పరమహంస యోగానంద
యోగి కథ
పాశ్చాత్య ప్రపంచానికి యోగ విద్యా విశిష్టతను పరిచయం చేసిన యోగిపుంగవుడు పరమహంస యోగానంద. మహావతార్ బాబా శిష్యపరంపరకు చెందిన యుక్తేశ్వర గిరి వద్ద క్రియాయోగ సాధనలో మెలకువలు తెలుసుకుని, ఈ విద్యను ప్రచారం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో పర్యటనలు సాగించారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో 1893 జనవరి 5న జన్మించిన పరమహంస యోగానంద అసలుపేరు ముకుందలాల్ ఘోష్. బాల్యం నుంచే భక్తి భావాలు కలిగిన యోగానంద యోగవిద్యను తెలుసుకునేందుకు పలువురు సాధువులను, సన్యాసులను కలుసుకున్నారు. చివరకు తన పదిహేడో ఏట గురువు యుక్తేశ్వర గిరిని కలుసుకోగలిగారు. యుక్తేశ్వర గిరి వద్ద యోగ శిక్షణ పొందుతూనే, మరోవైపు కోల్‌కతాలో ఉన్నత విద్యనూ కొనసాగించారు. సెరామ్‌పూర్ కాలేజీ నుంచి 1915లో డిగ్రీ పూర్తి చేశారు. రెండేళ్ల తర్వాత పశ్చిమబెంగాల్‌లోని డిహికాలో తొలి యోగ పాఠశాలను స్థాపించారు. ఆ మరుసటి ఏడాదే రాంచీలో మరో యోగ పాఠశాలను స్థాపించారు.
అదే తర్వాతి కాలంలో భారత యోగా సత్సంగ సంఘంగా రూపొందింది. గురువు అనుమతితో 1920లో నౌకాయానం ద్వారా అమెరికా చేరుకుని, అక్కడ భారతీయ యోగ విద్యకు విశేష ప్రచారం కల్పించారు. ‘ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి’ పేరిట పరమహంస యోగానంద రచించిన ఆత్మకథ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పాఠకాదరణ పొందుతోంది. కేవలం ఈ పుస్తకం చదివిన తర్వాత క్రియాయోగం వైపు మళ్లిన వారు ప్రపంచవ్యాప్తంగా చాలామందే ఉన్నారు.