- మొక్క సంరక్షణ బాధ్యత పెరగాలి
- మొక్కలు పెంచే వారికి అవార్డులు, పెంచని వారికి పెనాల్టీ వేసే విధానం రావాలి
పటాన్‌చెరు (మెదక్ జిల్లా) : 'చెట్టు లేకపోతే వాన ఎట్టా వస్తుంది.. కాంక్రీట్ జంగిల్ వదిలి గ్రీన్ ప్యాచ్ రావాలి.. ఇది ప్రభుత్వ కార్యక్రమంగా పౌరులు భావించకుండా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం తీసుకోవాలి. హరితహారం కార్యక్రమం ప్రజా ఉద్యమంగా మారాలి' అని గవర్నర్ ఎం.నరసింహన్ అన్నారు. ఇంటికి 10 మొక్కలు నాటితేనే ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వాలనే నిబంధన అమలు చేయాలని సూచించారు. సోమవారం ఆయన మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం బీహెచ్‌ఈఎల్ టౌన్‌షిప్‌లోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆవరణలో మంత్రులు హరీశ్‌రావు, కేటీర్, పి.మహేందర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డితో కలిసి ఆయన మొక్కలు నాటారు. అక్కడే ఏర్పాటు చేసిన సభలో గవర్నర్ మాట్లాడారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు.
ఇప్పుడు హరితహారంలో నాటుతున్న మొక్కల వివరాలను తాను తీసుకుంటున్నానని, ఆరు నెలల తర్వాత ఆ మొక్కల ఎదుగుదలపై ప్రత్యేకంగా సర్వే చేయిస్తానన్నారు. ఒక్క మొక్క పెరగకపోయినా దానికి కారణాలను తెలుసుకుని బాధ్యుడైన వ్యక్తికి జరిమానా విధిస్తామన్నారు. హరితహారంలో మొక్కలు నాటే వారంతా వాటి పెంపకంపై దృష్టి సారించాలన్నారు. మొక్కలను బాగా పెంచినవారికి అవార్డులు ఇవ్వాలని, పెంచనివారిని గుర్తించి వారికి జరిమానాలు ఇచ్చే విధానాలు తీసుకరావాలన్నారు. పాఠశాలలకు మధ్య, పాఠశాలల్లోనే తరగతుల మధ్య పోటీ పెట్టాలని మొక్కలను బాగా పెంచిన తరగతికి అవార్డు ఇవ్వాలన్నారు. మొక్కలను శ్రద్ధగా పెంచిన విద్యార్థికి అవార్డు ఇవ్వాలన్నారు. మొక్కలను సంరక్షిస్తూ పచ్చదనం పెంచే విద్యార్థులకు, వ్యక్తులతో పాటు పట్టణ నగర పాలక సంస్థలకు, కాలనీ సంఘాలకు అవార్డులివ్వాలన్నారు. అలాగే హరిత హారం కార్యక్రమంలో భాగంగా పెట్టిన మొక్కలన్నింటిని సంరక్షించాలని గవర్నర్ సూచించారు.
బొకేలు నిషేధిద్దాం..
పూల బొకేలిచ్చే పద్ధతికి స్వస్తి పలకాలని గవర్నర్ అన్నారు. ఏడాదిపాటు పూలను తుంచకుండా ఉండాలని ఆయన సూచించారు. పూల మొక్కలను పెంచాలన్నారు. పూల బొకేలకు బదులుగా చిన్న మొక్కలను కుండీల్లో అతిథులకు ఇవ్వాలన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా పళ్లనిచ్చే మొక్కలను, ఔషధ మొక్కలను పెంచాలన్నారు. హరితహారం విజయవంతం కావాల్సిందేనని ఆకాంక్షించారు. రోడ్లపై పచ్చదనాన్ని పెంచే బాధ్యత కార్పోరేట్ సంస్థలకు ఇవ్వాలని సూచించారు.
'హరిత హారం ప్రజా ఉద్యమంగా మారాలి'
Published Mon, Jul 11 2016 5:33 PM | Last Updated on Tue, Aug 21 2018 11:41 AM
Advertisement