హైదరాబాద్ హౌస్
దిల్లీ అశోకా రోడ్డులో ఉన్న హైదరాబాద్‌హౌస్... హైదరాబాద్ వారిదే! దిల్లీలోని అత్యంత అందమైన పురాతన భవనాల్లో ఇదొకటి. ఏడో నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆదేశాల మేరకు దీని నిర్మాణం 1930లో ప్రారంభించి... 1933 నాటికి పూర్తి చేశారు. బ్రిటిష్ పాలకుల ఏలుబడిలో వారి రాజధానిని కోల్‌కతా నుంచి దిల్లీకి మార్చే సమయంలో ప్రస్తుత భారత రాష్ట్రపతి నిలయం, పార్లమెంటు భవనం, సుప్రీంకోర్టు తదితర ప్రతిష్టాత్మకమైన భవనాల నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టారు. ఇందుకోసం ఆనాటి ప్రముఖ బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లుటిన్స్‌ను ప్రత్యేకంగా ఇంగ్లండ్ నుంచి పిలిపించారు. సరిగ్గా ఈ సమయంలో ఎడ్విన్ లుటిన్స్ సూచనల మేరకు హైదరాబాద్ హౌస్ నిర్మాణం బాధ్యత ఏడో నిజాం చేపట్టారు. ఆనాటి హైదరాబాద్ సంస్థానంలో గల ప్రముఖ ఇంజనీరు అలీ నవాబ్ జంగ్ పర్యవేక్షణలో కేవలం మూడేళ్లలో ఈ హౌస్ నిర్మాణం పూర్తి చేసిన ట్లు చరిత్రకారులు చెబుతారు. స్వాతంత్య్రానంతరం, 1948లో పోలీసుల చర్య తర్వాత హైదరాబాద్ హౌస్‌ను భారత ప్రభుత్వం స్వాధీనపరుచుకుంది.
నేడు పలు ప్రభుత్వ అధికార ఉన్నత స్థాయి సమావేశాలకు నిలయంగా హైదరాబాద్ హౌస్ అతిథ్యమిస్తోంది. ఇటీవల భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షునికి ప్రభుత్వం ఇక్కడే అతిథ్యమిచ్చింది. విశాలమైన ఈ భవన ప్రాంగణంలోని డైనింగ్ హాలు నేటికీ చూపరులను ఆకట్టుకుంటుంది. హైదరాబాద్ నిజాం ప్రభువు తన అతిథి గృహంగా నిర్మించుకున్న ఈ భవనాలను అప్పట్లో ప్యాలెస్ ఆఫ్ ది నిజామ్ ఆఫ్ హైదరాబాద్ అని పిలిచేవారు. బ్రిటిష్ పాలకుల రోజుల్లో మహారాజులు, సంస్థానాధీశులందరూ చాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ పేరిట దిల్లీలో తరచూ సమావేశమవుతుండేవారు.
ఈ సమావేశాలకు హాజరైనప్పుడు తగిన బస ఏర్పాటు అవసరమైన ఏడో నిజాం దిల్లీలో తన కోసం ప్రత్యేకంగా ఒక అతిధి గృహం నిర్మించుకున్నాడని చరిత్రకారుల అభిప్రాయం. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్, యావత్తు ప్రపంచంలోనే అత్యంత ధనకునిగా ఖ్యాతి గడించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ హౌస్‌ను మొఘల్, యూరోపియన్ ఆర్కిటెక్చర్‌తో, ఆకాశం నుంచి చూసే వారికి సీతాకోక చిలుక మాదిరిగా కనిపించేలా ఎంతో సుందరంగా నిర్మించారు. ఈ సుందర భవనంలో 36 విశాలమైన గదులున్నాయి. దిల్లీలోని ఇండియా గేట్‌కు వాయువ్యంగా, కొద్దిపాటి దూరంలోనే రాచరికపు ఠీవితో హైదరాబాద్ హౌస్ సొగసులీనుతుంటుంది.
- మల్లాది కృష్ణానంద్ malladisukku@gmail.com