ibrahimpur
-
ఇబ్రహీంపూర్‌కు ప్రశంసలు
సిద్దిపేట రూరల్: సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు దత్తత గ్రామం ఇబ్రహీంపూర్ గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను పలువురు ప్రజాప్రతినిధులు ప్రశంసించారు. బుధవారం మండల పరిధిలోని ఇబ్రహీంపూర్‌ను హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందు తున్న నూతన సర్పంచ్‌లు, ట్రైనీ అధికారులు సందర్శించారు. ఇంకుడు గుంతలు, ఉపాధి హమీ పను ల్లో భాగంగా నిర్మించిన సామూహిక గొర్రెల షెడ్లు, శ్మశానవాటిక, డంపింగ్ యార్డు, బాలవికాస నీటి శుద్ధీకరణ పథకం, ఫాం పాండ్స్, గోదాం, పార్క్, పందిరి సాగు వంటి అభివృద్ధి పనులను పరిశీలించి అబ్బుర పడ్డారు. హరితహారం, స్వచ్ఛభారత్ కార్యక్రమాల్లో భాగంగా గ్రామస్తులు అవలంభిస్తున్న ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు గ్రామం అంతటా తిరుగుతూ అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడంతోపాటు, గ్రామస్తుల ఐక్యత ఎంతో బాగుందని, ఎక్కడా చెత్తాచెదారం లేకుండా శుభ్రంగా ఉంచడం చాలా గొప్పవిషయమని అన్నారు. ఇక్కడ అమలు చేస్తున్న ప్రణాళికలను తమ గ్రామాల్లో అవలంభిస్తామన్నారు. కార్యక్రమంలో సుమారు 35 మంది ప్రతినిధులు, అధికారుతోపాటు గ్రామ సర్పంచ్ దేవయ్య తదితరులు పాల్గొన్నారు. -
పచ్చటాకుల పెంపకంలో పండుటాకులు
ఎవర్గ్రీన్ వయసుడిగిపోయింది. ఊరు పొమ్మంటుంది.. కాడు రమ్మంటుంది.. అంటూ ఇంటి అరుగుల మీదనో, వసారాలోనో మునగదీసుకుని పడుకుని, పైవాడి పిలుపుకోసం ఎదురు చూస్తూ రోజులు వెళ్లదీయడం చాలామంది వృద్ధులు చేసేదే. అయితే.. సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామ వృద్ధులు ఇందుకు భిన్నం. ‘రేపటి తరం కోసం మేము సైతం’ అంటూ కమిటీగా ఏర్పడి.. హరిత హారంలో భాగంగా నాటిన చెట్లకు నీళ్లు పోస్తూ.. అవి ఏపుగా పెరుగుతుంటే చిన్నపిల్లల్లా సంబరాలు పడుతూ యువతరానికి కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. చెట్లను పెంచేందుకు... చెట్లను సంరక్షించేందుకు ఇబ్రహీంపూర్ గ్రామంలోని వృద్ధులు కమిటీలుగా ఏర్పడ్డారు. 367 కుటుంబాలు, 1228 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో 70 నుండి 85 సంవత్సరాల వయస్సున్నవారు దాదాపు వందమందిదాకా ఉన్నారు. వీరు ఇద్దరిద్దరు ఒక జట్టుగా ఏర్పడి, ఒక్కో జట్టు 20 నుండి 50 మొక్కలకు రోజూ ఉదయం, సాయంత్రం నీళ్లు పోస్తున్నారు. చుట్టూ కంచెవేసి, వాటిని రక్షించే పనిలో నిమగ్నమయ్యారు. గ్రామంలో మూడు విడతల హరిత హారంలో భాగంగా 3 లక్షల మొక్కలను నాటారు. వీటిల్లో గ్రామ అంతరంలో నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత వృద్ధులదే.. గ్రామంలో ఉన్న నీటి పంపులు, ఇండ్లలో ఉన్న బోర్ల వద్ద నుండి పైపులు వేసి, లేదా చిన్న చిన్న బకెట్లతో నీటిని తీసుకొచ్చి మొక్కలకు పెడతారు.. దీంతో పని చేసిన తృప్తి ఉంటుందని గ్రామ వృద్ధులు చెబుతున్నారు. ఊరు పచ్చగా ఉండాలని మా చిన్నప్పుడు ఊరంతా చెట్లు ఉండేవి. ఎక్కడ చూసినా.. నీడగా ఉండేది.. రాను రాను వివిధ అవసరాల రీత్యా ఇష్టం వచ్చినట్లు చెట్టు కొట్టేయడంతో మా బోటి వాళ్లకు కూచునేందుకు నీడ కూడా కరువైంది. ఊరు పచ్చగా ఉండాలనే ఆలోచనతో వృద్దుల కమిటీ లుగా ఏర్పడ్డాం. ఈ వయస్సులో ఖాళీగా ఉండలేక.. చెట్టును సాదుకుంటున్నాం.. పొద్దుగాల, పొద్దూకీ నీళ్లు పోస్తున్నాం.. – వెంకట రాజిరెడి(84) చిన్నపిల్లల లెక్క సాదుకుంటున్నాం మా ఊరు పచ్చగుండాలని సార్లు చెట్లు నాటిండ్రు.. వాటిని సాదుకుంటే చల్లగా ఉంటుంది.. కొడుకు, కోడలు అందరు పనికి పోతరు. ముసలోల్లం ఏం చేయాలి. ముచ్చట్లు పెట్టుకుంటూ.. చెట్లకు నీళ్లు పోస్తం. మొక్కలను చిన్నపిల్లల లెక్క సాదుకుంటున్నాం. అవి పెరుగుతుంటే సంబురం అవుతుంది. – చిలుకల లచ్చవ్వ (68) చెట్లకు నీళ్లుపోయడమే పని మాకేం పని ఉంటది బిడ్డా.. ఇంత తినుడు.. అరుగుల మీద కూసునుడే.. పనిలేక పొద్దుపోక లేని రోగాలు వచ్చేవి. ఇప్పుడు పొద్దున, పొద్దూక చెట్లకు నీళ్లు పోసుడే పనిగా పెట్టుకున్నం.కసె అటీటు తిరుగుతుంటే.. పానం నిమ్మలంగా ఉంటున్నది. చెట్లు పెరుగుతున్నయి. – మల్లారెడ్డి (82) ఇంటి ముందు నీడ వస్తుంది ఇంటి ముందు రోడ్ల దగ్గర చెట్లు లేకపోతే బోసిపొయినట్లు ఉండేవి. ఇప్పుడు నాటిన మొక్కలకు నాతోపాటు, మా బజారులో ఉండే ముసలోల్లం అందరం చెట్లకు నీళ్లు పోసిసాతుకుంటున్నాం. చెట్లు పెరిగి నీడను ఇస్తున్నయి. పూలు పూస్తున్నయి. వాటిని చూసినప్పుడు సంతోషంగా అన్పిస్తుంది. – శ్రీరాం గంగరాం (70) గ్రామ పచ్చదనానికి పెద్ద్దల సేవలు ముసలోల్లు ఏం పనిచేయరు అంటారు. కానీ మనసుంటే మార్గం ఉంటుంది. వారికి చేతనైన పని చేయవచ్చు అనడానికి మా ఊరి పెద్దోల్లే నిదర్శనం. చేతనై.. చేతకాకున్నా.. దగ్గరలోఉన్న చెట్లకు చెంబులతో నీళ్లు పోస్తాండ్రు. గ్రామం పచ్చగా చేస్తాండ్రు. వారికి పొద్దుపోవడం లేదనే ప్రసక్తే లేదు.. – కుంబాల లక్ష్మి, గ్రామ సర్పంచ్ అన్ని రంగాల్లో ఆ గ్రామం ఆదర్శం ఇబ్రహీంపూర్ గ్రామం ప్రభుత్వం చేపట్టిన ప్రతీ కార్యక్రమంలో ముందుంటూ ఆదర్శంగా నిలుస్తోంది. ప్రతి ఇంటికి 24 గంటలూ నీరు వచ్చే పంపు, ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి, ఇంకుడు గుంతలు, గ్రామంలో ప్రతి బడీడు పిల్లవాడు బడిలోనే. అదీ కూడా ప్రభుత్వ పాఠశాలలోనే. పన్నుల వసూళ్లు నూరుశాతం, ప్రతి ఇంటిలో సోలార్ విద్యుత్ ప్లాంట్, అందరికీ గ్యాస్ కనెక్షన్లు, సంపూర్ణ అక్షరాస్యత ఇలా ప్రతి విషయంలో ఆ గ్రామం ఆదర్శమే. దీనిని గుర్తించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు... స్వశక్తి కిరణ్ అవార్డు, గౌరవ గ్రామసభ పురస్కారం, భూగర్భజలాల పెంపు అవార్డు, నిర్మల్ పురస్కార్, స్వచ్ఛ భారత్ పురస్కార్‌లతో గౌరవించాయి. – ఈరగాని భిక్షం, సిద్దిపేట, సాక్షి -
మాకూ ‘క్యాష్’ కావాలి
‘నగదు రహిత గ్రామం’ ఇబ్రహీంపూర్వాసుల మాట ఇదీ! - కార్డులు, స్వైపింగ్ మిషన్ల వాడకం అంతంతే - నగదుకే జై కొడుతున్న జనం - రేషన్ షాపు నుంచి బియ్యం కొనుగోలుకు మాత్రమే డెబిట్ కార్డులు - మిగతా అన్ని అవసరాలకూ నగదు వాడకమే - మిషన్ల వాడకం తెలియదంటున్న మెజారిటీ గ్రామస్తులు... ఇంగ్లిష్‌లో వచ్చే ఎస్ఎంఎస్ అర్థం కాదంటూ నిస్సహాయత - స్వైపింగ్ మిషన్లను వెనక్కి ఇచ్చేసినవారు కొందరు.. వద్దన్నవారు ఇంకొందరు - అన్నేసి డబ్బులతో స్మార్ట్ఫోన్లు కొనలేమంటున్న మరికొందరు ఇబ్రహీంపూర్ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి మహమ్మద్ ఫసియుద్దీన్ ఇబ్రహీంపూర్.. సిద్దిపేట జిల్లాలో ఓ చిన్న గ్రామం.. 300 కుటుంబాలు, 1,200 జనాభా.. ప్రతి ఇంటా మరుగుదొడ్డి.. ఇంటింటికీ ఇంకుడు గుంత.. లక్ష మొక్కల పెంపకం.. ఇలా ఎన్నింట్లోనో ఆదర్శంగా నిలిచింది. అదే ఊపులో రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామాన్ని దేశంలోనే రెండో, రాష్ట్రంలో తొలి నగదు రహిత గ్రామంగా ప్రకటించింది! కానీ గ్రామంలో వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. గ్రామంలోని అత్యధిక మంది నగదు లావాదేవీలే నిర్వహిస్తున్నారు. అష్టకష్టాలు పడి బ్యాంకులు, ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకొచ్చి అవసరాలు తీర్చుకుంటున్నారు. ఈ గ్రామస్తులకు వ్యవసాయం, బీడీలు చుట్టడమే ప్రధాన ఉపాధి వనరులు. వీటితో వచ్చే డబ్బులు బ్యాంకులో జమ చేసి పెట్టుకున్నారు. స్వైపింగ్ యంత్రాలు, డెబిట్ కార్డులు ఇచ్చినా నగదు లావాదేవీలపైనే జనం మొగ్గు చూపుతున్నారు. గ్రామ జనాభాలో పెద్ద సంఖ్యలో ఉన్న వృద్ధులు, మధ్య వయసు ప్రజలకు చదువు రాదు. దీంతో వారంతా నగదు రహిత లావాదేవీల పట్ల ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. నగదుతోనే అన్నీ! రేషన్ షాపు నుంచి బియ్యం కొనుగోళ్లకు డెబిట్ కార్డులను అనివార్యం చేయడంతో ఈ ఒక్క అవసరానికి మాత్రమే గ్రామ ప్రజలు పూర్తిస్థాయిలో నగదు రహిత లావాదేవీలు జరుపుతున్నారు. మిగతా అవసరాల్లో అధిక శాతం నగదుతోనే తీర్చుకుంటున్నారు. నగదు కోసం పొరుగునే ఉన్న నారాయణరావుపేట, సిద్దిపేటకు వెళ్లి ఏటీఎంలు, బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసుకొని వస్తున్నారు. గ్రామంలో రోజూ వంద లీటర్ల పాలు సేకరించే పాల కేంద్రం నిర్వహకుడు సైతం పాలు అమ్మేవారికి రోజువారీగా నగదు రూపంలోనే డబ్బులు చెల్లిస్తున్నాడు. బస్సు, ఆటోల ద్వారా గ్రామం నుంచి రాకపోకల కోసం ప్రజలు నగదునే వినియోగిస్తున్నారు. స్వైపింగ్ యంత్రాల వాడకం అంతంతే స్వైపింగ్ యంత్రాన్ని వినియోగించడం తెలియదంటూ గ్రామంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న ఓ వృద్ధుడు దాన్ని తీసుకోడానికి నిరాకరించాడు. స్వైపింగ్ యంత్రం ద్వారా లావాదేవీలు జరిపితే మొబైల్ ఫోన్‌కు ఇంగ్లిష్‌లో వచ్చే ఎస్ఎంఎస్ అర్థం కాక మరో కిరాణా దుకాణం యజమాని రెండు రోజులకే ఆ యంత్రాన్ని బ్యాంకు అధికారులకు తిరిగి ఇచ్చేశాడు. ఒకట్రెండు కిరాణా షాపుల్లో కొద్ది మొత్తంలో నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నా గ్రామంలో సెల్‌ఫోన్ సిగ్నల్స్ సరిగ్గా లేక తరచూ స్వైపింగ్ యంత్రాలు మొరాయిస్తున్నాయి. డెబిట్ కార్డులు, స్వైపింగ్ యంత్రం వినియోగం పట్ల తమకు అవగాహన లేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. గ్రామంలోని దుకాణాలకు సరఫరా చేసిన తక్కువ ఖరీదు గల పీవోఎస్ యంత్రాలతో కాగితపు రశీదులు జారీ చేసే సదుపాయం లేదు. దీంతో డెబిట్ కార్డులను వినియోగిస్తే డబ్బులు ఎవరికి వస్తున్నాయో.. ఎవరికి పోతున్నాయో అర్థం కావడం తెలియడం లేదని గ్రామంలో చాలా మంది అంటున్నారు. నగదు రహిత లావాదేవీ జరిగినప్పుడు దుకాణదారుల స్మార్ట్‌ఫోన్‌కు బ్యాంకు నుంచి ఇంగ్లిష్‌లో వస్తున్న ఎస్ఎంఎస్ అర్థం కావడం లేదని చాలామంది పేర్కొంటున్నారు. ప్రభుత్వం పాత్ర ఓకే.. గందరగోళంలో ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 5న ఆంధ్రాబ్యాంకు అధికారులు గ్రామంలో మేళా నిర్వహించి 18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతాలు, రూపే డెబిట్ కార్డులు జారీ చేశారు. మొత్తం 1,117 మందికి బ్యాంకు ఖాతాలు, డెబిట్ కార్డులు అందించారు. గ్రామంలో రేషన్ షాపులతో సహా మొత్తం 12 దుకాణాలకు పాయింట్ ఆఫ్ సేల్(పీఓఎస్) యంత్రాలను సరఫరా చేశారు. చిన్న సైజులో ఉండే ఈ యంత్రాలు స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటేనే పనిచేస్తాయి. స్వైపింగ్ యంత్రం, డెబిట్ కార్డుల వినియోగం, ఆంధ్రాబ్యాంక్ చిల్లర్ యాప్, ఆంధ్రాబ్యాంక్ క్విక్ రెస్పాన్స్(క్యూఆర్) కోడ్ తదితర నగదు రహిత సదుపాయల వినియోగంపై అవగాహన కల్పించేందుకు బ్యాంకు అధికారులు గ్రామంలో సదస్సు నిర్వహించారు. గ్రామంలో చదువుకున్నవారు 543 మంది ఉన్నారు. నగదు రహిత లావాదేవీల పట్ల ప్రజల్లో పూర్తి అవగాహన కలగక ముందే రాష్ట్ర ప్రభుత్వం ఇబ్రహీంపూర్ గ్రామాన్ని దేశంలో రెండో, రాష్ట్రంలో తొలి నగదు రహిత గ్రామంగా ప్రకటించింది. ఇకపై ఒక రూపాయి లావాదేవీలకు కూడా డెబిట్ కార్డును వినియోగించాల్సిందేనని గ్రామ ప్రజలకు అధికారులు సూచించారు. దీంతో ప్రభుత్వ పాత్ర ఓ వరకు పూర్తయినా ప్రజలు మాత్రం ఇంకా గందరగోళంలోనే ఉన్నారు. ఆదర్శ గ్రామమే.. అయినా.. ప్రతి ఇంటా మరుగుదొడ్డి...ఇంటింటికి ఇంకుడు గుంత.. ఊరి ప్రజలంతా కలిసి యజ్ఞంగా నాటిన లక్ష మొక్కలు..ఎనీ టైం ప్యూరిఫైడ్ వాటర్..ఆదర్శ పాఠశాల..ఇలాంటి ఇంకెన్నో చెప్పుకోదగ్గ విశేషాలతో ఇబ్రహీంపూర్ మిగతా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. సిద్దిపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి టి.హరీశ్ రావు స్వయంగా ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని ప్రత్యేక చొరవతో ఈ కార్యక్రమాలు అమలు చేశారు. గ్రామానికి ప్రత్యేక గుర్తింపు, పేరు తెచ్చి పెట్టారు. అయితే అకస్మాత్తుగా గ్రామంలో నగదు రహిత లావాదేవీలు అనివార్యం చేయడంతో ప్రజలంతా నిస్సహాయులుగా మారారు. ఇబ్రహీంపూర్ గ్రామం నాకు గీకొస్తదా సారూ: ఇబ్రహీంపూర్‌వాసి బాలవ్వ గోడు.. కార్డు (డెబిట్ కార్డు) ఇంట్ల పెట్టిన. సంచిల దాచి కొయ్యకేసిన. మరి నాకు గీకొస్తదా సారూ! ఎట్ల గీకాల్నో తెల్వది. మేము గట్క సల్ల తాగినోళ్లం. పచ్చకూర తిన్నోళ్లం. గిప్పుడు గివన్నీ చూస్తున్నం. కండ్లు కనబడ్తలెవ్వు. చెవులు ఇనబడ్తలెవ్వు. ఇప్పుడు ఈ కార్డు గీకమంటే ఎట్ల గీకుత? నా బిడ్డ పిల్లలు, కొడుకు పిల్లలు పైసలకేడిస్తె వాళ్లకు పైసలు ఎట్ట తీసియ్యాలె? మోకాళ్ల మందులకే నెలకు వెయ్యి (రూపాయలు) అయితున్నయి. పించనిస్తుండ్రు కానీ తీసుకునే కాడ అంతా గడబిడ. ఒకళ్ల మీద ఒకళ్లు ముసలోళ్లను కింద పడేసి తొక్కుతున్నరు. ఈడ నుంచి ఆడిదాక ఒకలెనుక ఒకలు దార బట్టాలె. మిషన్ వెనక్కి ఇచ్చేశాం: యాసల పద్మ రెండ్రోజుల కింద ఆంధ్రాబ్యాంకు వాళ్లు కార్డు గీకే మిషన్ ఇచ్చారు. రూపాయి వస్తువు కూడా కార్డుతోనే కొనాలి..అమ్మాలన్నారు. మిషన్ ఖర్చు నెలకు రూ.300 అవుతుందన్నారు. మిషన్ ఎలా వాడాలో నాకు తెలిస్తే కదా? రెండు రోజులు నేర్పారు.. అర్థం కాలేదు..మిషన్‌లో (డబ్బు) కొట్టితే సెల్‌ఫోన్‌కు ఇంగ్లిష్‌లో మెసేజ్ వస్తుంది. మూడో తరగతి చదువుకున్న నాకు ఇంగ్లిష్ అర్థం కాదు. సిగ్నల్ లేక నెట్ కూడా సరిగ్గా రాదు. దీంతో మిషన్‌ను వాపసు ఇచ్చేశాం మాలాంటోళ్లకు కష్టం: కుంబాల సుగుణమ్మ: మా అసోంటోళ్లకు (క్యాష్‌లెస్ లావాదేవీలు) కష్టం. చదువు వస్తే చేయడం వస్తుంది. మేం చదువుకోలేదు..ఇవన్ని కొత్తవి (డెబిట్ కార్డులు, స్వైపింగ్ యంత్రాలు) ఇచ్చి బతుకుమంటే ఎట్లా? వాడితే డబ్బులు వస్తున్నాయో? పోతున్నాయో తెలియడం లేదు. నాకు ఇచ్చిన రూపాయి (రూపే డెబిట్) కార్డును ఒక్కసారే రేషన్ షాపులో ఉపయోగించా సిద్దిపేటలో డీలర్ల వద్దే స్వైపింగ్ మిషన్ లేవు: కమటం రామస్వామి(35), కిరాణం దుకాణం యజమాని: ‘‘ఊళ్లో పెద్ద దుకాణం నాదే. డిగ్రీ వరకు చదివాను. స్వైపింగ్ మెషిన్‌తో రోజుకు రెండు వేల రూపాలయ గిరాకీ చేస్తున్న. కిరాణం, జనరల్ ఐటంలు, కూల్ డ్రింక్స్‌లను కార్డుతో కొంటున్నారు. సిద్దిపేటలో హోల్‌సేల్ డీలర్ల వద్దే స్వైపింగ్ మెషిన్లు లేవు. దీంతో అక్కడి నుంచి సరుకులు తీసుకురావడం ఇబ్బందిగా మారింది’’ మూడు గంటలు నిలబడి రెండు వేలు తెచ్చుకున్నం: బండి సుగుణమ్మ(55), బీడీ కార్మికురాలు: ‘‘మొత్తం కార్డు సిస్టం అన్నరు. చిల్లర లేక ఇబ్బంది అవుతుంది. ఎక్కువ సామాన్లు కొనడానికి కార్డు వాడొచ్చు. చిల్లర సామాన్లకు ఎలా? డబ్బు లేకపోతే నా భర్తతో కలిసి పక్క గ్రామం వెళ్లి మూడు గంటలు లైన్ల నిలబడి ఏటీఎం నుంచి చెరో రెండు వేల రూపాయలు తెచ్చుకున్నం’’ పెద్ద ఫోన్ కొనలేం: గందె భద్రవ్వ, పాల కేంద్రం నిర్వహకురాలు: కార్డు గీకే మిషన్ కోసం పెద్దఫోన్(స్మార్ట్ ఫోన్) కావాలన్నరు. దానికి దీనికి లింక్ ఉంటుందన్నరు. ఫోన్ కోసం రూ.15 వేలు పెట్టలేం..మిషన్ వద్దన్నం. మా దగ్గర పాలు పోసేవాళ్లకు ఏ రోజుకారోజు నగదు ఇస్తున్నం. -
తెలంగాణ తొలి క్యాష్ లెస్ గ్రామం ఇదే..
హైదరాబాద్: సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని ఇబ్రహీంపూర్ దక్షిణ భారతదేశంలో తొలి క్యాష్ లెస్ గ్రామంగా అవతరించినట్లు తెలంగాణ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఈ గ్రామాన్ని నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్ రావు దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఇబ్రహీంపూర్ లో నివసించే 1200 మందికి బ్యాంకు అకౌంట్లతో పాటు డెబిట్ కార్డులు, స్వైపింగ్ మిషన్లు జారీ అయినట్లు ప్రభుత్వం పేర్కొంది. సిద్ధిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. గ్రామంలో క్యాష్ లెస్ లావాదేవీలను పరిశీలించినట్లు చెప్పారు. మిగిలిన గ్రామాలకు ఇబ్రహీంపూర్ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. -
ఇబ్రహీంపూర్ సమష్టి కృషికి నిదర్శనం
హరితహారంలో ఇబ్రహీంపూర్ సమష్టి కృషికి నిదర్శనం సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు చొరవ అభినందనీయం కాంపా నిధులు సక్రమంగా వినియోగం జిల్లాలో అటవీ శాఖ చీఫ్ పీకేజూ పర్యటన సిద్దిపేట జోన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం లక్ష్యాన్ని సాధిస్తోందని, సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్ గ్రామస్తులు సమిష్టి కృషితో లక్షల మొక్కలు నాటడం అభినందనీయమని రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య సంరక్షణ అధికారి (ప్రిన్సిపల్ సీసీఎఫ్ ) పీకేజూ ప్రశంసించారు. బుధవారం ఆయన సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్‌ను సందర్శించి స్థానిక ఎఫ్ఆర్వో కార్యాలయంలో సాక్షి ప్రతినిధితో మాట్లాడారు. ఇటీవల మంత్రి హరీశ్‌రావు చొరవతో ఇబ్రహీంపూర్లో ఒకే రోజు లక్ష మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్ధేశించిందన్నారు. 3 సంవత్సరాల్లో సాధించాల్సిన 1.20 లక్షల మొక్కల లక్ష్యాన్ని ఇబ్రహీంపూర్ ఈ సంవత్సరమే 2.10 లక్షల మొక్కలతో అధిగమించిందన్నారు. గ్రామంలోని యువకులు స్పూర్తితో గ్రామాన్ని హరితవనంగా మార్చడం అభినందనీయమన్నారు. మొక్కలు నాటడమే కాదని వాటని సంరక్షించడం గొప్ప విషయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటవీ శాఖకు 17 కోట్ల మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్ధేశించిందన్నారు. జిల్లాలో 1.36 కోట్ల మొక్కల్ని అటవీశాఖ ఆధ్వర్యంలో నాటేలా లక్ష్యాన్ని నిర్ధేశించామన్నారు. ఇప్పటికే 2 వేల ఎకరాల్లో ప్లాంటేషన్ కొనసాగిందన్నారు. అదే విధంగా జిల్లాలోని అడవుల సరిహద్దు వెంట 488 కిలోమీటర్ల పొడవునా కందకాలను పూర్తి చేయడం జరిగిందని, మరో 90 కిలో మీటర్లు పూర్తి చేస్తామన్నరు. గజ్వేల్‌లో నిర్ధేశించిన లక్ష్యాన్ని అధిగమించడం జరిగిందన్నారు. ప్రాజెక్ట్‌ల, రహదారుల నిర్మాణానికి అటవీ భూమిని వినియోగించుకున్నందుకు . ప్రతి రూపంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కాంపా నిధులను రాష్ట్రంలో సక్రమంగా వినియోగించేలా చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో ఫారెస్ట్ చీఫ్ పర్యటన రాష్ట్ర ఆటవీ శాఖ ఛీప్ పీకేజూ బుధవారం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్ హరితహారం కింద నాటిన మొక్కలను, గ్రామస్తులు సమిష్టిగా తీసిన కందకాలను, ఇంకుడు గుంతలను పరిశీలించారు. అదే విధంగా మర్పడగ నర్సరీ, గజ్వేల్, మీనాజీపేట, కోమటిబండ, బంగ్లా వెంకటాపూర్, నర్సంపల్లిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్లానిటేషన్లను ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అయన వెంట అడిషనల్ పీసీసీఎఫ్ రాకేష్ మోమన్ డోగ్రీయా, జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీధర్‌రావు, సిద్దిపేట ఎఫ్ఆర్వో వెంకటరామరావు, శ్యాంసుందర్‌రెడ్డి, కుతుబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంబ్రహీంపూర్ భేష్
గ్రామాన్ని సందర్శించిన అటవీ శాఖ ఉన్నతాధికారి మొక్కలు, ఇంకుడు గుంతల పరిశీలన సిద్దిపేట రూరల్:అటవీ సంరక్షణ రాష్ట్ర ముఖ్య అధికారి పి.కేజా బుధవారం ఇబ్రహీంపూర్ గ్రామాన్ని సందర్శించారు. హరితహారంలో భాగంగా ఇటీవల గ్రామంలో నాటిన 2లక్షల మొక్కలను పరిశీలించారు. వాటిని సంరక్షిస్తున్న తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఇంకుడు గుంతలను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా పి.కేజా మాట్లాడుతూ.. గ్రామంలో మొక్కలు నాటిన తీరు, ఇంకుడు గుంతల తీరును ప్రశంసించారు. ఆయన వెంట విజిలెన్స్ అదనపు ముఖ్య సంరక్షణ అధికారి డోబ్రియల్, డీఎఫ్ఓలు శ్రీధర్‌రావు, రాములు, అటవీక్షేత్రాధికారులు వెంకట్ రామారావు, శ్యామ్‌సుందర్‌రావు, ఉప అటవీ క్షేత్రాధికారి కుత్బుద్దీన్, గ్రామ నాయకులు ఎల్లారెడ్డి, నగేష్‌రెడ్డి, రాజు, బాలకృష్ణ, చంద్రం తదితరులు పాల్గొన్నారు. -
ఆద్యంతం ఆసక్తిగా..
సిద్దిపేట రూరల్ : ఇబ్రహీంపూర్లో శుక్రవారం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పర్యటించారు. ఉదయం 10.30 గంటలకు హెలికాప్టర్ ద్వారా గ్రామానికి చేరుకున్నారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, డీప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యే రామలింగారెడ్డి, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, ఫారూక్ హుస్సేన్‌లతో పాటు గ్రామ సర్పంచ్ కుంబాల లక్ష్మి రాఘవరెడ్డి, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు ఏర్పాటు చేసిన ప్రత్యేక కాన్వాయ్‌లో ఎర్ర చెరువు పోలేరమ్మ దేవాలయంలో సమీపంలో గవర్నర్ మొదట టేకు మొక్కను నాటారు. అదే సమీపంలో జమ్మీచెట్టును నాటారు. పక్కనే వ్యవసాయ భూమిలో పందిరి సాగు చేస్తున్న మహిపాల్‌తో ముచ్చటించారు. సాగు ఎలా నడుస్తుంది..? పంటకు ఎంత ఖర్చు వస్తుంది? దిగుబడి ఎలా ఉంది? మార్కెట్ సదుపాయం బాగానే ఉందా... అంటూ రైతును వివరాలను అడిగి తెలుసుకున్నారు. మహిపాల్ కుటుంబ సభ్యులంతా వ్యవసాయమే జీవనాధారంగా చేసుకుని పంటలు సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్న రైతును గవర్నర్ అభినందించారు. ఇదే తరహాలో రైతులందరూ సాగు చేస్తే వ్యవసాయం పండుగలా మార్చుకోవచ్చని అన్నారు. అనంతరం గ్రామంలోని ఎస్సీ కాలనీలో పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ మహిళలను అప్యాయంగా పలకరించారు. ఇంకుడు గుంతల విధానంపై అడిగి తెలుసుకున్నారు. అలాగే మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించారు. ప్రతి ఇంటి ముందు నాటిన చెట్లను చూసి, వాటి సంరక్షణకు తీసుకుంటున్న చర్యల గురించి ఆరా తీశారు. ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటిన తీరును సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల భవనాన్ని పరిశీలించారు. ఆవరణలో మామిడి చెట్టును నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఇబ్రహీంపూర్ గ్రామానికి రావడం సంతోషంగా ఉందన్నారు. గ్రామంలో చేపడుతున్న అభివృద్ది బాగుందని ప్రశంసించారు. గ్రామస్తులతో గడిపిన కొద్ది గంటలు మర్చిపోలేనిదన్నారు. గ్రామంలో అమలవుతున్న పథకాలపై జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్, అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి హరీశ్‌రావులను అభినందించారు. ఇబ్రహీంపూర్ స్ఫూర్తితో అన్ని గ్రామాలు ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి సాధించాలన్నారు. ఇబ్రహీంపూర్ గ్రామ అభివృద్ధిపై తీసిన డాక్యూమెంటరీని గవర్నర్‌కు స్క్రీన్‌పై చూపించారు. ఇటీవల గ్రామంలో లక్షా 5వేల మొక్కలు నాటిన విషయం తెలిసిందే. కాగా, శుక్రవారం మరో లక్షా 5వేల మొక్కలు నాటారు. గవర్నర్ నరసింహన్‌ను సర్పంచ్ లక్ష్మి సన్మానించారు. అనంతరం ప్రసంగం ముగించుకుని సిద్దిపేట పట్టణానికి కాన్వాయ్‌లో చేరుకున్నారు. కార్యక్రమంలో సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, జిల్లా అధికారులు, ఆర్డీఓ ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'అందుకోసం చట్టం తీసుకురావాలి'
సిద్దపేట: ప్రతి ప్రజాప్రతినిధి ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని, అభివృద్ధి చేసేలా చట్టం తీసుకు రావాలని గవర్నర్ నరసింహన్ కోరారు. మెదక్ జిల్లా సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్లో హరితహారంలో భాగంగా లక్షా ఐదు వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని గవర్నర్ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన జమ్మిమొక్కను నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దోమల బెడద లేకుండా చేయటంలో గ్రామస్తుల కృషి అభినందనీయమన్నారు. ఇక్కడికి వచ్చి చాలా నేర్చుకున్నానని తెలిపారు. గ్రామంలో జరిగిన అభివృద్ధిని చూస్తే ముచ్చటేస్తోందన్నారు. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఇంతటి మార్పు సాధ్యమని చెప్పారు. గ్రామంలో ప్రతి ఇంటికీ సోలార్ ఎనర్జీని అందుబాటులోకి తేవాలన్నారు. హైదరాబాద్ లో ఉన్న సౌకర్యాలన్నీ ఇబ్రహీంపూర్‌లోనూ అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రానికి ఇబ్రహీంపూర్ ఆదర్శంగా నిలవాలని కోరారు. బంగారు తెలంగాణ సాధన బాటలో ఈ గ్రామం పయనిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి హరీశ్‌రావును, కలెక్టర్ రొనాల్డ్‌రాస్‌ను అభినందించారు. -
ఇబ్రహీంపూర్ ఘటనలో నిందితుల అరెస్టు
సంచలనం కలిగించిన మెదక్ జిల్లా ఇబ్రహీంపూర్ ఘటనపై రెండు జిల్లాల పోలీసులు చర్యలు ప్రారంభించారు. శ్రీహరి అనే మృతితో సంబంధం ఉందంటూ శుక్రవారం గ్రామంలో సర్పంచి ఇంటిపై దాడి జరిగిన విషయం విదితమే. మృతుని కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపూర్ సర్పంచి కుంబాల లక్ష్మి కుటుంబసభ్యులు ఆరుగురిపై కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. సర్పంచి సంబంధీకులు కొట్టడంతోనే శ్రీహరి చనిపోయాడంటూ అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సర్పంచి కుమారులు ఎల్లారెడ్డి, నాగిరెడ్డితోపాటు కుటుంబసభ్యులు ర జినీకాంత్రెడ్డి, మహేందర్‌రెడ్డి, మల్లికార్జున్రెడ్డిలపై హత్యకేసు నమోదుచేశారు. మరోవైపు సర్పంచి ఇంటిపై దాడి, ధ్వంసంతోపాటు మీడియా, పోలీసులపై దాడికి పాల్పడి న ఘటనల్లో పాల్గొన్న మృతుడు శ్రీహరి బంధువులు జిల్లెల్ల, తెర్లుమద్ది గ్రామాలకు చెందిన 30 మందిపై హత్యాయత్నంతోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు మెదక్ ఎస్పీ సుమతి తెలిపారు. అరెస్టయిన వారిలో తెర్లుమద్ది సర్పంచి కృష్ణ కూడా ఉన్నారు. ఇప్పటికే అరెస్టు చేసిన పది మందిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. -
‘మ్యాజిక్ ఫిట్’.. మురుగు ఫట్
సిద్దిపేట రూరల్: పదేళ్ల నుంచి ఆ గ్రామంలో చూడ్డానికి ఒక్క దోమా కనిపించదు.. అలాగే నీటి కరువు అసలే లేదు.. నమ్మశక్యంగా లేదు కదూ.. అయితే మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా తుంబుర్నీ గ్రామానికి వెళ్లాల్సిందే. మురుగు, ఇతర వృథా నీరు రోడ్లపై పారకూడదనే ఆలోచనతో ప్రతి నీటి చుక్క భూమిలోకి ఇంకిపోయేలా (మ్యాజిక్ ఫిట్) చర్యలు తీసుకున్నారు. దీంతో అటు భూగర్భ జలాలు పెరగడంతో పాటు ఇటు పారిశుద్ధ్య సమస్యా తీరింది. ఇప్పుడు ఆ గ్రామం దేశానికే ఆదర్శమైంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో తుంబుర్నీ గ్రామ ప్రత్యేకతను ఆ జిల్లా సీఈఓ వివరించారు. ఈ సమావేశానికి హాజరైన తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ఇది ఆలోచింప జేసింది. ఇటీవల మెదక్ జిల్లా నుంచి పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు తుంబుర్నీ సందర్శించారు. అక్కడ మురుగు, వృథా నీరు రోడ్లపైకి రాకుండా చేపట్టిన విధానాన్ని తెలుసుకున్నారు. దీంతో రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు సూచన మేరకు సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్ గ్రామాన్ని పెలైట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశారు. మోడల్‌గా ఇబ్రహీంపూర్ ఇబ్రహీంపూర్లో 240 కుటుంబాలు ఉన్నాయి. మొదట గ్రామంలో ఉన్న మినీ ట్యాంక్‌ల వద్ద ప్రయోగాత్మకంగా ‘మ్యాజిక్ ఫిట్’ను ఏర్పాటు చేస్తున్నారు. దీని ఏర్పాటుకు సుమారు రూ. 4,500 ఖర్చవుతుంది. దీనిని ఉపాధికి, ఆర్డబ్ల్యూఎస్ శాఖకు అనుసంధానం చేసి నిర్మాణాలు చేపడితే మంచి ఫలితాలు సాధించవచ్చు. దీనిపై జిల్లా అధికారులకు ప్రతిపాదనలు సైతం పంపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈ విధానాన్ని చేపడితే భూగర్భ జలాలు పెరగడంతో పాటు పారిశుద్ధ్య సమస్య తొలగిపోతుందని తుంబుర్నీని సందర్శించిన అధికారులు అంటున్నారు. లాభాలు అధికం... ఇబ్రహీంపూర్లో డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి రూ. 3 కోట్లు ఖర్చవుతాయని అంచనా. కానీ గ్రామంలోని 240 కుటుంబాలకు తుంబుర్నీ విధానం ద్వారా మ్యాజిక్ఫిట్ల నిర్మాణాలు చేపడితే రూ. 12 లక్షలు మాత్రమే ఖర్చవుతాయి. ఈ విధానంలో గ్రామంలో రోడ్డుకిరువైపుల మురికి కాల్వలు అవసరం లేదు. మురికి కాల్వలు, బురదగుంతలు ఉండక ఈగలు, దోమలు పూర్తిగా ఉండకపోవడంతో అంటు వ్యాధులూ ప్రబలే అవకాశం ఉండదు. మ్యాజిక్ ఫిట్ ఇలా.. పంచాయతీలోని ప్రతి చేతి పంపు, ఇంటి ఆవరణలో మీటర్ వెడల్పు, మీటర్ లోతున గుంత తీశారు. ఇందులో అరమీటర్ వ్యాసార్థంతో ఉండే సిమెంట్ గోలాన్ని అడుగు భాగం లేకుండా బిగించారు. గోలం చుట్టు 60 ఎంఎం, 40 ఎంఎం మందం కంకర పోశారు. గోలం ఎగువన ఆరు అంగుళాల దూరంలో నాలుగు దిక్కుల రంధ్రాలు చేశారు. కంకర పై భాగంలో ప్లాస్టిక్ కవర్ వేసి దానిపై మట్టితో కప్పారు. ఇలా రూపొందించిన గుంతలకు చేతి పంపులు, ఇండ్ల నుంచి వృథాగా వెళ్లే నీరు అందులోకి చేరేలా పైపులను అమర్చారు. గోలెంలో పడిన నీరు భూమిలోకి గోలం నిండితే పై భాగంలోని రంధ్రాల నుంచి కంకరలోకి చేరుతుంది. ఈ విధానాన్ని తుంబుర్నీలో ‘మ్యాజిక్ ఫిట్’ అని పిలుస్తారు. చాలెంజ్‌గా తీసుకున్నాం... మహారాష్ట్రలోని తుంబుర్నీ గ్రామంలో ఉన్న విధానాన్ని ఇక్కడ అమలు చేయాలని చాలెంజ్‌గా తీసుకున్నాం. ఇటీవల ఆ విధానాన్ని ఇబ్రహీంపూర్‌లోని మినీ వాటర్‌ట్యాంక్‌ల వద్ద చేపట్టాం. ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ప్రజలు ఆసక్తి చూపడం లేదు. ఒక్కో ఫిట్ ఏర్పాటుకి రూ. 4,500 ఖర్చవుతుంది. దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. స్పందించి ఉపాధి హామీ, ఆర్డబ్ల్యూఎస్ శాఖకు అనుసంధానం చేయాలి. దీంతో మురికి, వృథా నీటి సమస్య, పారిశుద్ధ్య సమస్య తొలగిపోతుంది. - సమ్మిరెడ్డి, ఎంపీడీఓ ప్రభుత్వం స్పందించాలి... ప్రభుత్వం డ్రైనేజీ వ్యవస్థకు స్వస్తి చెప్పి ఇంకుడు గుంతల విధానాన్ని చేపడితే గ్రామాల్లో మంచి లాభాలు ఉంటాయి. కానీ ఇంకుడు గుంతల నిర్మాణానికి అయ్యే ఖర్చు ప్రజలకు భారంగా మారనుంది. దీనిపై ప్రభుత్వం స్పందించి ఉపాధి హామీకి అనుసంధానం చేస్తే ఈ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రజలందరు సిద్ధంగా ఉన్నారు. గ్రామాన్ని మంత్రి హరీశ్‌రావు కృషితో అభివృద్ధి చేస్తున్నాం. - కుంబాల లక్ష్మి రాఘవారెడ్డి, సర్పంచ్, ఇబ్రహీంపూర్.