
మైగ్రేన్ మళ్లీ రాదు!
యోగా
మెదడులోని నాడీ సంకేతాలు, రసాయన మార్పుల వలన మైగ్రెయిన్ లేదా పార్శ్వపునొప్పి వస్తుంది. తల భాగానికి సరైన రక్తసరఫరా లేకపోవడం. స్ట్రెస్, యాంగ్జయిటీ తదితర మానసిక సమస్యలు, మలబద్ధకం, అలర్జీలు, అలర్జిక్ రియాక్షన్స్, నిద్రలేమి, ఆల్కహాల్, డీ హైడ్రేషన్, సమయానికి తగిన ఆహారం తీసుకోకపోవడం, అతిగా ధ్వని, పొగ, వెలుతురుతో ఇరిటేట్ అవడం, కొన్ని రకాలైన మందులు... మెదడు అతిగా ఉత్తేజితమై మైగ్రెయిన్‌కి దారి తీస్తుంది. ఇది కొన్ని గంటలు, రోజంతా ఉండి మరే పని చేయలేని పరిస్థితి కల్పిస్తుంది. ఒక్కోసారి చెమట, విరేచనాలకూ కారణమవుతుంది. వాంతి వచ్చినట్లు ఉంటుంది.
ఆహారపు అలవాట్లలో మార్పు, యోగాసనాల ద్వారా దీనికి పరిష్కారం లభిస్తుంది. మెదడుకి మెరుగైన రక్త సరఫరా, ఆక్సిజన్ అందించేవి, మనసు ప్రశాంతంగా ఉంచే ఆసనాలు చేయాలి. జాను శిరాసన, పశ్చిమోత్తాసన, అథోముఖ శ్వానాసన, సేతు బంధాసన, హలాసన, మత్సా్యసన, ప్రసారిత పాదోథ్థానాసన, సర్వాంగాసన మెదడుకి రక్తసరఫరా ఆక్సిజన్ అందించేవి గానూ, మార్జాలాసన, ఉష్ణ్రాసన, అర్ధ అథోముఖ శ్వానాసన, బాలాసన, శవాసన మనసుకు సాంత్వన చేకూర్చేవిగా చెప్పొచ్చు.
1. సర్వాంగాసన
ఆసనంలో వెల్లకిలా పడుకుని చేతులు రెండూ శరీరానికి ఇరువైపులా ఉంచాలి. అరచేతులు భూమి మీద నొక్కుతూ రెండు పాదాలను, మోకాళ్లను కలిపి ఉంచి శ్వాస తీసుకుంటూ రెండు కాళ్లను నెమ్మదిగా పైకిలేపి 90 డిగ్రీల కోణంలోకి తీసుకు రావాలి. తర్వాత కాళ్లను ఇంకా తలవైపునకు తీసుకువెళుతూ నడుముకి రెండు చేతులతో సపోర్ట్ ఉంచి నడుమును, పిరుదులను ఇంకా పైకి లేపి వీపు మధ్య భాగానికి చేతులతో సపోర్ట్ ఉంచి భుజాలు మెడ మీద శరీరం మొత్తాన్ని పైకి గాలిలోకి లేపే ప్రయత్నం చేయాలి. పూర్తి ఆసన స్థితిలోకి వచ్చిన తర్వాత స్ట్రెచ్ చేసిన పాదాలను కొంచెం రిలాక్స్‌డ్‌గా సమంగా ఉంచాలి.
ఈ స్థితిలో గడ్డం ఛాతీ భాగాన్ని అదుముతూ ఉంటుంది. ఆసనంలో స్థిరంగా సాధారణ శ్వాసలు 5 లేదా 10 తీసుకుని అంటే çసుమారు రెండు లేదా మూడు నిమిషాల పాటు ఉన్నట్లయితే రక్త ప్రసరణ తలవైపునకు ఎక్కువగా ఉండి క్రేనియల్ నెర్వస్ సిస్టమ్‌కి లాభం చేకూరుతుంది. ఆసనం మీద పట్టు ఉన్నట్లయితే సర్వాంగాసనంలో రెండు కాళ్లు పైన పక్కలకు సెపరేట్ చేయవచ్చు. ఒకకాలు ముందుకు ఒక కాలు వెనుకకు ఆల్టర్నేటివ్‌గా కదలించవచ్చు. సైక్లింగ్ చేయవచ్చు.
2. ఉత్థానాసన
తాడాసనం (సమస్థితి)లో నిలబడి చేతులు రెండు తుంటిమీద ఉంచాలి. శ్వాస మెల్లగా వదులుతూ తుంటికీలు నుండి (నడుము నుండి కాకుండగా ఇంకా క్రిందభాగం నుండి) ముందుకు వంగాలి. నడుము ఆ పై భాగాలను బాగా సాగదీస్తూ, వీలైనంత వరకు మోకాళ్ళను ముందుకు వంచకుండా నిటారుగా ఉంచాలి. చేతులను తుంటిమీద నుండి కిందకు, చేతివేళ్ళను కిందకు అరచేతులను నేలమీద ఉంచితే ‘పాద హస్తాసనము’అంటారు. అదే, చేతివేళ్ళతో కాలి బొటనవేళ్లను పట్టుకున్నట్లయితే ‘పాదాంగుష్టాసనం’ అంటారు. చేతులు రెండూ కలిపి వెనకకు తీసుకువెళ్లినట్లయితే ‘ఉత్థానాసనం’ అంటారు. 3 లేదా 5 సాధారణ శ్వాసలు తరువాత శ్వాస తీసుకుంటూ తిరిగి తాడాసన స్థితికి రావాలి. ఒక వేళ రెండు చేతులు నేలమీదకు తీసుకురాలేనివారు చేతులు కింద రెండు ఇటుకలను కావల్సిన ఎత్తులో ఉంచి వాటి సపోర్ట్ తీసుకోవచ్చు.
3. పశ్చిమోత్తానాసన
పశ్చిమ అంటే వీపు భాగం, ఉత్తాన అంటే సాగదీయడం. ఈ ఆసనంలో వీపు భాగం బాగా సాగదీయబడుతుంది కనుక పశ్చిమోత్తానాసన అని పేరు. కాళ్లు రెండూ కలిపి ముందుకు స్ట్రెచ్ చేసి శ్వాస తీసుకుంటూ చేతులు పైకి, శ్వాస వదులుతూ తల, చేతులు ముందుకు వంచి రెండు చేతులతో రెండు పాదాలు ఇంటర్ లాక్ చేసి పట్టుకునే ప్రయత్నం చేయాలి. నుదురు మోకాలికి దగ్గరగా లేదా మోకాలి క్రిందకు, మోచేతులు రెండూ వీలైతే నేల మీద పెట్టే ప్రయత్నం చేయాలి. 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస తీసుకుంటూ తల, చేతులు పైకి శ్వాస వదులుతూ రెండు చేతులు ప్రక్క నుండి అరచేతులు భూమి వైపుకు చూపిస్తూ క్రిందకు తీసుకురావాలి. ఫొటోలో చూపిన విధంగా చేయలేని వారు ఏదైనా తాడును గాని, బెల్టును గాని తీసుకుని పాదాల క్రింద సపోర్టుగా ఉంచి రెండు కొనలను రెండు చేతులతో పట్టుకుని ముందు వంగే ప్రయత్నం చేయవచ్చు.
– సమన్వయం: సత్యబాబు