పచ్చటాకుల పెంపకంలో పండుటాకులు | Watering the trees planted as part of their greenery | Sakshi
Sakshi News home page

పచ్చటాకుల పెంపకంలో పండుటాకులు

Published Fri, Sep 22 2017 12:08 AM | Last Updated on Wed, Sep 5 2018 2:12 PM

పచ్చటాకుల పెంపకంలో పండుటాకులు - Sakshi

పచ్చటాకుల పెంపకంలో పండుటాకులు

ఎవర్‌గ్రీన్‌

వయసుడిగిపోయింది. ఊరు పొమ్మంటుంది.. కాడు రమ్మంటుంది.. అంటూ ఇంటి అరుగుల మీదనో,  వసారాలోనో మునగదీసుకుని పడుకుని, పైవాడి పిలుపుకోసం ఎదురు చూస్తూ రోజులు వెళ్లదీయడం చాలామంది వృద్ధులు చేసేదే. అయితే.. సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్‌ మండలంలోని ఇబ్రహీంపూర్‌ గ్రామ వృద్ధులు ఇందుకు భిన్నం. ‘రేపటి తరం కోసం మేము సైతం’ అంటూ కమిటీగా ఏర్పడి.. హరిత హారంలో భాగంగా నాటిన చెట్లకు నీళ్లు పోస్తూ.. అవి ఏపుగా పెరుగుతుంటే చిన్నపిల్లల్లా సంబరాలు పడుతూ యువతరానికి కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు.

చెట్లను పెంచేందుకు...
చెట్లను సంరక్షించేందుకు ఇబ్రహీంపూర్‌ గ్రామంలోని వృద్ధులు కమిటీలుగా ఏర్పడ్డారు. 367 కుటుంబాలు, 1228 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో 70 నుండి 85 సంవత్సరాల  వయస్సున్నవారు దాదాపు వందమందిదాకా ఉన్నారు. వీరు  ఇద్దరిద్దరు ఒక జట్టుగా ఏర్పడి, ఒక్కో జట్టు 20 నుండి 50 మొక్కలకు రోజూ ఉదయం, సాయంత్రం నీళ్లు పోస్తున్నారు. చుట్టూ కంచెవేసి, వాటిని రక్షించే పనిలో నిమగ్నమయ్యారు. గ్రామంలో మూడు విడతల హరిత హారంలో భాగంగా 3 లక్షల మొక్కలను నాటారు. వీటిల్లో గ్రామ అంతరంలో నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత వృద్ధులదే.. గ్రామంలో ఉన్న నీటి పంపులు, ఇండ్లలో ఉన్న బోర్ల వద్ద నుండి పైపులు వేసి, లేదా చిన్న చిన్న బకెట్లతో నీటిని తీసుకొచ్చి మొక్కలకు పెడతారు.. దీంతో పని చేసిన తృప్తి ఉంటుందని గ్రామ వృద్ధులు చెబుతున్నారు.

ఊరు పచ్చగా ఉండాలని
మా చిన్నప్పుడు ఊరంతా చెట్లు ఉండేవి. ఎక్కడ చూసినా.. నీడగా ఉండేది.. రాను రాను వివిధ అవసరాల రీత్యా ఇష్టం వచ్చినట్లు చెట్టు కొట్టేయడంతో మా బోటి వాళ్లకు కూచునేందుకు నీడ కూడా కరువైంది. ఊరు పచ్చగా ఉండాలనే ఆలోచనతో వృద్దుల కమిటీ లుగా ఏర్పడ్డాం. ఈ వయస్సులో ఖాళీగా ఉండలేక.. చెట్టును సాదుకుంటున్నాం.. పొద్దుగాల, పొద్దూకీ నీళ్లు పోస్తున్నాం..
– వెంకట రాజిరెడి(84)

