మాకూ ‘క్యాష్’ కావాలి
‘నగదు రహిత గ్రామం’ ఇబ్రహీంపూర్‌వాసుల మాట ఇదీ!
- కార్డులు, స్వైపింగ్ మిషన్ల వాడకం అంతంతే
- నగదుకే జై కొడుతున్న జనం
- రేషన్ షాపు నుంచి బియ్యం కొనుగోలుకు మాత్రమే డెబిట్ కార్డులు
- మిగతా అన్ని అవసరాలకూ నగదు వాడకమే
- మిషన్ల వాడకం తెలియదంటున్న మెజారిటీ గ్రామస్తులు... ఇంగ్లిష్‌లో వచ్చే ఎస్‌ఎంఎస్ అర్థం కాదంటూ నిస్సహాయత
- స్వైపింగ్ మిషన్లను వెనక్కి ఇచ్చేసినవారు కొందరు.. వద్దన్నవారు ఇంకొందరు
- అన్నేసి డబ్బులతో స్మార్ట్‌ఫోన్లు కొనలేమంటున్న మరికొందరు
ఇబ్రహీంపూర్ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి మహమ్మద్ ఫసియుద్దీన్
ఇబ్రహీంపూర్.. సిద్దిపేట జిల్లాలో ఓ చిన్న గ్రామం.. 300 కుటుంబాలు, 1,200 జనాభా.. ప్రతి ఇంటా మరుగుదొడ్డి.. ఇంటింటికీ ఇంకుడు గుంత.. లక్ష మొక్కల పెంపకం.. ఇలా ఎన్నింట్లోనో ఆదర్శంగా నిలిచింది. అదే ఊపులో రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామాన్ని దేశంలోనే రెండో, రాష్ట్రంలో తొలి నగదు రహిత గ్రామంగా ప్రకటించింది! కానీ గ్రామంలో వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి.
గ్రామంలోని అత్యధిక మంది నగదు లావాదేవీలే నిర్వహిస్తున్నారు. అష్టకష్టాలు పడి బ్యాంకులు, ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకొచ్చి అవసరాలు తీర్చుకుంటున్నారు. ఈ గ్రామస్తులకు వ్యవసాయం, బీడీలు చుట్టడమే ప్రధాన ఉపాధి వనరులు. వీటితో వచ్చే డబ్బులు బ్యాంకులో జమ చేసి పెట్టుకున్నారు. స్వైపింగ్ యంత్రాలు, డెబిట్ కార్డులు ఇచ్చినా నగదు లావాదేవీలపైనే జనం మొగ్గు చూపుతున్నారు. గ్రామ జనాభాలో పెద్ద సంఖ్యలో ఉన్న వృద్ధులు, మధ్య వయసు ప్రజలకు చదువు రాదు. దీంతో వారంతా నగదు రహిత లావాదేవీల పట్ల ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.
నగదుతోనే అన్నీ!
రేషన్ షాపు నుంచి బియ్యం కొనుగోళ్లకు డెబిట్ కార్డులను అనివార్యం చేయడంతో ఈ ఒక్క అవసరానికి మాత్రమే గ్రామ ప్రజలు పూర్తిస్థాయిలో నగదు రహిత లావాదేవీలు జరుపుతున్నారు. మిగతా అవసరాల్లో అధిక శాతం నగదుతోనే తీర్చుకుంటున్నారు. నగదు కోసం పొరుగునే ఉన్న నారాయణరావుపేట, సిద్దిపేటకు వెళ్లి ఏటీఎంలు, బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసుకొని వస్తున్నారు. గ్రామంలో రోజూ వంద లీటర్ల పాలు సేకరించే పాల కేంద్రం నిర్వహకుడు సైతం పాలు అమ్మేవారికి రోజువారీగా నగదు రూపంలోనే డబ్బులు చెల్లిస్తున్నాడు. బస్సు, ఆటోల ద్వారా గ్రామం నుంచి రాకపోకల కోసం ప్రజలు నగదునే వినియోగిస్తున్నారు.
స్వైపింగ్ యంత్రాల వాడకం అంతంతే
స్వైపింగ్ యంత్రాన్ని వినియోగించడం తెలియదంటూ గ్రామంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న ఓ వృద్ధుడు దాన్ని తీసుకోడానికి నిరాకరించాడు. స్వైపింగ్ యంత్రం ద్వారా లావాదేవీలు జరిపితే మొబైల్ ఫోన్‌కు ఇంగ్లిష్‌లో వచ్చే ఎస్‌ఎంఎస్ అర్థం కాక మరో కిరాణా దుకాణం యజమాని రెండు రోజులకే ఆ యంత్రాన్ని బ్యాంకు అధికారులకు తిరిగి ఇచ్చేశాడు. ఒకట్రెండు కిరాణా షాపుల్లో కొద్ది మొత్తంలో నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నా గ్రామంలో సెల్‌ఫోన్ సిగ్నల్స్ సరిగ్గా లేక తరచూ స్వైపింగ్ యంత్రాలు మొరాయిస్తున్నాయి.
