నాకు నచ్చిన ఐదు పుస్తకాలు | veluri venkateswara Rao likes this five books | Sakshi
Sakshi News home page

నాకు నచ్చిన ఐదు పుస్తకాలు

Published Mon, Oct 16 2017 1:05 AM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM

veluri venkateswara Rao likes this five books - Sakshi

బుద్ధ చరిత్రము (తిరుపతి వేంకటకవుల అనువాదం)
ఎడ్విన్‌ ఆర్నాల్డ్‌ రాసిన The Light of Asiaకి అనువాదం ఇది. తిరుపతి కవులు శంకరాద్వైతం లోనూ, వేదాలలోనూ, యజ్ఞయాగాది క్రతువుల్లోనూ నమ్మకం ఉన్నవాళ్ళు. బుద్ధుడు వేదాలను తిరస్కరించి ఏ క్రతువుకీ బలి కూడదనే అహింసావాది. ప్రబంధ పక్కీలో రాసినా ఈ పుస్తకంలో స్త్రీ వర్ణనలు మోతాదు మించలేదు. ఈ పుస్తకం తిరుపతి కవులని మార్చిందా? ఏ మిష మీదైనా సరే జీవహింస కూడదనే బౌద్ధవాదాన్ని ఒక వ్యాసంలో బలపరిచారు. బుద్ధ చరిత్రములో ఆఖరిగా శంకరాచార్యులు ఎంత తొక్కిపట్టినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా బుద్ధుని మతం ప్రచారంలోకి వచ్చిందని వక్కాణించారు. 

Blindness (Jose Saramago)
 హఠాత్తుగా ఏకకాలంలో ఊరందరూ గుడ్డివాళ్ళైపోతే ఏమవుతుందో ఊహించండి! అటువంటి విపత్సమయంలో ఊరిజనాన్ని ఒక వైద్యుని భార్య, తను గుడ్డిదానిగా నటిస్తూ, అందరినీ ఒక కొలిక్కి ఎలా తెచ్చిందో ‘చూపించే’ సుఖాంత రూపకం, ఈ నవల. పొడుగాటి గొలుసుకట్టు వాక్యాలతో, ఉత్తమ పురుష ప్రథమ పురుషల  మేలుకలయికతో అన్యాపదేశంగా చైతన్య స్రవంతికీ, కలవరపెట్టే యథార్థతకీ మధ్య పాఠకుణ్ణి వడివడిగా నడిపించే నవల. చూడగలగడం అంటే నిజంగా ఏమిటి? అన్నది ఆఖరిప్రశ్న. మానవనైజాన్ని అన్ని కోణాలనుంచీ ‘కళ్ళకి కట్టినట్టు’ చూపిస్తాడు సరమగొ. ప్రేమ, విశ్వాసం, భయం, పిరికితనం, హింస, దౌర్జన్యం, ఈర‡్ష్య, నిస్పృహ, ఆనందం – ఇవన్నీ. సరమగొ పోర్చుగల్‌ కమ్యూనిస్టు పార్టీ మెంబరు. అయితేనేం! తన పార్టీ గురించి ఇలా రాస్తాడు: ‘నా పార్టీకి, సాహిత్యానికి సంబంధించిన విషయాలపై, కళాత్మక వివాదాంశాలపై నిర్ణయించటానికి అర్హత ఉన్నదని నేను అనుకోను’.

