మాట్లాడుతున్న అటవీ శాఖ ఛీఫ్ పీకేజూ
- హరితహారంలో ఇబ్రహీంపూర్ సమష్టి కృషికి నిదర్శనం
- సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు చొరవ అభినందనీయం
- కాంపా నిధులు సక్రమంగా వినియోగం
- జిల్లాలో అటవీ శాఖ చీఫ్ పీకేజూ పర్యటన
సిద్దిపేట జోన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం లక్ష్యాన్ని సాధిస్తోందని, సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్ గ్రామస్తులు సమిష్టి కృషితో లక్షల మొక్కలు నాటడం అభినందనీయమని రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య సంరక్షణ అధికారి (ప్రిన్సిపల్ సీసీఎఫ్ ) పీకేజూ ప్రశంసించారు. బుధవారం ఆయన సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్‌ను సందర్శించి స్థానిక ఎఫ్‌ఆర్వో కార్యాలయంలో సాక్షి ప్రతినిధితో మాట్లాడారు. ఇటీవల మంత్రి హరీశ్‌రావు చొరవతో ఇబ్రహీంపూర్‌లో ఒకే రోజు లక్ష మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్ధేశించిందన్నారు. 3 సంవత్సరాల్లో సాధించాల్సిన 1.20 లక్షల మొక్కల లక్ష్యాన్ని ఇబ్రహీంపూర్ ఈ సంవత్సరమే 2.10 లక్షల మొక్కలతో అధిగమించిందన్నారు. గ్రామంలోని యువకులు స్పూర్తితో గ్రామాన్ని హరితవనంగా మార్చడం అభినందనీయమన్నారు. మొక్కలు నాటడమే కాదని వాటని సంరక్షించడం గొప్ప విషయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటవీ శాఖకు 17 కోట్ల మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్ధేశించిందన్నారు. జిల్లాలో 1.36 కోట్ల మొక్కల్ని అటవీశాఖ ఆధ్వర్యంలో నాటేలా లక్ష్యాన్ని నిర్ధేశించామన్నారు. ఇప్పటికే 2 వేల ఎకరాల్లో ప్లాంటేషన్ కొనసాగిందన్నారు. అదే విధంగా జిల్లాలోని అడవుల సరిహద్దు వెంట 488 కిలోమీటర్ల పొడవునా కందకాలను పూర్తి చేయడం జరిగిందని, మరో 90 కిలో మీటర్లు పూర్తి చేస్తామన్నరు. గజ్వేల్‌లో నిర్ధేశించిన లక్ష్యాన్ని అధిగమించడం జరిగిందన్నారు. ప్రాజెక్ట్‌ల, రహదారుల నిర్మాణానికి అటవీ భూమిని వినియోగించుకున్నందుకు . ప్రతి రూపంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కాంపా నిధులను రాష్ట్రంలో సక్రమంగా వినియోగించేలా చర్యలు చేపట్టామన్నారు.
జిల్లాలో ఫారెస్ట్ చీఫ్ పర్యటన
రాష్ట్ర ఆటవీ శాఖ ఛీప్ పీకేజూ బుధవారం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్ హరితహారం కింద నాటిన మొక్కలను, గ్రామస్తులు సమిష్టిగా తీసిన కందకాలను, ఇంకుడు గుంతలను పరిశీలించారు. అదే విధంగా మర్పడగ నర్సరీ, గజ్వేల్, మీనాజీపేట, కోమటిబండ, బంగ్లా వెంకటాపూర్, నర్సంపల్లిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్లానిటేషన్‌లను ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అయన వెంట అడిషనల్ పీసీసీఎఫ్ రాకేష్ మోమన్ డోగ్రీయా, జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీధర్‌రావు, సిద్దిపేట ఎఫ్‌ఆర్వో వెంకటరామరావు, శ్యాంసుందర్‌రెడ్డి, కుతుబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.