సిద్దిపేట రూరల్: పదేళ్ల నుంచి ఆ గ్రామంలో చూడ్డానికి ఒక్క దోమా కనిపించదు.. అలాగే నీటి కరువు అసలే లేదు.. నమ్మశక్యంగా లేదు కదూ.. అయితే మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా తుంబుర్నీ గ్రామానికి వెళ్లాల్సిందే. మురుగు, ఇతర వృథా నీరు రోడ్లపై పారకూడదనే ఆలోచనతో ప్రతి నీటి చుక్క భూమిలోకి ఇంకిపోయేలా (మ్యాజిక్ ఫిట్) చర్యలు తీసుకున్నారు. దీంతో అటు భూగర్భ జలాలు పెరగడంతో పాటు ఇటు పారిశుద్ధ్య సమస్యా తీరింది.
ఇప్పుడు ఆ గ్రామం దేశానికే ఆదర్శమైంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో తుంబుర్నీ గ్రామ ప్రత్యేకతను ఆ జిల్లా సీఈఓ వివరించారు. ఈ సమావేశానికి హాజరైన తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ఇది ఆలోచింప జేసింది. ఇటీవల మెదక్ జిల్లా నుంచి పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు తుంబుర్నీ సందర్శించారు. అక్కడ మురుగు, వృథా నీరు రోడ్లపైకి రాకుండా చేపట్టిన విధానాన్ని తెలుసుకున్నారు. దీంతో రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు సూచన మేరకు సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్ గ్రామాన్ని పెలైట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశారు.
మోడల్‌గా ఇబ్రహీంపూర్
ఇబ్రహీంపూర్‌లో 240 కుటుంబాలు ఉన్నాయి. మొదట గ్రామంలో ఉన్న మినీ ట్యాంక్‌ల వద్ద ప్రయోగాత్మకంగా ‘మ్యాజిక్ ఫిట్’ను ఏర్పాటు చేస్తున్నారు. దీని ఏర్పాటుకు సుమారు రూ. 4,500 ఖర్చవుతుంది. దీనిని ఉపాధికి, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖకు అనుసంధానం చేసి నిర్మాణాలు చేపడితే మంచి ఫలితాలు సాధించవచ్చు. దీనిపై జిల్లా అధికారులకు ప్రతిపాదనలు సైతం పంపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈ విధానాన్ని చేపడితే భూగర్భ జలాలు పెరగడంతో పాటు పారిశుద్ధ్య సమస్య తొలగిపోతుందని తుంబుర్నీని సందర్శించిన అధికారులు అంటున్నారు.
లాభాలు అధికం...
ఇబ్రహీంపూర్‌లో డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి రూ. 3 కోట్లు ఖర్చవుతాయని అంచనా. కానీ గ్రామంలోని 240 కుటుంబాలకు తుంబుర్నీ విధానం ద్వారా మ్యాజిక్‌ఫిట్‌ల నిర్మాణాలు చేపడితే రూ. 12 లక్షలు మాత్రమే ఖర్చవుతాయి. ఈ విధానంలో గ్రామంలో రోడ్డుకిరువైపుల మురికి కాల్వలు అవసరం లేదు. మురికి కాల్వలు, బురదగుంతలు ఉండక ఈగలు, దోమలు పూర్తిగా ఉండకపోవడంతో అంటు వ్యాధులూ ప్రబలే అవకాశం ఉండదు.
మ్యాజిక్ ఫిట్ ఇలా..
పంచాయతీలోని ప్రతి చేతి పంపు, ఇంటి ఆవరణలో మీటర్ వెడల్పు, మీటర్ లోతున గుంత తీశారు. ఇందులో అరమీటర్ వ్యాసార్థంతో ఉండే సిమెంట్ గోలాన్ని అడుగు భాగం లేకుండా బిగించారు. గోలం చుట్టు 60 ఎంఎం, 40 ఎంఎం మందం కంకర పోశారు. గోలం ఎగువన ఆరు అంగుళాల దూరంలో నాలుగు దిక్కుల రంధ్రాలు చేశారు. కంకర పై భాగంలో ప్లాస్టిక్ కవర్ వేసి దానిపై మట్టితో కప్పారు. ఇలా రూపొందించిన గుంతలకు చేతి పంపులు, ఇండ్ల నుంచి వృథాగా వెళ్లే నీరు అందులోకి చేరేలా పైపులను అమర్చారు. గోలెంలో పడిన నీరు భూమిలోకి గోలం నిండితే పై భాగంలోని రంధ్రాల నుంచి కంకరలోకి చేరుతుంది. ఈ విధానాన్ని తుంబుర్నీలో ‘మ్యాజిక్ ఫిట్’ అని పిలుస్తారు.
చాలెంజ్‌గా తీసుకున్నాం...
మహారాష్ట్రలోని తుంబుర్నీ గ్రామంలో ఉన్న విధానాన్ని ఇక్కడ అమలు చేయాలని చాలెంజ్‌గా తీసుకున్నాం. ఇటీవల ఆ విధానాన్ని ఇబ్రహీంపూర్‌లోని మినీ వాటర్‌ట్యాంక్‌ల వద్ద చేపట్టాం. ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ప్రజలు ఆసక్తి చూపడం లేదు. ఒక్కో ఫిట్ ఏర్పాటుకి రూ. 4,500 ఖర్చవుతుంది. దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. స్పందించి ఉపాధి హామీ, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖకు అనుసంధానం చేయాలి. దీంతో మురికి, వృథా నీటి సమస్య, పారిశుద్ధ్య సమస్య తొలగిపోతుంది.
- సమ్మిరెడ్డి, ఎంపీడీఓ
ప్రభుత్వం స్పందించాలి...
ప్రభుత్వం డ్రైనేజీ వ్యవస్థకు స్వస్తి చెప్పి ఇంకుడు గుంతల విధానాన్ని చేపడితే గ్రామాల్లో మంచి లాభాలు ఉంటాయి. కానీ ఇంకుడు గుంతల నిర్మాణానికి అయ్యే ఖర్చు ప్రజలకు భారంగా మారనుంది. దీనిపై ప్రభుత్వం స్పందించి ఉపాధి హామీకి అనుసంధానం చేస్తే ఈ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రజలందరు సిద్ధంగా ఉన్నారు. గ్రామాన్ని మంత్రి హరీశ్‌రావు కృషితో అభివృద్ధి చేస్తున్నాం.
- కుంబాల లక్ష్మి రాఘవారెడ్డి,
సర్పంచ్, ఇబ్రహీంపూర్.
‘మ్యాజిక్ ఫిట్’.. మురుగు ఫట్
Published Fri, May 29 2015 1:08 AM | Last Updated on Sun, Sep 3 2017 2:50 AM
Advertisement
Advertisement