సీజన్ వేడిగా... శరీరం చల్లగా...
యోగా
వేసవిలో జీవక్రియలు ఎక్కువగా ఉంటాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువ. ఆక్సిజన్ లెవల్స్ పడిపోతుంటాయి. ఇలాంటప్పుడు శరీరానికి ఇంకా అలసట కలిగించే ఆసనాలు కాకుండా కావల్సినంత ఆక్సిజన్ తీసుకుంటూ నిదానంగా చేసే ఆసనాలను సాధన చేయాలి. జీవక్రియ వేగాన్ని తగ్గించే చంద్ర నమస్కారాలు, శరీరం, మనసు బాగా విశ్రాంతి పొందడానికి సహకరించే శశాంకాసనం, మకరాసనం, మార్జాలాసనం, బాలాసనం, అర్ధ అధోముఖ శ్వాసాసనం, నిరాలంబాసన... వీటితో ఎక్కువ విశ్రాంతి పొందుతాం.
అలాగే ఆసనాలైన పాద హస్తాసనం, జాను శిరాసనం, ఉష్ట్రాసనం లాంటివి చేయడంతో పాటు ప్రతిరోజూ యోగనిద్ర కూడా చేయాలి. ఉష్ణక్రియ, సమశీతోష్ణక్రియ, శీతలీక్రియలుగా ప్రాణాయామాలు విభజింపబడ్డాయి. ఉష్ణక్రియ ప్రాణాయామాలు (శరీరంలో ఉష్ణాన్ని జనింపచేసేవి. ఇవి చలికాలానికి మంచివి). సమశీతోష్ణక్రియ ప్రాణాయామాలు సీజన్స్ మారే సమయంలో మంచివి. శరీరాన్ని చల్లబరచడానికి చంద్రభేది, అనులోమ విలోమ, శీతలీ, శీతకారి, ఉజ్జయి ప్రాణాయామాలు ఉపకరిస్తాయి. ఈ కోవకు చెందిన ప్రాణాయమాలు ఈ వారం తెలుసుకుందాం...
1. చంద్రబేధి ప్రాణాయామం
అర్ధ పద్మాసనం లేదా సుఖాసనంలో కూర్చోవాలి. వెన్నెముక, మెడ నిటారుగా ఉంచి ఎడమచెయ్యిని ధ్యానముద్ర (చూపుడు వేలు చివరభాగం బొటవేలు చివరభాగానికి తాకించి) లేదా చిన్ముద్ర (చూపుడు వేలు చివరభాగం బొటనవేలు మధ్యభాగానికి తాకించి)లో ఉంచి, కుడిచేతిని నాసికా ముద్ర లేదా నాసాగ్రముద్రలో లేదా మధ్యలో మూడు వేళ్లు మడిచి బొటన వేలు చిటికెన వేలితో నాసిక రంధ్రాలను మూస్తూ చేయాలి.
చేసే విధానం: కుడి ముక్కు రంధ్రాన్ని మూసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ, శ్వాస తీసుకున్న తరువాత ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసి ఉంచి కుడి ముక్కు రంధ్రాన్ని తెరిచి కుడి ముక్కు ద్వారా శ్వాసను బయటకు వదలాలి. మళ్లీ ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకుని కుడి ముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాలి. ఈ విధంగా 5 లేదా 10 సార్లు రిపీట్ చేయాలి.
గమనిక: రైట్ హ్యాండర్స్ కుడి చేత్తో, లెఫ్ట్ హ్యాండర్స్ ఎడమచేత్తో చేయవచ్చు. కుడిచేత్తో చేసేటట్లయితే కుడిముక్కు రంధ్రాన్ని మూయడానికి తెరవడానికి బొటనవేలును ఉపయోగిస్తారు. ఎడమచేతి వాటం ఉన్నవాళ్ళు చిటికెన వేలుతో కుడి ముక్కు రంధ్రాన్ని తెరవడం, మూయడం చేస్తారు.
ఉపయోగాలు: ఎడమ ముక్కు నుంyì శ్వాస తీసుకుంటాం కనుక మెదడులోని కుడి గోళార్ధానికి ఆక్సిజన్ ఎక్కువగా పంపబడి మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. స్ట్రెస్, టెన్షన్స్, హై బీపి, ఎమోషనల్ ఇన్‌బ్యాలెన్స్ వంటి సమస్యలకు చాలా మంచిది. క్రియేటివ్ థింకింగ్, ప్యారల్లెట్ ప్రాసెసింగ్‌కి ఉపయోగించే కుడి మెదడు పనితీరు మెరుగవడానికి ఉపయోగపడుతుంది.
2. విభాగ ప్రాణాయామం
ఊపిరితిత్తులు మూడు భాగాలుగా (అప్పర్, మిడిల్, లోయర్), ఎడమ ఊపిరితిత్తులలో రెండు భాగాలుగా (అప్పర్, లోయర్) విభజింపబడి ఉంటాయి. ఊపిరితిత్తులలో అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను అందించడానికి చేసే ప్రాణాయామాలే విభాగ ప్రాణాయామాలు. పక్కన చూపించిన విధంగా ఆసనంలో కూర్చుని మోచేతుల పొజిషన్‌ను పైకి పక్కలకు కిందకు చూపిస్తూ, ప్రతి పొజిషన్‌లో 5 లేదా 10 సార్లు రిపీట్ చేస్తూ చేయాలి. విభాగ ప్రాణాయామాలు చేసే పలు విధానాలలో పైన చెప్పబడినవి ఒక విధానం. తీసుకునే ఆహారంలో ముఖ్యంగా గమనించదగినది – క్షారతత్వం గల పదార్థాలను ఆమ్లతత్వం గల పదార్థాలను 60:40 నిష్ఫత్తిలో తీసుకోవడం ముఖ్యం.
క్షారతత్వం కలవి: పచ్చికూరలు, సగం ఉడికిన కూరగాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ మొదలైనవి.
ఆమ్లతత్వం కలవి: వెన్న తీయని పాలు, వెన్న, వైట్ బ్రెడ్, మాంసం, గుడ్లు, చీజ్ శరీరం డీ–హైడ్రేట్ కాకుండా తగినన్ని నీళ్లు, జ్యూసులు తాగడం ఎంతైనా అవసరం. ప్రతి కిలోగ్రాము శరీర బరువుకు 60 ఎం.ఎల్ నీళ్లు లేదా ద్రవపదార్థాలు తీసుకోవాలి. అధిక అమ్లతత్వం గల ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలోని వివిధ వ్యవస్థలలో పిహెచ్ ఇన్‌బ్యాలెన్స్‌కి దారి తీస్తుంది. పిహెచ్ బాలెన్స్ కాకపోతే అది దీర్ఘకాలంలో యూరిక్ యాసిడ్‌గా మారి కిడ్నీ స్టోన్స్, క్యాన్సర్, కాలేయం, గుండె సమస్యలకు దారి తీస్తుంది.
సమన్వయం: సత్యబాబు