పచ్చ నాకు సాక్షిగా 
(నామిని సుబ్రహ్మణ్యం నాయుడు)
చాలా ఏళ్ళక్రితం ‘సినబ్బ కతలు’ చదవటం మొదలెట్టా. నిజం చెప్పొద్దూ? ఆ బాస, ఆ యాస, మొదట్లో కొంచెం ఇబ్బంది పెట్టాయి. ‘రామ బజినా సేయరా! ఆడపిల్లతో పని ఏమిరా!!’  కత, ఒక పేరా చదవాను. అంతే! విడిచిపెట్టకుండా, ఆఖరి కత ‘చిత్తానూరులో పెండ్లి భోజనాలు’ పూర్తయ్యేవరకూ ఒకే బిగిన చదివేసాను, ఒక్కోసారి పగలబడి నవ్వుతూ, చాలాసార్లు కళ్ళనీళ్లు తుడుచుకుంటూ. ఈ కతలు ఆంధ్రావాళ్ళ భాషలో చెప్పినా, మరో భాషలోకి అనువదించినా (ఆ ప్రయత్నం చేసి విఫలుణ్ణయ్యాను!) రసం తీసేసిన చెరుకుపిప్పి నమిలినట్టుంటుంది. ఆ మిట్టూరోడి మాటల్లోనే అవి చదవాలి; కతల్లో నిజమైన సంతృప్తి, ధైర్యం, ప్రేమ, బాధ, విషాదం, కన్నీరు, హాస్యం – అన్నీ సరిపాళ్ళల్లో కావాలంటే. 

SrInatha: The Poet Who Made Gods and Kings (Velcheru Narayana Rao and David Shulman)
ఈ పుస్తకం, క్రీ.శ. 1370–1450 మధ్య జీవించిన శ్రీనాథ కవిసార్వభౌముని జీవిత చరిత్ర (Literary Biography). కావ్యాలు రాసిన శ్రీనాథుడినీ, చాటువుల్లో కనిపించే శ్రీనాథుణ్ణీ ఒకడుగానే పరిగణించి సాహిత్య పరిశోధనలు చేసిన చాలామంది నిజమైన ‘సాహిత్య జీవిత చరిత్ర’కి కొంత అపచారం చేసి ఉండవచ్చు. ఒక కవి రాసిన కావ్యాలన్నీ నిశితంగా పరిశీలించి ఆ కవి జీవిత చరిత్రని చెప్పిన మొట్టమొదటి పుస్తకం ఇది. శివరాత్రి మాహాత్మ్యం దక్షిణ ఆసియాలో వచ్చిన తొలి నవలిక అని సాధికారంగా నిరూపించిన పుస్తకం. భీమఖండం చాలా భాగం శ్రీనాథ కల్పితం. ఈ పుస్తకం చదివిన తరువాత, శ్రీనాథుని కల్పనా సౌందర్యం మెచ్చని వారుండరు. 

Collected Stories by Raymond Carver
రేమండ్‌ కార్వర్‌ అమెరికన్‌ కథకి 1960 – 1980లలో ఒక కొత్త రూపం ఇచ్చాడు. మినిమలిజం అని, రియలిజం అని ఏ పేర్లు పెట్టినప్పటికీ, అతనిపై పరోక్షంగా షెహోవ్‌ ప్రభావం ఉన్నదన్నది నిర్వివాదం. ఆయన కథా సంకలనాలన్నీ కలిపి, ఒక బృహత్సంకలనం (1020 పేజీలు)గా అచ్చు వేసారు. కెథెడ్రల్‌ గొప్ప కథ. ఒక గుడ్డివాడికి కెథెడ్రల్‌ ఎలా వుంటుందో చెప్పటం ఎంత కష్టమో, ఎంత అలసట పుట్టించే విషయమో సూచించే కథ. ఈ ఒక్క కథపై కొన్ని వందల వ్యాఖ్యలు వచ్చాయి. ఈయన కథలలో అనాసక్తత, ఆవేదన అతి సున్నితంగా మలచబడటం కనిపిస్తుంది. మొదట్లో కార్వర్‌ కథలన్నీ అతని ఎడిటర్‌ గోర్డన్‌ లిష్‌ కత్తిరించి చాలా మార్పులు చేసి ప్రచురించాడు. కార్వర్‌కి పేరు వచ్చిన తరువాత వారిద్దరి మధ్య స్నేహం చెడింది. రెండు కథలు – కార్వర్‌ రాసింది రాసినట్టుగానూ, గోర్డన్‌ లిష్‌ మార్పులతోనూ కలిపి ప్రచురించారు. ఈ భాగం ఎడిటర్లకి నచ్చవచ్చు. రచయితలకి చిరాకు కలిగించవచ్చు.
 

వేలూరి వేంకటేశ్వర రావు 
vrveluri@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement