బయట వాతావరణంలో వేడి బాగా తగ్గినప్పుడు జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. తద్వారా అరుగుదల సమస్యలు ఏర్పడతాయి. అదే సమయంలో ఈ సీజన్‌లో తాత్కాలిక ఆనందం కోసం తీసుకునే టీ, కాఫీ, ఆల్కహాల్ వంటివి మరిన్ని అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి. ముఖ్యంగా పొట్టలో గ్యాస్, ఎసిడిటీ సంబంధిత సమస్యలు పెరుగుతాయి. ఈ నేపథ్యంలోనే గత వారం మనం గ్యాస్ సమస్యకు చెక్ పెట్టే కొన్ని యోగాసనాల గురించి తెలుసుకున్నాం. ఈ వారం మరికొన్ని ఆసనాలు...
శలభాసనం
బోర్లా పడుకుని చేతులు రెండూ శరీరం కిందకు, అరచేతులు పొట్ట కిందకు పోనించి, వీలైతే మోచేతులు కూడా పొట్ట, ఛాతీ కిందకు తీసుకెళ్లాలి. ముందుగా గడ్డాన్ని నేల మీద ఉంచి సపోర్ట్ తీసుకుంటూ శ్వాస తీసుకుంటూ కాళ్లు రెండూ ఎంత వరకూ వీలైతే అంత పైకి తీసుకెళ్లాలి. మోకాళ్లు, తొడలు భూమిని తాకకుండా చేయగలిగితే ఉత్తమం. మోకాళ్లు స్ట్రైయిట్‌గా ఉంచగలిగితే మరీ ఉత్తమం. లేదా ఎవరి శక్తి మేర వాళ్లు చేయవచ్చు. చివరిస్థితిలో గడ్డాన్ని కూడా భూమి మీద నుంచి పైకి లేపే ప్రయత్నం చేయాలి. శ్వాస వదులుతూ ఛాతీ, కాళ్లు నెమ్మదిగా భూమి మీదకు తీసుకురావాలి.
జాగ్రత్తలు: పొట్టలో అల్సర్సు ఉన్నవాళ్లు పొట్ట మీద కొంచెం ఒత్తిడి తక్కువగా వుండేట్టు ప్రయత్నం చేయాలి.
భుజంగాసనం
ఆసనంలో బోర్లా పడుకుని ఫొటోలో చూపిన విధంగా మోచేతులు రెండూ భూమి మీద ఉంచాలి. శ్వాస తీసుకుంటూ తలను, ఛాతీని పైకి లేపి ఉంచాలి. కాళ్లు రెండూ స్ట్రెయిట్‌గా పాదాలు రెండూ కూడా స్ట్రెచ్ చేసిన స్థితిలో ఉంచాలి. 3 లేదా 5 సాధారణ శ్వాసల తర్వాత శ్వాస వదులుతూ ఛాతీని తలను కిందకు తీసుకురావాలి. ఇదే విధంగా 5 నుంచి 10 సార్లు రిపీట్ చేయాలి.
లాభాలు: ఇది గ్యాస్ సమస్యకు మాత్రమే కాకుండా, కింది వెన్నునొప్పికి మలబద్ధకానికి కూడా ఉపయోగపడుతుంది.
గమనిక: మోచేతులు రెండూ పూర్తిగా ఓపెన్ చేసి చేతులు రెండూ స్ట్రెయిట్‌గా ఉంచి అరచేతులతో భూమిని గట్టిగా అదుముతూ తలను, ఛాతీని వీలైనంత పైకి లేపి మెడ భాగాన్ని పైకి సాగదీస్తూ చేసే ఆసనాన్ని పూర్ణ భుజంగాసనంగా వ్యవహరిస్తారు.
ధనురాసన
పొట్టమీద బోర్లా పడుకుని కాళ్లు రెండూ మడిచి ఎడమ చేత్తో ఎడమ చీలమండను లేదా పాదాన్ని, కుడిచేత్తో కుడి పాదాన్ని పట్టుకుని శ్వాస తీసుకుంటూ కాళ్లను, మోకాళ్లను పైకి లేపుతూ ఛాతీని తలను పైకి లేపుతూ ధనురాసన స్థితిలోకి రావాలి. 3 లేదా 5 శ్వాసల పాటు అలా ఉండి శ్వాస వదులుతూ రెండు కాళ్లు తల ఛాతీ భూమి మీదకు నెమ్మదిగా తీసుకురావాలి. ఈ ఆసనాన్ని కూడా 5 సార్లు రిపీట్ చేయడం, ఆసన స్థితిలో ఉన్నప్పుడు ముందుకు వెనుకకు స్వింగ్ అవడం, పక్కలకు రోల్ అవ్వడం వలన కూడా మంచి ఫలితం కనపడుతుంది.
ప్రయోజనాలు: గ్యాస్ సమస్యతో పాటు పొట్ట చుట్టూ ఉండే కొవ్వు తగ్గడానికి ఊబకాయానికి కూడా బాగా ఉపకరిస్తుంది.
గమనిక: పాదాలు చేత్తో పట్టుకోవడం కుదరనివాళ్లు ఏదైనా తాడును కాని, చున్నీని కాని ఉపయోగించవచ్చు. అదీ సాధ్యపడకపోతే రెండు చేతులు ముందుకు స్ట్రెచ్ చేసి కాళ్లు రెండూ భూమి పై నుంచి పైకి లేపి శ్వాస తీసుకుంటూ తలపైకి కాళ్లు కిందకు శ్వాస వదులుతూ తల కిందకు కాళ్లు రెండూ ఇంకా పైకి లేపుతూ స్వింగ్ అవ్వాలి. దీనిని అథోముఖ చాలన నౌకాసనంగా వ్యవహరిస్తారు. పొట్ట ఆధారంగా చేసే ఆసనాలు ఏమైనా అల్సర్సు ఉన్నవాళ్లు జాగ్రత్తగా సాధన చేయాలి. ఈ ఆసనాలు చేయడానికి ముందు ఒక ఆదివారం కాని లేదా ఏదైనా సెలవు దినం నాడు కాని చక్కగా శంఖ ప్రక్షాళన చేయడం కూడా అవసరం. గర్భిణీ స్త్రీలు చేయకూడదు.
– సమన్వయం: ఎస్. సత్యబాబు మోడల్: ఈషా హిందోచా, ఫొటోలు: పోచంపల్లి మోహనాచారి
- ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్
Comments
Please login to add a commentAdd a comment