రెక్కలు తొడిగిన ఆశయం
ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఎంతో కీలకం. ప్రాజెక్ట్ వర్క్ అంటే ఏదో తూతూ మంత్రంగా పని కానిచ్చేయకుండా.. కొత్తగా కనిపెట్టాలని భావించారా విద్యార్థులు. ముందుగా సోలార్ వాహనం తయారు చేద్దాం అనుకున్నారు. అంతకుమించి మరేదైనా అయితే బెటరనుకుని బ్యాటరీ బైక్ కిక్ కొడదామనుకున్నారు. అంతకుమించి ఏదైనా ఆవిష్కరించాలనుకున్నారు.. వారి ఆలోచనల నుంచి వచ్చిందే ఈ మైక్రోలైట్ ఎయిర్ క్రాఫ్ట్. రెండేళ్ల కిందట పుట్టిన ఎయిర్ క్రాఫ్ట్ ఐడియా.. ఇటీవల రెక్కలు విరుచుకుని గాల్లోకి ఎగిరి వారి ఆశలను ఆశయాల దిశగా దూసుకుపోయేలా చేసింది.
- ఆలేటి రాజేందర్‌రెడ్డి, మణికొండ
గండిపేట్‌లోని చైతన్యభారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువుతున్న కొందరు విద్యార్థులు ప్రాజెక్ట్ వర్క్ కోసం ఒక్కటయ్యారు. సాయికిరణ్ ఆధ్వర్యంలో అఖిల్‌చంద్ర, కేశల్ స్వాప్నిల్, శ్యామ్‌రెడ్డి, సాయికుమార్, అనురాగ్, సంయుక్త, హిమబిందు, శ్రావ్యలు కలసి టీమ్‌గా ఏర్పడ్డారు. పేపర్ మీద ఎయిర్‌క్రాఫ్ట్ డిజైన్ గీసుకున్నారు. ఆ ప్లాన్‌ను ఇంప్లిమెంట్ చేస్తే.. రూ.లక్షల్లో ఖర్చవుతుంది. తామనుకున్న దాని కంటే తక్కువ ఖర్చుతోనే మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్ చేసి చూపించాలనుకున్నారు.
ఎయిర్ కరిజ్మా..
విమానాల తయారీ, అవి ఎలా ఎగురుతాయో పరిశోధన చేశారు. పలు జర్నల్స్ చదవడంతో పాటు సంబంధిత రంగంలోని పలువురు ప్రముఖుల అనుభవాలను అధ్యయనం చేశారు. కరిజ్మా బైక్ ఇంజిన్ (220 సీసీ) తీసుకున్నారు. బైక్‌కు చెందిన మరికొన్ని భాగాలనూ ఇందులో వాడుకున్నారు. కావాల్సిన విడి భాగాలన్నీ కొనుగోలు చేశారు. కలసికట్టుగా బైక్ ఇంజిన్‌ను ఏకంగా విమాన యంత్రంగా మార్చేశారు. మైక్రోలైట్ బాడీ వెల్డింగ్ పనులు లంగర్‌హౌస్‌లో చేయించారు. మొత్తానికి 10 మీటర్ల వెడల్పు ఉన్న ఈ ఎయిర్‌క్రాఫ్ట్ బరువు 150 కిలోలు.
దీని తయారీకి అయిన ఖర్చు రూ.2.18 లక్షలు. ఎనిమిది నెలల కిందట రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీలో ఎయిర్‌క్రాఫ్ట్ ట్రయల్స్ వేశారు. వారి అంచనాలు తప్పాయి. విమానం ఎగరడంలో కొన్ని సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. బుల్లి క్రాఫ్ట్ ఎగిరేందుకు ససేమిరా అంది. మళ్లీ అధ్యయనంలో పడ్డారు. లోపాలు సరిదిద్ది ఇటీవల మరోసారి ప్రయోగం చేశారు. అది ఎంచక్కా ఎగరడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ‘రెండేళ్లు ఎంతో కష్టపడ్డాం. మొదటి ప్రయత్నంలో పని చేయకపోతే నిరుత్సాహపడలేదు. మరింత పట్టుదలతో పని చేసి విజయం సాధించాం’ అని ఆనందంగా చెబుతాడు కేశల్ స్వాప్నిల్.
లీటర్‌కు 8 కిలోమీటర్లు..
‘ఈ మైక్రోలైట్ ఎయిర్ క్రాఫ్ట్ లీటర్ పెట్రోల్‌తో ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 20 అడుగుల ఎత్తు వరకు ఎగురగలద’ని తెలిపాడు సాయికిరణ్. ‘దీన్ని మరింత ఆధునీకరిస్తే సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంద’ని చెబుతోంది మరో విద్యార్థిని హిమబిందు. ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాజెక్ట్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి, హెచ్‌వోడీ రవీందర్‌రెడ్డి ఈ విద్యార్థులకు వెన్నుదన్నుగా నిలిచారు. ‘విద్యార్థులు తయారు చేసిన ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ను మరింత ఆధునీకరిస్తే ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఆస్ట్రేలియాలో ఇలాంటి ఎయిర్‌క్రాఫ్ట్‌లను వ్యవ సాయ, ఇతర పనులలో వినియోగిస్తున్నారు’ అని తెలిపారు రవీందర్‌రెడ్డి.
మెరుగుపరిస్తే.. మరిన్ని ఫలితాలు
తాము రూపొందించిన ఎయిర్‌క్రాఫ్ట్‌ను సాంకేతికంగా మరింత మెరుగుపరిస్తే అద్భుత ఫలితాలనిస్తుందని విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. ఉదాహరణకు శాంతిభద్రతల రక్షణ రూపేణా పెట్రోలింగ్ వాహనాలు, సీసీ కెమెరాల వంటి వాటిపై భారీగా వ్యయం చేస్తున్నారు. అదే తాము రూపొందించిన క్రాఫ్ట్‌కు ఇంజన్ సామర్థ్యాన్ని ఇంకొంత పెంచి సిగ్నలింగ్ వ్యవస్థను జతచేసి, సీసీ కెమెరాలను అమర్చితే కనుక నగరం మొత్తం ఈ ఎయిర్‌క్రాఫ్ట్ నిఘా వ్యవస్థ కిందకు వస్తుందని వీరంటున్నారు. గణేశ్ నిమజ్జనోత్సవం వంటి సందర్భాల్లో మంచి ఫలితాలనిస్తుందని, ట్రాఫిక్ స్థితిగతులను చక్కగా పర్యవేక్షించవచ్చని చెబుతున్న వీరి ఆశయం మరిన్ని రెక్కలు తొడుక్కోవాలని ఆశిద్దాం.