దృశ్యం : డాక్యుమెంటరీ పరిచయం | View: Documentary Introduction | Sakshi
Sakshi News home page

దృశ్యం : డాక్యుమెంటరీ పరిచయం

Published Thu, Mar 19 2015 12:31 AM | Last Updated on Sat, Sep 15 2018 4:22 PM

దృశ్యం : డాక్యుమెంటరీ పరిచయం - Sakshi

దృశ్యం : డాక్యుమెంటరీ పరిచయం

ప్రముఖ దర్శకుడు హిచ్‌కాక్ డాక్యుమెంటరీల గురించి ఒక ప్రసిద్ధ వాక్యం చెప్పి వాటి గొప్పదనాన్ని చెప్పకనే చెప్పారు. డాక్యుమెంటరీ చూడడం అంటే పరిచితమో, అపరిచితమో... ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టడం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ డాక్యుమెంటరీల పరిచయమే... ఈ దృశ్యం.
ఫీచర్ ఫిలిమ్స్‌లో డెరైక్టరే దేవుడు. డాక్యుమెంటరీ ఫిలిమ్స్‌లో దేవుడే డెరైక్టర్.
- ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్

 
ఆ చరిత్ర ఏ సిరాతో....
నాలుగైదు రోజుల క్రితం శ్రీలంకలో నరేంద్ర మోడి పర్యటించారు. 28 ఏళ్ల తరువాత భారత ప్రధాని చేసిన లంకయాత్ర గురించి యావత్ ప్రపంచం ఆసక్తి ప్రదర్శించింది. మన ప్రధాని శ్రీలంక పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. యుద్ధసంక్షోభిత ప్రాంతాలను సందర్శించారు. ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారంటూ ప్రభుత్వానికి కితాబు కూడా ఇచ్చారు. కొత్త ప్రయాణం ప్రారంభించిన జాఫ్నాకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు. శిరస్సు వంచి నమస్కరించారుగానీ... నెత్తుటి మడుగులో ఉన్న జాఫ్నా శిరస్సు మన ప్రధానికి కనిపించి ఉంటుందా?!
 
శ్రీలంకంలో మన ప్రధాని రెండు రోజుల పర్యటనలో... ప్రపంచాన్ని కుదిపేసిన ఒక డాక్యుమెంటరీ చాలామందికి గుర్తుకు వచ్చి ఉంటుంది. ఆ డాక్యుమెంటరీ పేరు: ‘శ్రీలంకాస్ కిల్లింగ్ ఫీల్డ్స్’
అంతర్యుద్ధం (అంతర్యుద్ధమా? ఏకపక్ష దాడా?) చివరి దశలో శ్రీలంక ప్రభుత్వ దమనకాండని ఈ డాక్యుమెంటరీ కళ్లకు కడుతుంది. యుద్ధంలో ఒక దేశం మరో దేశంపై దాడి చేస్తుంది. కానీ ఈ యుద్ధంలో మాత్రం శ్రీలంక ప్రభుత్వం తన సొంత బిడ్డలను నిర్దాక్షిణ్యంగా చంపేసింది. నెత్తుటి చేతులతో శాంతి జపమాల తిప్పడం ప్రారంభించింది.
 
ఒక చిత్రం వెయ్యి పదాలను చెబుతుంది అంటారు. ఈ డాక్యుమెంటరీలో చూపెట్టిన ఎన్నో చిత్రాలు లక్షలాది విషాదాలను చెబుతాయి. యుద్ధవాస్తవాలు అనేవి కేవలం గణాంక వివరాలకు మాత్రమే పరిమితమైనవని, ఆ ద్వీపదేశ దుఃఖం ఆ దేశ అంతర్గత విషయం మాత్రమేనని నమ్మితే... ఈ డాక్యుమెంటరీకి ఎలాంటి శక్తి ఉండకపోవచ్చు. తన కళ్ల ముందే కాల్పుల్లో చనిపోయిన తల్లిదండ్రులను చూసి దుఃఖిస్తున్న చిన్నారి పాప దుఃఖానికి ప్రపంచాన్ని కదలించే శక్తి ఉంది అని నమ్మితే మాత్రం... తప్పకుండా ఈ డాక్యుమెంటరీ శక్తిమంతమైనదే.
బంకర్‌లో తలదాచుకొని నేలపై శవంగా పడి ఉన్న తల్లిని చూస్తూ రోదిస్తున్న ఇద్దరు ఆడపిల్లలు, చనిపోయిన పిల్లల శవాల దగ్గర కూర్చొని గుండెలు బాదుకుంటున్న తల్లి, చనిపోయిన చిట్టి కొడుకును పాలిథిన్ బ్యాగులో సర్దుకొని ‘నా కొడుకును చూడండి’ అని బస్సులో రోదిస్తున్న తండ్రి, నగ్నంగా పడి ఉన్న యుద్ద ఖైదీల చేతులకు కట్లు కట్టి తలలో బుల్లెట్లు దింపుతున్న సైనికులు, కుప్పలుగా పడి ఉన్న శవాల మీద ప్రశ్నార్థకాలై తిరుగుతున్న ఈగలు, నిండా పన్నెండేళ్లు లేని ప్రభాకరన్ కొడుకును క్లోజ్ రేంజ్‌లో అయిదుసార్లు కాల్పులు జరిపిన సైనికులు. ఇంకా వారి చిత్రహింసలు, లైంగిక దాడులు... ఎన్నో!
 
