ఫేస్బుక్ వాడారో.. బుక్కయిపోయినట్లే!
ఫేస్బుక్ వాడకానికి బాగా అలవాటు పడిపోయారా? అయితే తస్మాత్ జాగ్రత్త. సోషల్ మీడియా ఆధారంగా జరిగే స్కాములకు మీరు బుక్కయిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందట. ఈ విషయాన్ని భారత సంతతికి చెందిన ఓ పరిశోధకుడు తాజాగా వెల్లడించారు. రిక్వెస్టులు పంపుతున్నవాళ్లు ఎవరో, అది దేనికి సంబంధించిన రిక్వెస్టో కూడా చూసుకోకుండానే ఆటోమేటిగ్గా వాటిని ఆమోదించేయడం అలవాటవుతుందని, ఇలాంటి వాళ్లమీదే ఎక్కువగా పిషింగ్ దాడులు జరుగుతాయని చెప్పారు. తరచు ఫ్రెండ్ రిక్వెస్టులు, ఇతర రిక్వెస్టులు పంపి వాటి ద్వారా ఆ సిస్టమ్ మీద నియంత్రణ తెచ్చుకుని, పాస్వర్డ్ లు అన్నీ సంగ్రహిస్తారని తెలిపారు.
ఫేస్బుక్ ఎక్కువగా ఉపయోగించేవాళ్లకు ఫ్రెండ్ కనెక్షన్లు ఎక్కువగా ఉంటాయని, సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించగలిగే శక్తిని వాళ్లు కోల్పోతారని అంటున్నారు. దీన్ని సైబర్ నేరగాళ్లు అవకాశంగా తీసుకుని తీవ్ర కుట్రలకు పాల్పడతారని డాక్టర్ అరుణ్ విశ్వనాథ్ తెలిపారు. ఆయన బఫెలో యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్కు చెందినవారు. ఫ్రెండ్ రిక్వెస్టులు పంపి, వాటి ద్వారా యూజర్లను తమ వలలోకి లాగేందుకు ఈ స్కాము వీరులు ప్రయత్నిస్తారని, ఫేస్బుక్కు అలవాటు పడినవాళ్లు ఆ వలలో ఉత్తినే పడిపోతారని చెప్పారు. యూజర్ నేమ్, పాస్వర్డ్ దగ్గర నుంచి క్రెడిట్ కార్డు వివరాల వరకు అన్నింటినీ ఈ పిషింగ్ ద్వారా వాళ్లు లాగేస్తారని, అందువల్ల సోషల్ మీడియా విషయంలో కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించాలని డాక్టర్ అరుణ్ విశ్వనాథ్ తెలిపారు.