చిన్నపిల్లల లెక్క సాదుకుంటున్నాం
మా ఊరు పచ్చగుండాలని సార్లు చెట్లు నాటిండ్రు.. వాటిని సాదుకుంటే చల్లగా ఉంటుంది.. కొడుకు, కోడలు అందరు పనికి పోతరు. ముసలోల్లం ఏం చేయాలి. ముచ్చట్లు పెట్టుకుంటూ.. చెట్లకు నీళ్లు పోస్తం. మొక్కలను చిన్నపిల్లల లెక్క సాదుకుంటున్నాం. అవి పెరుగుతుంటే సంబురం అవుతుంది.
– చిలుకల లచ్చవ్వ (68)

చెట్లకు నీళ్లుపోయడమే పని
మాకేం పని ఉంటది బిడ్డా.. ఇంత తినుడు.. అరుగుల మీద కూసునుడే.. పనిలేక పొద్దుపోక లేని రోగాలు వచ్చేవి. ఇప్పుడు పొద్దున, పొద్దూక చెట్లకు నీళ్లు పోసుడే పనిగా పెట్టుకున్నం.కసె అటీటు తిరుగుతుంటే.. పానం నిమ్మలంగా ఉంటున్నది. చెట్లు పెరుగుతున్నయి.
– మల్లారెడ్డి (82)

ఇంటి ముందు నీడ వస్తుంది
ఇంటి ముందు రోడ్ల దగ్గర చెట్లు లేకపోతే బోసిపొయినట్లు ఉండేవి. ఇప్పుడు నాటిన మొక్కలకు నాతోపాటు, మా బజారులో ఉండే ముసలోల్లం అందరం చెట్లకు నీళ్లు పోసిసాతుకుంటున్నాం. చెట్లు పెరిగి నీడను ఇస్తున్నయి. పూలు పూస్తున్నయి. వాటిని చూసినప్పుడు సంతోషంగా అన్పిస్తుంది.
– శ్రీరాం గంగరాం (70)

గ్రామ పచ్చదనానికి పెద్ద్దల సేవలు
ముసలోల్లు ఏం పనిచేయరు అంటారు. కానీ మనసుంటే మార్గం ఉంటుంది. వారికి చేతనైన పని చేయవచ్చు అనడానికి మా ఊరి పెద్దోల్లే నిదర్శనం. చేతనై.. చేతకాకున్నా.. దగ్గరలోఉన్న చెట్లకు చెంబులతో నీళ్లు పోస్తాండ్రు. గ్రామం పచ్చగా చేస్తాండ్రు. వారికి పొద్దుపోవడం లేదనే ప్రసక్తే లేదు..
– కుంబాల లక్ష్మి, గ్రామ సర్పంచ్‌

అన్ని రంగాల్లో ఆ గ్రామం ఆదర్శం
ఇబ్రహీంపూర్‌ గ్రామం ప్రభుత్వం చేపట్టిన ప్రతీ కార్యక్రమంలో ముందుంటూ ఆదర్శంగా నిలుస్తోంది. ప్రతి ఇంటికి 24 గంటలూ నీరు వచ్చే పంపు, ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి, ఇంకుడు గుంతలు, గ్రామంలో ప్రతి బడీడు పిల్లవాడు బడిలోనే. అదీ కూడా ప్రభుత్వ పాఠశాలలోనే. పన్నుల వసూళ్లు నూరుశాతం, ప్రతి ఇంటిలో సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్, అందరికీ గ్యాస్‌ కనెక్షన్లు, సంపూర్ణ అక్షరాస్యత ఇలా ప్రతి విషయంలో ఆ గ్రామం ఆదర్శమే. దీనిని గుర్తించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు... స్వశక్తి కిరణ్‌ అవార్డు, గౌరవ గ్రామసభ పురస్కారం, భూగర్భజలాల పెంపు అవార్డు, నిర్మల్‌ పురస్కార్, స్వచ్ఛ భారత్‌ పురస్కార్‌లతో గౌరవించాయి.
– ఈరగాని భిక్షం, సిద్దిపేట, సాక్షి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement