సిద్దపేట: ప్రతి ప్రజాప్రతినిధి ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని, అభివృద్ధి చేసేలా చట్టం తీసుకు రావాలని గవర్నర్ నరసింహన్ కోరారు. మెదక్ జిల్లా సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్‌లో హరితహారంలో భాగంగా లక్షా ఐదు వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని గవర్నర్ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన జమ్మిమొక్కను నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దోమల బెడద లేకుండా చేయటంలో గ్రామస్తుల కృషి అభినందనీయమన్నారు. ఇక్కడికి వచ్చి చాలా నేర్చుకున్నానని తెలిపారు. గ్రామంలో జరిగిన అభివృద్ధిని చూస్తే ముచ్చటేస్తోందన్నారు.
ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఇంతటి మార్పు సాధ్యమని చెప్పారు. గ్రామంలో ప్రతి ఇంటికీ సోలార్ ఎనర్జీని అందుబాటులోకి తేవాలన్నారు. హైదరాబాద్ లో ఉన్న సౌకర్యాలన్నీ ఇబ్రహీంపూర్‌లోనూ అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రానికి ఇబ్రహీంపూర్ ఆదర్శంగా నిలవాలని కోరారు. బంగారు తెలంగాణ సాధన బాటలో ఈ గ్రామం పయనిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి హరీశ్‌రావును, కలెక్టర్ రొనాల్డ్‌రాస్‌ను అభినందించారు.