ఉమన్ హెల్త్ కౌన్సెలింగ్
నా వయసు 36 ఏళ్లు. ఇద్దరు పిల్లలు. కొంతకాలం నుంచి నన్ను ఒక సమస్య తీవ్రంగా కలచివేస్తోంది. అదేమిటంటే మెనోపాజ్ వచ్చిందేమోనని భయంగా ఉంది. ఎందుకంటే గత ఆర్నెల్లుగా నాకు రుతుస్రావం సక్రమంగా అవడం లేదు. ప్రతి చిన్న విషయానికీ అందరిపై చికాకు పడుతున్నాను. అదే పనిగా ఆవేశానికి లోనవుతున్నాను. కలత చెందుతున్నాను. నాలో ఉత్సాహం తగ్గిపోయి నీరసం, నిస్సత్తువ ఆవహించినట్టు ఉంటోంది. ఏ విషయంలోనూ ఏకాగ్రతను పెట్టలేకపోతున్నాను. నాలో వచ్చిన ఈ విపరీతమైన మార్పులతో నా స్నేహితులు ‘నువ్వు మెనోపాజ్‌కు చేరువవుతున్నట్లున్నావు’ అని అంటున్నారు. అసలు నాకు ఏమైంది?
- రాజ్యలక్ష్మి, ఒంగోలు
మీరు తెలిపిన లక్షణాలను బట్టి చూస్తే మీరు మెనోపాజ్‌తో బాధపడుతున్నట్లు అనిపించడం లేదు. సాధారణంగా మెనోపాజ్ నలభై ఏళ్లు పైబడినవారి తర్వాతే ఎక్కువ. మెనోపాజ్ మొదలైన స్టేజ్‌ని వైద్యశాస్త్రంలో ‘గోల్డెన్ ఏజ్’గా అభివర్ణిస్తారు. దీనికి అంతటి ప్రాముఖ్యత ఉంది. మీకు త్వరగా పెళ్లి కావడం వల్ల మీరు మెనోపాజ్ గురించి అనవసరంగా చాలా నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారేమోనని అనిపిస్తోంది. ఇలా తీవ్రమైన ఆందోళనకు గురైనా కూడా త్వరగా మెనోపాజ్‌కు లోనయ్యే అవకాశాలున్నాయి. అయినప్పటికీ మీరు కంగారు పడాల్సిన పనేమీ లేదు.
ఈ ప్రక్రియ ప్రకృతి సహజమైనది. జీవితంలో అన్నింటినీ పాజిటివ్‌గా తీసుకుని, మిగతా లైఫ్‌ని ఆనందంగా గడపాలి. ఈకాలంలో మహిళలందరూ ఉన్నతమైన స్థానాలను అధిరోహించి తమ తమ వృత్తి ఉద్యోగాల్లో గొప్పగా రాణిస్తున్నారు. కొందరు మెనోపాజ్ దాటిన వారు కూడా వారిలో ఉన్నారు. వారందరినీ మీరు ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవచ్చు. మీరు మంచి గైనకాలజిస్ట్‌ను కలవండి. మీ సమస్యతో పాటు మీ అనుమానాలూ క్లియర్ అవుతాయి. ఈలోగా మీరు మంచి ఆహారాన్ని తీసుకోండి.
మసాలా, వేపుళ్లు, కాఫీల వంటివి ఎక్కువగా తీసుకోకండి. మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండండి. రెస్ట్ తీసుకోండి. వైటమిన్-డి, క్యాల్షియమ్ ఉండే ఆహారాన్ని గానీ లేదా ట్యాబ్లెట్లుగా గానీ తీసుకోండి. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా, మెడిటేషన్ లాంటివి చేస్తూ స్ట్రెస్‌ను దూరం చేసుకోండి. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసేలా చూసుకోండి. మిత్రులను కలవడం, ఆరోగ్యకరమైన సంభాషణలు వంటివి చేయండి. మీ జీవితాన్ని ఆనందంగా గడపండి.
- డాక్టర్ శాంతకుమారి
సీనియర్ గైనకాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్
మెనోపాజ్ ఆందోళన వీడండి... ఆనందంగా జీవించండి
Published Fri, Sep 16 2016 11:14 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM
Advertisement