microlight Aircraft
-
హైదరాబాద్ చేరుకున్న ‘ఫ్లయింగ్ రాబిట్స్’
సాక్షి, హైదరాబాద్: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, 11వ ఆర్మీ సర్వీస్ కార్ప్స్ రీయూనియన్ వేడుకల్లో భాగంగా నవంబర్ 30న గయలో ప్రారంభమైన ఆర్మీ మైక్రోలైట్ ఎక్స్‌పెడిషన్ బృందం ఆదివారం హకీంపేట్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చేరింది. ఈ బృందం 17 రోజుల్లో 5000 కి.మీ ప్రయాణించనుంది. సాహసయాత్రలను చేపట్టే ‘ఫ్లయింగ్ రాబిట్స్’బృందంతో గయలోని నోడల్ సెంటర్ (మైక్రోలైట్) ఆర్మీ స్టాఫ్ డిప్యూటీ చీఫ్ ఆధ్వర్యంలో ఈ యాత్రను ప్రారంభించారు. ఇందులోభాగంగా తక్కువ బరువున్న నాలుగు విమానాలు బిహార్, ఉత్తరప్రదేశ్‌లోని కొండ ప్రాంతాలు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని మైదాన ప్రాంతాల మీదుగా ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ పయనిస్తాయి. హైదరాబాద్‌కు చేరిన ఫ్లయింగ్ రాబిట్స్ బృందానికి ఆర్మీ ఆధ్యర్యంలో ఘనస్వాగతం పలికారు. -
రెక్కలు తొడిగిన ఆశయం
ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఎంతో కీలకం. ప్రాజెక్ట్ వర్క్ అంటే ఏదో తూతూ మంత్రంగా పని కానిచ్చేయకుండా.. కొత్తగా కనిపెట్టాలని భావించారా విద్యార్థులు. ముందుగా సోలార్ వాహనం తయారు చేద్దాం అనుకున్నారు. అంతకుమించి మరేదైనా అయితే బెటరనుకుని బ్యాటరీ బైక్ కిక్ కొడదామనుకున్నారు. అంతకుమించి ఏదైనా ఆవిష్కరించాలనుకున్నారు.. వారి ఆలోచనల నుంచి వచ్చిందే ఈ మైక్రోలైట్ ఎయిర్ క్రాఫ్ట్. రెండేళ్ల కిందట పుట్టిన ఎయిర్ క్రాఫ్ట్ ఐడియా.. ఇటీవల రెక్కలు విరుచుకుని గాల్లోకి ఎగిరి వారి ఆశలను ఆశయాల దిశగా దూసుకుపోయేలా చేసింది. - ఆలేటి రాజేందర్‌రెడ్డి, మణికొండ గండిపేట్‌లోని చైతన్యభారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువుతున్న కొందరు విద్యార్థులు ప్రాజెక్ట్ వర్క్ కోసం ఒక్కటయ్యారు. సాయికిరణ్ ఆధ్వర్యంలో అఖిల్‌చంద్ర, కేశల్ స్వాప్నిల్, శ్యామ్‌రెడ్డి, సాయికుమార్, అనురాగ్, సంయుక్త, హిమబిందు, శ్రావ్యలు కలసి టీమ్‌గా ఏర్పడ్డారు. పేపర్ మీద ఎయిర్‌క్రాఫ్ట్ డిజైన్ గీసుకున్నారు. ఆ ప్లాన్‌ను ఇంప్లిమెంట్ చేస్తే.. రూ.లక్షల్లో ఖర్చవుతుంది. తామనుకున్న దాని కంటే తక్కువ ఖర్చుతోనే మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్ చేసి చూపించాలనుకున్నారు. ఎయిర్ కరిజ్మా.. విమానాల తయారీ, అవి ఎలా ఎగురుతాయో పరిశోధన చేశారు. పలు జర్నల్స్ చదవడంతో పాటు సంబంధిత రంగంలోని పలువురు ప్రముఖుల అనుభవాలను అధ్యయనం చేశారు. కరిజ్మా బైక్ ఇంజిన్ (220 సీసీ) తీసుకున్నారు. బైక్‌కు చెందిన మరికొన్ని భాగాలనూ ఇందులో వాడుకున్నారు. కావాల్సిన విడి భాగాలన్నీ కొనుగోలు చేశారు. కలసికట్టుగా బైక్ ఇంజిన్‌ను ఏకంగా విమాన యంత్రంగా మార్చేశారు. మైక్రోలైట్ బాడీ వెల్డింగ్ పనులు లంగర్‌హౌస్‌లో చేయించారు. మొత్తానికి 10 మీటర్ల వెడల్పు ఉన్న ఈ ఎయిర్‌క్రాఫ్ట్ బరువు 150 కిలోలు. దీని తయారీకి అయిన ఖర్చు రూ.2.18 లక్షలు. ఎనిమిది నెలల కిందట రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీలో ఎయిర్‌క్రాఫ్ట్ ట్రయల్స్ వేశారు. వారి అంచనాలు తప్పాయి. విమానం ఎగరడంలో కొన్ని సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. బుల్లి క్రాఫ్ట్ ఎగిరేందుకు ససేమిరా అంది. మళ్లీ అధ్యయనంలో పడ్డారు. లోపాలు సరిదిద్ది ఇటీవల మరోసారి ప్రయోగం చేశారు. అది ఎంచక్కా ఎగరడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ‘రెండేళ్లు ఎంతో కష్టపడ్డాం. మొదటి ప్రయత్నంలో పని చేయకపోతే నిరుత్సాహపడలేదు. మరింత పట్టుదలతో పని చేసి విజయం సాధించాం’ అని ఆనందంగా చెబుతాడు కేశల్ స్వాప్నిల్. లీటర్‌కు 8 కిలోమీటర్లు.. ‘ఈ మైక్రోలైట్ ఎయిర్ క్రాఫ్ట్ లీటర్ పెట్రోల్‌తో ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 20 అడుగుల ఎత్తు వరకు ఎగురగలద’ని తెలిపాడు సాయికిరణ్. ‘దీన్ని మరింత ఆధునీకరిస్తే సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంద’ని చెబుతోంది మరో విద్యార్థిని హిమబిందు. ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాజెక్ట్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి, హెచ్‌వోడీ రవీందర్‌రెడ్డి ఈ విద్యార్థులకు వెన్నుదన్నుగా నిలిచారు. ‘విద్యార్థులు తయారు చేసిన ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ను మరింత ఆధునీకరిస్తే ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఆస్ట్రేలియాలో ఇలాంటి ఎయిర్‌క్రాఫ్ట్‌లను వ్యవ సాయ, ఇతర పనులలో వినియోగిస్తున్నారు’ అని తెలిపారు రవీందర్‌రెడ్డి. మెరుగుపరిస్తే.. మరిన్ని ఫలితాలు తాము రూపొందించిన ఎయిర్‌క్రాఫ్ట్‌ను సాంకేతికంగా మరింత మెరుగుపరిస్తే అద్భుత ఫలితాలనిస్తుందని విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. ఉదాహరణకు శాంతిభద్రతల రక్షణ రూపేణా పెట్రోలింగ్ వాహనాలు, సీసీ కెమెరాల వంటి వాటిపై భారీగా వ్యయం చేస్తున్నారు. అదే తాము రూపొందించిన క్రాఫ్ట్‌కు ఇంజన్ సామర్థ్యాన్ని ఇంకొంత పెంచి సిగ్నలింగ్ వ్యవస్థను జతచేసి, సీసీ కెమెరాలను అమర్చితే కనుక నగరం మొత్తం ఈ ఎయిర్‌క్రాఫ్ట్ నిఘా వ్యవస్థ కిందకు వస్తుందని వీరంటున్నారు. గణేశ్ నిమజ్జనోత్సవం వంటి సందర్భాల్లో మంచి ఫలితాలనిస్తుందని, ట్రాఫిక్ స్థితిగతులను చక్కగా పర్యవేక్షించవచ్చని చెబుతున్న వీరి ఆశయం మరిన్ని రెక్కలు తొడుక్కోవాలని ఆశిద్దాం. -
3 లక్షలతో మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్!