‘‘అయ్యా... నా కొడుకు ఏం నేరం చేశాడు?’’ అని కొడుకు శవాన్ని చూస్తూ రోదనతో అడిగిన తల్లి, తమను తాము రక్షించుకోవడానికి ఒక కుటుంబం పాడే పాట్లు, నో ఫైర్ జోన్‌లో ఆస్పత్రిపై పడే బాంబులు, చీమలు పట్టిన చిన్నారుల మృతదేహాలు, పూతుక్కుడిరిప్పు ఆస్పత్రిలో అసహాయంగా వినిపించే బాధితుల గొంతులు, ‘‘వీళ్లు మన ప్రభుత్వ ఆస్తి... కాల్చి పారేయండి నా కొడుకులను’’ వికటాట్టహాసం చేసే సైనికులు... ఇలా ఎన్నో దృశ్యాలు కంట కన్నీరు తెప్పిస్తాయి.
 
ఆనాటి శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే, రక్షణమంత్రి గోటబయ రాజపక్సేలతో సహా అగ్ర స్థాయి మిలటరీ అధికారులను, దయలేని విజయంగా చెప్పుకునే ‘మే 2009’ పాపంలో పాలు పంచకున్న వాళ్లను ఈ డాక్యుమెంటరీ ప్రశ్నిస్తున్నట్లు ఉంటుంది. కృత్రిమ ఆడంబరాలకు, సంచలనాలకు ఆస్కారం ఇవ్వకుండా ఈ డాక్యుమెంటరీని నిర్మించారు.తమ ఊచకోతకు ‘వార్ ఆన్ టై’ అని పేరు పెట్టుకొని సంతృప్తిపడే ప్రభుత్వ దుర్మార్గాన్ని నెత్తుటి ప్రశ్నలతో ప్రశ్నించడం మాత్రమే కాదు, చేయూత ఇద్దామని వెళ్లి చేతులెత్తేసిన  ‘రెడ్ క్రాస్ సొసైటీ’ దీనత్వాన్ని కూడా ఈ డాక్యుమెంటరీ ఎక్స్‌పోజ్ చేస్తుంది.

నాణ్యతపరంగా ఈ వీడియో దృశ్యాల్లో బలం లేకపోవచ్చుగానీ, అది అనేక కోణాలలో, అనేక గొంతులతో వినిపించే వాస్తవం మాత్రం చాలా బలంగా ఉంటుంది. విషయాన్ని అర్థం చేసుకోవడానికి సబ్ టైటిళ్లు, లంక తమిళం... ఇలా వేటితో పనిలేదు. మృత్యువుతో పోరాడుతూ ఒక పిల్లాడు తనలో తాను ఏమి గొణుక్కుంటున్నాడు అని తెలుసుకోవడానికి శబ్దసహకారం అక్కర్లేదు. పెదాల భాషే సరిపోతుంది.
 
తెల్లటి దుస్తులపై మెరున్ కలర్ కండువా వేసుకొని, జాతీయజెండాను చేత్తో పట్టుకొని వీధి వీధి రాజపక్సే ఊరేగుతున్న దృశ్యం ఒకటి దీనిలో ఉంది. అలాగే ఒక చర్చాకార్యక్రమంలో పాల్గొనడానికి తెల్లటి నవ్వులతో ఎర్రటి తివాచీపై నడుస్తున్న అతడి విజువల్ ఒకటి ఇందులో కనిపిస్తుంది. అయితే అతని తెల్లటి దుస్తులు క్షణాల్లో నెత్తురు పులుముకొని ఎరుపురంగులోకి మారిపోవడం, చేతిలోని జాతీయ జెండా సిగ్గుతో తలవంచుకోవడం, రాజపక్సే ఒక చర్చావేదికకు నడిచొచ్చింది... ఎర్రటి తివాచీపై కాదని, నెత్తుటి ప్రవాహంపై అని అనిపించడం మానసిక భ్రమేమీ కాదు... మహా వాస్తవం అనిపిస్తుంది.
 
చావు నుంచి బయటపడ్డ అమాయకులు, చావే నయం అనుకున్న విధివంచితులు, మానవహక్కుల వాళ్లు, ఇంటర్నేషనల్ లా ఎక్స్‌పర్ట్‌లు... మొదలైన వారి అభిప్రాయాలు ఇందులో ఉన్నాయి. ఈ డాక్యుమెంటరీ కోసం యుఎన్ ఫుటేజి, యుఎన్ అధికారుల ఐ-విట్నేస్ రిపోర్ట్స్‌పై ఆధారపడ్డారు. అత్యాధునిక కెమెరాలేవీ ఉపయోగించలేదు. అంతర్యుద్ధపు చివరిదశలోని యుద్ధనేరాలు, ఉరితీతలు, చిత్రహింసలు, లైంగిక హింసలను.. చిన్న చిన్న కెమెరాలతో, సెల్‌ఫోన్ కెమెరాలతో చిత్రించగా... వాటిని ఈ డాక్యుమెంటరీ కోసం వాడుకున్నారు. ఈ డాక్యుమెంటరీకి వచ్చిన అంతర్జాతీయ అవార్డ్‌లు, రివార్డ్‌ల గురించి పక్కన పెడితే ‘తప్పక చూడండి’ జాబితాలో చేరడానికి కారణం ఎవరో అన్నట్లు - ‘‘అది మీకు సమాచారం మాత్రమే ఇవ్వదు. షాక్ కూడా ఇస్తుంది. ఆ తరువాత మీ మనసులనూ మార్చేస్తుంది’
 - యాకుబ్ పాషా యం.డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement