నగరానికి నేడు ‘పచ్చకోక’
- జీహెచ్‌ఎంసీలో ఒక్క రోజే సుమారు 28.8 లక్షల మొక్కలు నాటేందుకు సర్వంసిద్ధం
- రెండున్నర గంటల్లోనే కార్యక్రమం పూర్తి చేసేలా ప్రణాళిక
- 4,173 ప్రాంతాల్లో ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం
- ఉదయం 11 గంటలకు బీహెచ్‌ఈఎల్‌లో మొక్కలు నాటనున్న గవర్నర్
- ఉదయం 11.30 గంటలకు నిమ్స్‌లో మొక్కలు నాటనున్న సీఎం కేసీఆర్
- లక్ష్యాన్ని మించి మొక్కలు నాటుతామంటున్న అధికార వర్గాలు
- గిన్నిస్ రికార్డు సాధిస్తామంటున్న జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో హరితహారానికి సర్వసన్నద్ధమైంది. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సహా మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, సినీ, క్రీడా, న్యాయ రంగాల ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు, ఉద్యోగులు, విద్యార్థులు, వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఇలా అన్ని వర్గాల ప్రజలూ మహోద్యమ స్ఫూర్తితో సోమవారం ఒక్కరోజే గ్రేటర్ వ్యాప్తంగా సుమారు 28.8 లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధమయ్యారు.
గవర్నర్ నరసింహన్ ఉదయం 11 గంటలకు బీహెచ్‌ఈఎల్ ఆవరణలో మొక్కలు నాటనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదయం 11.30 గంటలకు పంజగుట్టలోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(నిమ్స్) ఆవరణలో మొక్కలు నాటడం ద్వారా మెగా హరితహారాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. వేలాది మంది సామూహికంగా మొక్కలు నాటేందుకు ఇప్పటికే 4,173 ప్రదేశాల్లో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ 28.80 లక్షల మొక్కలను సిద్ధంగా ఉంచాయి. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
సెంట్రల్ వర్సిటీ, డీఆర్‌డీఎల్(దుండిగల్), ప్రగతి రిసార్ట్స్, లహరి రిసార్ట్స్, వ్యవసాయ విశ్వవిద్యాలయం, జవహర్‌నగర్‌లలో వేలాదిమంది ఒకేసారి లక్షలాది మొక్కలు నాటడం ద్వారా మెగా హరితహారం చేపట్టనున్నారు. కాగా, అనుకున్న సంఖ్యను మించి మొక్కలు నాటడం ద్వారా రికార్డు నెలకొల్పనున్నట్లుఅధికార వర్గాలు చెపుతున్నాయి. క్రీడాకారులు పుల్లెల గోపీచంద్, ముఖేష్, పీవీ సింధుతో పాటు సినీ రంగానికి చెందిన రాజేంద్రప్రసాద్, రెజీనా తదితరులు సామాజిక బాధ్యతతో ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
మెట్రో నగరాలతో పోలిస్తే రికార్డు..!
ఒకేరోజు.. రెండున్నర గంటల వ్యవధిలో సుమారు 28.8 లక్షల మొక్కలు నాటిన ఉదంతాలు ప్రపంచవ్యాప్తంగా ఏ మెట్రో నగరంలోనూ ఇప్పటివరకూ సాధ్యపడలేదని, చరిత్రలో ఇది ఓ మహాద్భుత ఘట్టమని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. ఒకేరోజు లక్షలాది మొక్కలు నాటేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడం, లక్షలాది మందిని ఆ దిశగా కదిలించడం ఇదే ప్రప్రథమమని చెప్పారు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ముంబై వంటి మెట్రో నగరాల్లోనూ ఒకే రోజు 25 లక్షలకు పైగా మొక్కలు నాటిన సంఘటనలు లేవని స్పష్టం చేశారు. ఈ మెగా హరితహారం ద్వారా గిన్నిస్ రికార్డు సాధిస్తామని జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ వర్గాలు చెబుతున్నాయి.
మెగా హరితహారం ఎందుకంటే..
అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం.. 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన జీహెచ్‌ఎంసీలో 30 శాతం గ్రీన్‌బెల్ట్(హరిత వాతావరణం) ఉండాలి. అయితే ప్రస్తుతం నగరంలో హరితం 5 శాతమే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే తరుణంలోఇటీవలి ఈదురుగాలులకు నగరంలో అనేక చోట్ల చెట్లు నేలమట్టమయ్యాయి. నగరంలో రాతి నేల స్వభావానికి అనుగుణంగా పెరిగేవి, బలమైన వేరు, కాండం వ్యవస్థ ఉన్న చెట్లు కాకుండా.. గతంలో అందం.. ఆకర్షణ.. పైపై సొబగుల కోసం పెంచిన అలంకరణ చెట్లు ఇటీవల కుప్పకూలినట్లునిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జీవవైవిధ్యానికి, పర్యావరణ పరిరక్షణకు బాసటగా నిలవడంతోపాటు నగరంలో హరిత వాతావరణాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మెగా హరితహారానికి శ్రీకారం చుట్టింది.