నాయనలారా! ఇది నా కోరిక! | Vinayaka Chavithi Special Story | Sakshi
Sakshi News home page

నాయనలారా! ఇది నా కోరిక!

Published Sat, Aug 31 2019 8:51 AM | Last Updated on Sat, Aug 31 2019 8:51 AM

Vinayaka Chavithi Special Story - Sakshi

కృష్ణద్వీపంలో నివసించే వేదవ్యాసుడికి మదిలో ఒక కథ మెదిలింది. ఆ కథను అక్షరీకరించాలనుకున్నాడు. తాను నిరాఘాటంగా చెబుతుంటే, ఆపకుండా రాయగలిగే వ్రాయసగాని కోసం చూశాడు. ఈ సత్కార్యం విఘ్ననాయకుడైన వినాయకుని పవిత్ర హస్తాల మీదుగా సాగితే బాగుంటుందనుకున్నాడు. నేరుగా వినాయకుడి దగ్గరకు వెళ్లి, ‘నాయనా! నేను మహాభారత రచన ప్రారంభిద్దామనుకుంటున్నాను. నాకు వ్రాయసకాడు కావాలి. నేను వేగంగా చెబుతుంటే, అంతే వేగంగా రచన చేయాలి. ఇలా రాయాలంటే వ్రాయసకాడు కూడా జ్ఞాని అయి ఉండాలి. అందుకు నువ్వే తగినవాడివని భావించాను. మన భారత రచన ఎప్పుడు ప్రారంభిద్దాం గణేశా’ అని ఆప్యాయంగా పలకరించాడు. అందుకు ఆ గజాననుడు వినమ్రంగా శిరసు వంచి, మహర్షీ! మీ అంతటివారు నన్ను ఎంచుకున్నందుకు సదా ధన్యుడిని. మీరు సుముహూర్తం నిర్ణయించండి, ప్రారంభిద్దాం’ అన్నాడు ఉమాపుత్రుడు. ‘మంచిపనికి ముహూర్తం అక్కర్లేదు నాయనా! తక్షణమే ప్రారంభిద్దాం’ అన్నాడు బాదరాయణుడు. లంబోదరుడు పాదప్రక్షాళనం చేసుకుని, తాళపత్రాలు, ఘంటం చేత బట్టి, తన తల్లిదండ్రులైన ఆదిదంపతులను స్మరించి, మనస్సును భ్రూమధ్యం లో లగ్నం చేసి, రచనకు సన్నద్ధుడయ్యాడు.

వ్యాసుడి నోటి నుంచి శ్లోకాలు నిశిత శరాలుగా వెలువడుతున్నాయి, వినాయకుడి ఘంటం అంతే వేగంతో పరుగులు తీస్తోంది. భారత రచన పూర్తయ్యేవరకు వినాయకుడు కదలలేదు, మెదలలేదు, పెదవి కదపలేదు. నిర్విఘ్నంగా లక్ష శ్లోకాలు పూర్తయ్యాయి. వ్యాసుడి దగ్గర సెలవు పుచ్చుకుని కైలాసం చేరుకున్నాడు. తల్లిదండ్రులను దర్శించాడు. కుశల సమాచారం అడిగారు పార్వతీపరమేశ్వరులు. వ్యాసభగవానుడి అద్భుత సృష్టికి తమ కుమారుడు ఘంటం పట్టినందుకు ఆనందపారవశ్యం చెందారు. భూమి మీద భారతం ఉన్నంతకాలం వినాయకుడి పేరు కూడా నిలబడిపోతుందని పరవశించారు.

అమ్మా! ఇంతకాలం వ్యాసభగవానుడి దగ్గర ఉండి, జ్ఞానసముపార్జన చేశాను. ఎంతో విజ్ఞానదాయకమైన భారతాన్ని అందరికంటె ముందుగా తెలుసుకోగలిగాను. అనితర సాధ్యమైన ఇటువంటి రచనను, కొన్ని యుగాలు గడిచినా ఎవ్వరూ రచించలేరమ్మా! ఇంతకాలం మీకు దూరంగా ఉన్నందుకు నేను ఎన్నడూ చింతించలేదమ్మా. మీరు కూడా సంబరపడే ఉంటారు. ఇప్పుడు నా మనసుకి కొంచెం విశ్రాంతి కావాలనిపిస్తోంది. కొంతసేపు భూలోకంలో సంచరించాలని ఉంది. పైగా ఈ రోజు నా పుట్టిన రోజు కదమ్మా! ఈ వేడుకలను భూలోక వాసులు ఎంతో సంబరంగా జరుపుకుంటారు కదా! నీ అనుమతితో భూలోకంలో సంచరించి వస్తానమ్మా’ అన్నాడు గణనాయకుడు. అందుకు పార్వతి, ‘నాయనా!  ఇంతకాలం నువ్వు మాకు దూరంగా ఉన్నావు. నిన్ను విడిచి ఉండలేమయా. నేను కూడా నీ వెంట వస్తాను.

నిన్ను ఒక్కో సంవత్సరం ఒక్కో కొత్త అవతారం లో భూలోకవాసులు రూపొందిస్తున్నారు కదా. ఎక్కడెక్కడ ఎవరెవరు నిన్ను ఎలా పూజిస్తున్నారో కనులారా చూసి ఆనందించాలని ఉంది’ అంది పార్వతి. ‘నా మూషికం మీద ఈ యావత్ప్రపంచం నీకు చూపిస్తానమ్మా. ముందుగా నన్ను ఆశీర్వదించు’ అని తల్లి దీవెనలు అందుకుని, తల్లిని తన వాహనం మీద కూర్చుండబెట్టి బయలుదేరాడు వినాయకుడు.

నారద విలేకరి...
వినాయకుడు భూలోక సంచారానికి బయలుదేరుతున్నాడన్న వార్త తెలిసిన త్రిలోక సంచారి నారదుడు, ఈ సమాచారాన్ని తానే ముందుగా అందరికీ అందించాలని, వినాయకుడి కంటె ముందుగానే తన సామాగ్రితో బయలుదేరాడు. వినాయకుడి వెంట తల్లి కూడా ఉండటం చూసి, వెంటనే ‘తాజా వార్త’ అంటూ ప్రచారం చేసేసి, మళ్లీ వారి వెంట బయలుదేరాడు మరింత సమాచార సేకరణ కోసం. దారి పొడుగునా తల్లికొడుకులు ఎన్నో విషయాలు మాట్లాడుకుంటున్నారు.

‘నాయనా! నిన్ను రకరకాల రూపాలుగా విగ్రహాలు చేస్తుంటారు కదా! నీకు కోపం రాదా’ అని ప్రశ్నించింది. వినాయకుడు చిరునవ్వులు చిందిస్తూ, ‘అమ్మా! నువ్వు నీకు కావలసిన విధంగా నన్ను అలంకరించుకుంటావు! అవునా! మనకు చనువైన వారి దగ్గరే మనకు కావలసినవి అడుగుతాం. భూలోక వాసులకు నా మీద చనువుతో కూడిన ప్రేమ ఉంది. నన్ను వారి ఇంటి మనిషిగా భావించి, వారికి నచ్చిన రూపంలో నన్ను అలంకరిస్తుంటారు. అంతేనా! చిత్రకారులు నా మీద వ్యంగ్య చిత్రాలు వేస్తూనే ఉంటాడు, హాస్యకథలు రాస్తూనే ఉంటారు. నేనంటే ప్రీతి కనుకనే వారు ఇన్ని విధాలుగా నన్ను అక్కున చేర్చుకుంటున్నారు’ అన్నాడు వినాయకుడు.

‘నాయనా! నీ మాటలు బాగానే ఉన్నాయి. నిన్ను కొందరు నులక  మంచం మీద విశ్రాంతి తీసుకుంటున్న వినాయకుడిగా చూపుతారు, కొందరేమో స్కూటర్‌ వినాయకుడిగా కొలుస్తారు, మరి కొందరు నీకు నల్ల కళ్లజోడు పెడతారు. కొందరు నువ్వు క్రికెట్‌ ఆడుతుంటే చూసి మోజుపడుతున్నారు’ అని పార్వతీదేవి ఏకరువు పెడుతుంటే, మధ్యలోనే  అడ్డుతగిలి వినాయకుడు, ‘అంతేనా అమ్మా!  కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ, నాలోని సిద్ధి, బుద్ధి లక్షణాలను నా భార్యలుగా చేశారు’ అంటుంటే, మధ్యలో నారదుడు అడ్డు తగిలి, ‘అయ్యా! వినాయకా! మీతో కోలాటం ఆడించారు. ఆకులను మీ రూపంగా మలిచారు. ముచ్చటగా మీ ఒడిలో శ్రీకృష్ణుడిని కూర్చోపెట్టారు’ అంటూ రకరకాల రూపాలను వివరించాడు. నారదుడి మాటలకు తొండం వెనుక నుంచి ముసిముసిగా నవ్వుతూ, ‘త్రిలోక సంచారీ! నా పుట్టినరోజు పేరుతో ఎంతోమంది తమలోని సృజనను వెలికి తీస్తున్నారు. దేవతలలో ఎవ్వరికీ దక్కని ఈ ఘనత నాకు మాత్రమే దక్కింది. నా భక్తులు నన్ను వారి కుమారుడిగా భావించి, నన్ను అలంకరిస్తున్నారు. ఎవరు ఏ రూపంలో ఆరాధించినా నాకు అందరి మీద ఒకే ప్రేమ ఉంటుంది’ అని పలికాడు గణనాథుడు.

ఇది నా అభ్యర్థన...
నా పేరున జరుగుతున్న ఈ తొమ్మిది రోజుల పండగ సందర్భంగా ప్రతి పందిరిలోను, భక్తి పాటలను మాత్రమే వేయాలని కోరుకుంటున్నాను. అసభ్యపు పాటలు వేస్తున్నారని, అసభ్య పదాలను పలుకుతున్నారని నలుగురూ అనుకోవడం నాకు బాధగా ఉంటుంది. నా పుట్టినరోజును సంబరంగా, సంతోషంగా, ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే  అందరూ నన్ను మట్టితో రూపొందించాలి. ఇది నా అభ్యర్థన.    – గణపతి, కైలాసం

ఇంతలోనే నారదుడు మళ్లీ, ‘వినాయకా! ఋషులు సైతం నిన్ను విడిచిపెట్టలేదు! నిన్ను షోడశ గణపతులుగా పేర్కొన్నారు. నిరుత్త గణపతి నుంచి మళ్లీ నిరుత్త గణపతిగా అమావాస్య నుంచి పౌర్ణమి దాకా అర్చిస్తున్నారు. ఎంతటి ఘనత గణనాథా నీది. నాది ఒక్కటే చిన్న విన్నపం! నీ పేరు చెప్పుకుని పర్యావరణాన్ని పాడు చేస్తున్నారని కొందరు నిన్ను నిందిస్తున్నారు. ఈ నీలాపనిందలు పడకుండా, నీ భక్తులందరికీ నిన్ను మీ అమ్మ రూపొందించినట్టుగా మట్టితోనే తయారు చేయమని ఆశీర్వదించు’ అంటూ నారదుడు సాష్టాంగపడ్డాడు.– వైజయంతి పురాణపండ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement