
నీహారిక
ఇష్టంతో నేర్చుకున్నా...
నాకు వ్యవసాయ పనులంటే ఎంతో ఇష్టం. అమ్మనాన్నలతో చేలోకి వెళ్లి పనులు నేర్చుకున్నా. ట్రాక్టర్ నడపాలని ఉన్నప్పటికీ మొదట్లో భయపడ్డా. కానీ ఓ సారి ట్రాక్టర్ స్టార్ట్ చేసి నడిపాను. భయం పోయింది. అప్పటి నుంచి ట్రాక్టర్‌తో అన్ని పనులు చేయడం నేర్చుకున్నా. సరదాగా నేర్చుకున్న పనితో నాన్నకు సాయపడుతున్నా.
నీహారికది జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కాటారం మండలం, శంకరాంపల్లి. కాలేజిలో చదువుకునే అమ్మాయిలంటే పుస్తకాలే ప్రపంచంగా, మోడరన్‌గా జీవించాలనుకుంటారు. నిహారిక ఖాళీ దొరికినప్పుడల్లా అరక కట్టడం, ఎడ్లబండి తోలడం మొదలు.. ట్రాక్టర్, ఆటో, బైక్ నడుపుతుంది. నిహారిక కుటుంబ నేపథ్యం... చిగురు పెంటయ్య–సునీత దంపతులకు ముగ్గురు కూతుళ్లు. ఒక కొడుకు. మూడో కుమార్తె నిహారిక వరంగల్లులో డిగ్రీ ప్రథమ సంవత్సరం. ఆరు ఎకరాల మేర భూమి సాగుచేస్తూ సంతానాన్ని చదివిస్తున్నారు ఆ తల్లిదండ్రులు.
నాన్నతోపాటు నాగలి పట్టింది
నిహారిక అమ్మనాన్నలతో పొలం వద్దకు వెళ్తుండేది. ఎనిమిదో తరగతిలో ఉండగా.. నాన్నతో కలిసి నాగలి దున్నడం నేర్చుకుంది. కూలీలతో కలిసి పొలానికి వెళ్లి దున్నడంలాంటి పనులు చేస్తుండేది. దీంతో గొర్రు కొట్టడం, విత్తనాలు నాటడం, స్పేయ్రర్‌తో మందు పిచికారీ చేయడం, ఎరువులు వేయడంలాంటి పనులు కూడా నేర్చుకుంది. పెద్దనాన్న చంద్రయ్య బైక్‌తో డ్రైవింగ్ నేర్చుకుంది. ఇంతలో పెంటయ్య ట్రాక్టర్ కొన్నాడు. తండ్రితో కలిసి అప్పుడప్పుడు ట్రాక్టర్ మీద వెళ్లిన నిహారిక దానిని ఎలా నడపాడో తెలుసుకుంది. కొద్దిరోజుల్లోనే ట్రాక్టర్ నడపడం నేర్చుకుంది. దున్నడం, లెవలింగ్, గొర్రు కొట్టడం, పంట పొలాల్లో కేజీవీల్స్ వేయడం లాంటి ట్రాక్టర్‌కి సంబంధించిన ప్రతి పనిని నేర్చేసుకుంది. గత నాలుగేళ్లుగా ట్రాక్టర్‌తో చేయాల్సిన పనులన్నింటిలో నిష్ణాతురాలైంది. పెంటయ్యకు కొడుకు ఉన్నప్పటికీ, అతడు చిన్నవాడు. దాంతో నిహారిక ఇంటికి పెద్ద కొడుకులా అన్ని పనులు చేస్తోంది.
చదువులో... ఆటలోనూ... మేటి!
నిహారిక ఇంటిపనులు, వ్యవసాయ పనులకే పరిమితం కాలేదు. చదువు, ఆటల్లోను రాణిస్తుంది. టెన్త్ క్లాస్‌లో ఫస్ట్ క్లాస్‌లో పాసైంది. ఇంటర్ సీఈసీ పూర్తి చేసి, ప్రస్తుతం వరంగల్‌లో డిగ్రీ చదువు తోంది. ఇంటి వద్ద ఎన్ని పనులు చేసినప్పటికీ చదువులో ఏ మాత్రం వెనుకంజవేయడం లేదు. నిహారిక ఆటల్లోనూ రాణిస్తోంది. అథ్లెటిక్స్‌లో మండల, జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభతో బహుమతులు పొందింది. గత ఏడాది అక్టోబర్‌లో రంగారెడ్డి జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీల్లో రన్నింగ్ విభాగంలో 400 మీటర్లలో గోల్డ్ మెడల్, 800 మీటర్లలో సిల్వర్ మెడల్ సాధించింది.
– చీర్ల శ్రావణ్‌రెడ్డి, కాటారం, జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లా
ఆసక్తి చూసి కాదనలేకపోయా...
అమ్మాయి కదా తనకు ఈ పనులు నేర్పించడం ఎందుకని మొదట్లో అందరిలాగే నేనూ అనుకున్నా. సెలవు వస్తే చాలు నాతో పొలానికి వచ్చేది. తను ట్రాక్టర్ నడపడం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇలాంటి కూతురు ఉండటం ఆనందంగా ఉంది.
– చిగురు పెంటయ్య, నిహారిక తండ్రి
Comments
Please login to add a commentAdd a comment