3 లక్షలతో మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్!
సీబీఐటీ విద్యార్థుల సృష్టి.. త్వరలోనే అధికారిక ప్రయోగం
హైదరాబాద్: అది చూసేందుకు మూడు చక్రాలతో చిన్నపాటి ఆటోను పోలి ఉంటుంది. స్టార్ట్ చేస్తే కొద్ది దూరం ఆటోమాదిరి పరుగెత్తి ఆ తరువాత విమానంలా గాలిలోకి లేస్తుంది. అలా ప్రయాణిస్తూ నగర వీక్షణం చేయొచ్చు. ఈ ‘క్రాఫ్ట్’ను చైతన్యభారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు రూపొందించారు. సీబీఐటీ మెకానికల్ విభాగంలో ఇంజనీరింగ్ చివరి ఏడాది చదువుతున్న సాయికిరణ్ నేతృత్వంలో అఖిల్‌చంద్ర, కేశల్ స్వాప్నిల్, శ్యాంరెడ్డి, సాయికుమార్, అనురాగ్, సంయుక్త, హిమబిందు, శ్రావ్య అనే తొమ్మిది మంది ఈ మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను రూపొందించారు. తక్కువ పెట్రోల్‌తో ఒక వ్యక్తి గాలిలో ఏరియల్ సర్వే నిర్వహించేందుకు ఇది ఉపకరిస్తుంది. దీన్ని మరింత అభివృద్ధి చేస్తే పోలీసులు, ఆర్మీ వినియోగించవచ్చని, దీని కోసం రూ. 2.18 లక్షలు ఖర్చయిందని, మరో రూ.లక్ష వెచ్చిస్తే పూర్తి స్థాయిలో పనిచేస్తుందని విద్యార్థులు తెలిపారు. అది పూర్తికాగానే డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారి అనుమతి తీసుకుని అధికారికంగా ప్రయోగిస్తామని విద్యార్థులు తెలిపారు. తమకు మెకానికల్ హెచ్‌ఓడీ పి. రవీందర్‌రెడ్డి, సహాయ ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి సహకరించారని తెలిపారు. ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ను కళాశాల ఆవరణలో ప్రదర్శనకు ఉంచారు.