డెబిట్ కార్డులు, స్వైపింగ్ యంత్రం వినియోగం పట్ల తమకు అవగాహన లేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. గ్రామంలోని దుకాణాలకు సరఫరా చేసిన తక్కువ ఖరీదు గల పీవోఎస్ యంత్రాలతో కాగితపు రశీదులు జారీ చేసే సదుపాయం లేదు. దీంతో డెబిట్ కార్డులను వినియోగిస్తే డబ్బులు ఎవరికి వస్తున్నాయో.. ఎవరికి పోతున్నాయో అర్థం కావడం తెలియడం లేదని గ్రామంలో చాలా మంది అంటున్నారు. నగదు రహిత లావాదేవీ జరిగినప్పుడు దుకాణదారుల స్మార్ట్‌ఫోన్‌కు బ్యాంకు నుంచి ఇంగ్లిష్‌లో వస్తున్న ఎస్‌ఎంఎస్ అర్థం కావడం లేదని చాలామంది పేర్కొంటున్నారు.
ప్రభుత్వం పాత్ర ఓకే.. గందరగోళంలో ప్రజలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 5న ఆంధ్రాబ్యాంకు అధికారులు గ్రామంలో మేళా నిర్వహించి 18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతాలు, రూపే డెబిట్ కార్డులు జారీ చేశారు. మొత్తం 1,117 మందికి బ్యాంకు ఖాతాలు, డెబిట్ కార్డులు అందించారు. గ్రామంలో రేషన్ షాపులతో సహా మొత్తం 12 దుకాణాలకు పాయింట్ ఆఫ్ సేల్(పీఓఎస్) యంత్రాలను సరఫరా చేశారు. చిన్న సైజులో ఉండే ఈ యంత్రాలు స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటేనే పనిచేస్తాయి.
స్వైపింగ్ యంత్రం, డెబిట్ కార్డుల వినియోగం, ఆంధ్రాబ్యాంక్ చిల్లర్ యాప్, ఆంధ్రాబ్యాంక్ క్విక్ రెస్పాన్స్(క్యూఆర్) కోడ్ తదితర నగదు రహిత సదుపాయల వినియోగంపై అవగాహన కల్పించేందుకు బ్యాంకు అధికారులు గ్రామంలో సదస్సు నిర్వహించారు. గ్రామంలో చదువుకున్నవారు 543 మంది ఉన్నారు. నగదు రహిత లావాదేవీల పట్ల ప్రజల్లో పూర్తి అవగాహన కలగక ముందే రాష్ట్ర ప్రభుత్వం ఇబ్రహీంపూర్ గ్రామాన్ని దేశంలో రెండో, రాష్ట్రంలో తొలి నగదు రహిత గ్రామంగా ప్రకటించింది. ఇకపై ఒక రూపాయి లావాదేవీలకు కూడా డెబిట్ కార్డును వినియోగించాల్సిందేనని గ్రామ ప్రజలకు అధికారులు సూచించారు. దీంతో ప్రభుత్వ పాత్ర ఓ వరకు పూర్తయినా ప్రజలు మాత్రం ఇంకా గందరగోళంలోనే ఉన్నారు.
ఆదర్శ గ్రామమే.. అయినా..
ప్రతి ఇంటా మరుగుదొడ్డి...ఇంటింటికి ఇంకుడు గుంత.. ఊరి ప్రజలంతా కలిసి యజ్ఞంగా నాటిన లక్ష మొక్కలు..ఎనీ టైం ప్యూరిఫైడ్ వాటర్..ఆదర్శ పాఠశాల..ఇలాంటి ఇంకెన్నో చెప్పుకోదగ్గ విశేషాలతో ఇబ్రహీంపూర్ మిగతా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. సిద్దిపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి టి.హరీశ్ రావు స్వయంగా ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని ప్రత్యేక చొరవతో ఈ కార్యక్రమాలు అమలు చేశారు. గ్రామానికి ప్రత్యేక గుర్తింపు, పేరు తెచ్చి పెట్టారు. అయితే అకస్మాత్తుగా గ్రామంలో నగదు రహిత లావాదేవీలు అనివార్యం చేయడంతో ప్రజలంతా నిస్సహాయులుగా మారారు.
ఇబ్రహీంపూర్ గ్రామం
నాకు గీకొస్తదా సారూ: ఇబ్రహీంపూర్‌వాసి బాలవ్వ గోడు..
కార్డు (డెబిట్ కార్డు) ఇంట్ల పెట్టిన. సంచిల దాచి కొయ్యకేసిన. మరి నాకు గీకొస్తదా సారూ! ఎట్ల గీకాల్నో తెల్వది. మేము గట్క సల్ల తాగినోళ్లం. పచ్చకూర తిన్నోళ్లం. గిప్పుడు గివన్నీ చూస్తున్నం. కండ్లు కనబడ్తలెవ్వు. చెవులు ఇనబడ్తలెవ్వు. ఇప్పుడు ఈ కార్డు గీకమంటే ఎట్ల గీకుత? నా బిడ్డ పిల్లలు, కొడుకు పిల్లలు పైసలకేడిస్తె వాళ్లకు పైసలు ఎట్ట తీసియ్యాలె? మోకాళ్ల మందులకే నెలకు వెయ్యి (రూపాయలు) అయితున్నయి. పించనిస్తుండ్రు కానీ తీసుకునే కాడ అంతా గడబిడ. ఒకళ్ల మీద ఒకళ్లు ముసలోళ్లను కింద పడేసి తొక్కుతున్నరు. ఈడ నుంచి ఆడిదాక ఒకలెనుక ఒకలు దార బట్టాలె.
మిషన్ వెనక్కి ఇచ్చేశాం: యాసల పద్మ
రెండ్రోజుల కింద ఆంధ్రాబ్యాంకు వాళ్లు కార్డు గీకే మిషన్ ఇచ్చారు. రూపాయి వస్తువు కూడా కార్డుతోనే కొనాలి..అమ్మాలన్నారు. మిషన్ ఖర్చు నెలకు రూ.300 అవుతుందన్నారు. మిషన్ ఎలా వాడాలో నాకు తెలిస్తే కదా? రెండు రోజులు నేర్పారు.. అర్థం కాలేదు..మిషన్‌లో (డబ్బు) కొట్టితే సెల్‌ఫోన్‌కు ఇంగ్లిష్‌లో మెసేజ్ వస్తుంది. మూడో తరగతి చదువుకున్న నాకు ఇంగ్లిష్ అర్థం కాదు. సిగ్నల్ లేక నెట్ కూడా సరిగ్గా రాదు. దీంతో మిషన్‌ను వాపసు ఇచ్చేశాం
మాలాంటోళ్లకు కష్టం: కుంబాల సుగుణమ్మ: మా అసోంటోళ్లకు (క్యాష్‌లెస్ లావాదేవీలు) కష్టం. చదువు వస్తే చేయడం వస్తుంది. మేం చదువుకోలేదు..ఇవన్ని కొత్తవి (డెబిట్ కార్డులు, స్వైపింగ్ యంత్రాలు) ఇచ్చి బతుకుమంటే ఎట్లా? వాడితే డబ్బులు వస్తున్నాయో? పోతున్నాయో తెలియడం లేదు. నాకు ఇచ్చిన రూపాయి (రూపే డెబిట్) కార్డును ఒక్కసారే రేషన్ షాపులో ఉపయోగించా
సిద్దిపేటలో డీలర్ల వద్దే స్వైపింగ్ మిషన్ లేవు: కమటం రామస్వామి(35), కిరాణం దుకాణం యజమాని: ‘‘ఊళ్లో పెద్ద దుకాణం నాదే. డిగ్రీ వరకు చదివాను. స్వైపింగ్ మెషిన్‌తో రోజుకు రెండు వేల రూపాలయ గిరాకీ చేస్తున్న. కిరాణం, జనరల్ ఐటంలు, కూల్ డ్రింక్స్‌లను కార్డుతో కొంటున్నారు. సిద్దిపేటలో హోల్‌సేల్ డీలర్ల వద్దే స్వైపింగ్ మెషిన్లు లేవు. దీంతో అక్కడి నుంచి సరుకులు తీసుకురావడం ఇబ్బందిగా మారింది’’
మూడు గంటలు నిలబడి రెండు వేలు తెచ్చుకున్నం: బండి సుగుణమ్మ(55), బీడీ కార్మికురాలు: ‘‘మొత్తం కార్డు సిస్టం అన్నరు. చిల్లర లేక ఇబ్బంది అవుతుంది. ఎక్కువ సామాన్లు కొనడానికి కార్డు వాడొచ్చు. చిల్లర సామాన్లకు ఎలా? డబ్బు లేకపోతే నా భర్తతో కలిసి పక్క గ్రామం వెళ్లి మూడు గంటలు లైన్ల నిలబడి ఏటీఎం నుంచి చెరో రెండు వేల రూపాయలు తెచ్చుకున్నం’’
పెద్ద ఫోన్ కొనలేం: గందె భద్రవ్వ, పాల కేంద్రం నిర్వహకురాలు: కార్డు గీకే మిషన్ కోసం పెద్దఫోన్(స్మార్ట్ ఫోన్) కావాలన్నరు. దానికి దీనికి లింక్ ఉంటుందన్నరు. ఫోన్ కోసం రూ.15 వేలు పెట్టలేం..మిషన్ వద్దన్నం. మా దగ్గర పాలు పోసేవాళ్లకు ఏ రోజుకారోజు నగదు ఇస్తున్నం.