సీబీఐటీ విద్యార్థుల సృష్టి.. త్వరలోనే అధికారిక ప్రయోగం హైదరాబాద్: అది చూసేందుకు మూడు చక్రాలతో చిన్నపాటి ఆటోను పోలి ఉంటుంది. స్టార్ట్ చేస్తే కొద్ది దూరం ఆటోమాదిరి పరుగెత్తి ఆ తరువాత విమానంలా గాలిలోకి లేస్తుంది. అలా ప్రయాణిస్తూ నగర వీక్షణం చేయొచ్చు. ఈ ‘క్రాఫ్ట్’ను చైతన్యభారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు రూపొందించారు. సీబీఐటీ మెకానికల్ విభాగంలో ఇంజనీరింగ్ చివరి ఏడాది చదువుతున్న సాయికిరణ్ నేతృత్వంలో అఖిల్‌చంద్ర, కేశల్ స్వాప్నిల్, శ్యాంరెడ్డి, సాయికుమార్, అనురాగ్, సంయుక్త, హిమబిందు, శ్రావ్య అనే తొమ్మిది మంది ఈ మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను రూపొందించారు. తక్కువ పెట్రోల్‌తో ఒక వ్యక్తి గాలిలో ఏరియల్ సర్వే నిర్వహించేందుకు ఇది ఉపకరిస్తుంది. దీన్ని మరింత అభివృద్ధి చేస్తే పోలీసులు, ఆర్మీ వినియోగించవచ్చని, దీని కోసం రూ. 2.18 లక్షలు ఖర్చయిందని, మరో రూ.లక్ష వెచ్చిస్తే పూర్తి స్థాయిలో పనిచేస్తుందని విద్యార్థులు తెలిపారు. అది పూర్తికాగానే డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారి అనుమతి తీసుకుని అధికారికంగా ప్రయోగిస్తామని విద్యార్థులు తెలిపారు. తమకు మెకానికల్ హెచ్ఓడీ పి. రవీందర్‌రెడ్డి, సహాయ ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి సహకరించారని తెలిపారు. ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ను కళాశాల ఆవరణలో ప్రదర్శనకు ఉంచారు. -
వాండర్ టీమ్
వారు గ్రామీణ నేపథ్యమున్న విద్యార్థులు. అయితేనేం వారి ప్రతిభ గగనతలంలో ఘనతను చాటింది. ఉరిమే ఉత్సాహం ఊరికే ఉండనీయలేదు. ఏదైనా సాధించాలన్న తపన ఎప్పుడూ వెంటాడేది. మదిలో పుట్టిన ఓ ఐడియా వారి జీవితాన్నే మార్చింది. సినిమాలు, షికార్లకు గుడ్ బై చెప్పి ఆలోచనకు జీవం పోశారు. చదువుకుంటూనే నూతన ఆవిష్కరణకు నాంది పలికారు. పట్టుదలే పెట్టుబడిగా ముందుకు సాగారు. అంతే! వారి ఆశల ప్రతిరూపం.. ఎయిర్‌క్రాఫ్ట్ గగనతలంలో రయ్యిమంటూ దూసుకెళ్లింది. వారే శ్రీనిధి ‘సెవెన్ వండర్స్’... కటకం సంతోష్, సముద్రాల సంతోష్, ఎం.ధీరజ్, టీవీకే సుభాష్, ఎస్.రాకేశ్, టి.అమిత్, వివేక్ జైశ్వాల్. వరంగల్ జిల్లా మర్రిపెడ బంగ్లాకు చెందిన కటకం సంతోష్ టీమ్ లీడర్. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్లోని శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టూడెంట్స్. 16 నెలలపాటు శ్రమించారు. 360 కిలోలు ఉండే ‘మాక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్’ను తయారు చేశారు. భూతలం నుంచి సుమారు కిలోమీటర్ ఎత్తులో ఎగరగలదు. ‘డీజీసీఏ అధికారులు మా ఫ్యాబ్రికేషన్‌లో ఏ లోపం లేదని నిర్ధారించి సర్టిఫికెట్ ఇస్తారనుకుంటున్నాం. పరికరాలకు అవసరమైన డబ్బు మేమే సమకూర్చుకున్నాం. వ్యయప్రయాసలకోర్చి సమన్వయం చేసుకుంటూ సక్సెస్ సాధించాం’ అన్నాడు కటకం సంతోష్. మార్చిన ‘మూడు’... ఇంజనీరింగ్ తొలి రెండేళ్లు సరదాగా గడిచింది. ఎంజాయ్ చేశారు.ఎక్కడికెళ్లాలన్నా ఈ ఏడుగురే ముందుండేది. సినిమాలు, షికార్లు మామూలే. ఏదో చేయాలన్న తపన కొత్త ఆలోచనకు పురికొల్పింది. దీని నుంచి ఉద్భవించిందే ‘మాక్రోలైట్ ఎయిర్ క్రాఫ్ట్’. పైసాపైసా పోగేసి అనుకున్నది సాధించారు. లక్ష్యాన్ని ఛేదించారు. బుల్లి విమానాన్ని గగనతలంలో విహరింపజేసేందుకు సిద్ధమయ్యారు. తయారీ ఇలా.. ‘టాటా నానో ఇంజిన్ 624 సీసీ, 38 పీఎస్, ట్రాస్ అల్యూమినియం పైప్‌లు వాడాం. బెంగళూరు నుంచి అల్యూమినియం అల్లాయ్ టైర్లు, ప్రొఫెల్లర్ బ్లేడ్(ఫ్యాన్) తెప్పించాం. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి బెంగళూరులోని ఏవియేషన్ సిస్టమ్స్ వాళ్లని కలిసి ఎలా పని చేయాలనే సలహాలు తీసుకున్నాం. గూగుల్ సెర్చ్ చేసి టెక్నిక్స్ నేర్చుకున్నాం. డిజైనింగ్ క్యాటియా అన్సిస్లో చేశాం. బాడీ లిఫ్ట్ ఫోర్స్ కోసం లో స్పీడ్ వింగ్ ప్రొఫైల్ వాడాం. లెఫ్ట్, రైట్ వింగ్ లెంత్ 12 ఫీట్. వింగ్ స్పాన్ 26.5 ఫీట్. టోటల్ బాడీ వెయిట్ 365 కేజీలు. పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ 25 లీటర్లు,’ అని సంతోష్ వివరించాడు. ‘ప్రస్తుతం మాక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను రన్‌వేపై నడుపుతున్నాం. ఇన్నాళ్లు మేం పడిన శ్రమకు ఫలితం దక్కడం ఎంతో ఆనందంగా ఉంది. ఆశించిన మేరకు కాలేజీ యాజమాన్యం ప్రోత్సహించింది. మా తల్లిదండ్రులు వెన్నుతట్టి ముందుకు నడిపించారు. వీరందరి ఆశీస్సులు, బాసటగా నిలువడం వల్లే ఈ రోజు ఎయిర్‌క్రాఫ్ట్ తయారు చేయగలిగాం’ అని టీమ్ మరో సభ్యుడు వివేక్ జైశ్వాల్ తెలిపారు. - వాంకె శ్రీనివాస్