేట్స్ ఎవరిస్తారు?
జెమొలాజికల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అమెరికా (జిఐఎ) ఈ రంగంలో ముందుగా ఏర్పడిన సంస్థ. ఇది ఆరు కేటగిరీలలో 11 గ్రేడ్లను ప్రమాణీకరించింది. ప్రస్తుతం దీంతోపాటు అమెరికన్ జెమొలాజికల్ సొసైటీ (ఎజిఎస్), ఇంటర్నేషనల్ జెమొలాజికల్ ఇన్‌స్టిట్యూట్ (ఐజిఐ), ఇంటర్నేషనల్ డైమండ్ కౌన్సిల్ (ఐడిసి) ప్రధానమైనవి. వీటి కేటగిరీలలో స్వల్పమైన తేడాలున్నాయి కానీ స్వచ్ఛత, రంగు విషయంలో మాత్రం దాదాపు ఏక రూపత ఉంటుంది. వీటితో పాటు అనేక లాబొరేటరీలు వజ్రాన్ని పరిశీలించి కేటగిరీలను నిర్ధారిస్తున్నాయి. అవన్నీ జిఐఎ సూత్రీకరించిన ప్రమాణాలనే పాటిస్తున్నాయి.