ఆద్యంతం ఆసక్తిగా..
సిద్దిపేట రూరల్ : ఇబ్రహీంపూర్‌లో శుక్రవారం గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ పర్యటించారు. ఉదయం 10.30 గంటలకు హెలికాప్టర్ ద్వారా గ్రామానికి చేరుకున్నారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, డీప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యే రామలింగారెడ్డి, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, ఫారూక్ హుస్సేన్‌లతో పాటు గ్రామ సర్పంచ్ కుంబాల లక్ష్మి రాఘవరెడ్డి, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు ఏర్పాటు చేసిన ప్రత్యేక కాన్వాయ్‌లో ఎర్ర చెరువు పోలేరమ్మ దేవాలయంలో సమీపంలో గవర్నర్ మొదట టేకు మొక్కను నాటారు. అదే సమీపంలో జమ్మీచెట్టును నాటారు.
పక్కనే వ్యవసాయ భూమిలో పందిరి సాగు చేస్తున్న మహిపాల్‌తో ముచ్చటించారు. సాగు ఎలా నడుస్తుంది..? పంటకు ఎంత ఖర్చు వస్తుంది? దిగుబడి ఎలా ఉంది? మార్కెట్ సదుపాయం బాగానే ఉందా... అంటూ రైతును వివరాలను అడిగి తెలుసుకున్నారు. మహిపాల్ కుటుంబ సభ్యులంతా వ్యవసాయమే జీవనాధారంగా చేసుకుని పంటలు సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్న రైతును గవర్నర్ అభినందించారు. ఇదే తరహాలో రైతులందరూ సాగు చేస్తే వ్యవసాయం పండుగలా మార్చుకోవచ్చని అన్నారు. అనంతరం గ్రామంలోని ఎస్సీ కాలనీలో పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ మహిళలను అప్యాయంగా పలకరించారు.
ఇంకుడు గుంతల విధానంపై అడిగి తెలుసుకున్నారు. అలాగే మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించారు. ప్రతి ఇంటి ముందు నాటిన చెట్లను చూసి, వాటి సంరక్షణకు తీసుకుంటున్న చర్యల గురించి ఆరా తీశారు. ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటిన తీరును సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల భవనాన్ని పరిశీలించారు. ఆవరణలో మామిడి చెట్టును నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఇబ్రహీంపూర్ గ్రామానికి రావడం సంతోషంగా ఉందన్నారు. గ్రామంలో చేపడుతున్న అభివృద్ది బాగుందని ప్రశంసించారు. గ్రామస్తులతో గడిపిన కొద్ది గంటలు మర్చిపోలేనిదన్నారు.
గ్రామంలో అమలవుతున్న పథకాలపై జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్, అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి హరీశ్‌రావులను అభినందించారు. ఇబ్రహీంపూర్ స్ఫూర్తితో అన్ని గ్రామాలు ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి సాధించాలన్నారు. ఇబ్రహీంపూర్ గ్రామ అభివృద్ధిపై తీసిన డాక్యూమెంటరీని గవర్నర్‌కు స్క్రీన్‌పై చూపించారు. ఇటీవల గ్రామంలో లక్షా 5వేల మొక్కలు నాటిన విషయం తెలిసిందే. కాగా, శుక్రవారం మరో లక్షా 5వేల మొక్కలు నాటారు. గవర్నర్ నరసింహన్‌ను సర్పంచ్ లక్ష్మి సన్మానించారు. అనంతరం ప్రసంగం ముగించుకుని సిద్దిపేట పట్టణానికి కాన్వాయ్‌లో చేరుకున్నారు. కార్యక్రమంలో సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, జిల్లా అధికారులు, ఆర్డీఓ ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.