జీ-20 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా ఢిల్లీలోని ‘హైదరాబాద్ హౌస్’లో ప్రధాని నరేంద్ర మోదీ, సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ కలుసుకున్నారు. 95 ఏళ్ల చరిత్ర కలిగిన ‘హైదరాబాద్ హౌస్’లో ప్రధాని మోదీని యువరాజు కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఢిల్లీలో హైదరాబాద్ హౌస్‌ను ఎవరు నిర్మించారో తెలుసా?
సంస్థానాధీశులు ఢిల్లీకి పరుగులు
స్వాతంత్య్రానికి ముందు భారతదేశంలో సుమారు 560 సంస్థానాలు ఉండేవి. ప్రతి సంస్థానానికి వాటి రాజులు, రాచరిక రాష్ట్రాలు, నవాబులు, నిజాంలు ఉండేవారు. నాటి రోజుల్లో స్థానికుల సమస్యలను వినేందుకు, వారితో సమన్వయం కోసం బ్రిటిష్ ప్రభుత్వం 1920లో 'ది ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్'ను ప్రారంభించింది. ఈ ఛాంబర్ సమావేశాలు ఢిల్లీలో జరుగుతుండేవి. దీంతో బ్రిటీష్ ప్రభుత్వం ఎప్పుడు పిలిచినా సంస్థానాధీశులు ఢిల్లీకి పరుగులు తీయాల్సి వచ్చేది. అయితే వారికి తగినట్లు అక్కడ సరైన ఏర్పాట్లు ఉండేవి కాదు.
ఎకరా భూమి రూ.5000 చొప్పున కొనుగోలు
ఆ సమయంలో మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ సంస్థానానికి నిజాంగా ఉండేవాడు. ఆయన ఢిల్లీలో తన స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపధ్యంలో భూమి కోసం అన్వేషణ ప్రారంభించారు. వైస్రాయ్ హౌస్ (ప్రస్తుతం రాష్ట్రపతి భవన్) సమీపంలోని 8.2 ఎకరాల స్థలాన్ని నిజాం కొనుగోలు చేశారు. అయితే ఆ భూమి కొద్దిగా తక్కువగా ఉందని భావించి, దానికి ఆనుకునివున్న ఓ భవనాన్ని కూడా కొనుగోలు చేశారు. అప్పట్లో నిజాం ఈ భూమిని ఎకరా రూ.5000 చొప్పున కొనుగోలు చేశారు.
‘వైస్రాయ్ హౌస్’ను పోలివుండేలా..
భూమిని కొనుగోలు చేసిన తర్వాత భవన నిర్మాణ మ్యాప్ తయారు చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీని బాధ్యతను నిజాం.. నాటి ప్రముఖ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లుటియన్స్‌కు అప్పగించారు. లుటియన్స్ ‘హైదరాబాద్ హౌస్’ కోసం ‘సీతాకోకచిలుక’ ఆకారంలో డిజైన్‌ను సిద్ధం చేశారు, ఇది దాదాపు ‘వైస్రాయ్ హౌస్’ను పోలి ఉంటుంది. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో దేశంలోనే అత్యంత ధనవంతుడైన నిజాం ‘హైదరాబాద్ హౌస్’కు తొలుత రూ.26 లక్షలు ఖర్చు చేయాలని అనుకున్నారు. అయితే ఆ తర్వాత ఈ మొత్తాన్ని రూ.50 లక్షలకు పెంచారు. ఆ రోజుల్లో బర్మా (ప్రస్తుతం మయన్మార్)కు చెందిన టేకు చెక్క నాణ్యమైనదిగా గుర్తింపు పొందింది. నిజాం ఈ భవన నిర్మాణానికి అవసరమైన కలపను అక్కడి నుంచి ఆర్డర్ చేశాడు. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్‌లు,ఇతర వస్తువులు న్యూయార్క్ నుండి ఆర్డర్ చేశారు.
ఇంటీరియర్ డెకరేషన్‌కు విదేశాల నుంచి ఆర్డర్లు
ఆ రోజుల్లో, లండన్‌లోని హాంప్టన్ అండ్ సన్స్ లిమిటెడ్, వారింగ్ అండ్ గిల్లో లిమిటెడ్ ఇంటీరియర్ డిజైనింగ్‌లో ప్రసిద్ధి చెందిన సంస్థలు. నిజాం ఈ రెండు కంపెనీలకు ‘హైదరాబాద్ హౌస్’ను అలంకరించే బాధ్యతను అప్పగించారు. అలంకారానికి లోటు రాకుండా ఉండేందుకు 1921లో ప్రపంచంలోని ప్రముఖ చిత్రకారులందరి నుంచి దాదాపు 17 పెయింటింగ్స్‌కు ఆర్డర్ ఇచ్చారు. అప్పట్లో ఈ పెయింటిగ్స్ ధర రూ.10,000 నుండి 20,000 వరకు ఉండేది. లాహోర్‌కు చెందిన ప్రముఖ చిత్రకారుడు అబ్దుల్ రెహ్మాన్ చుగ్తాయ్ తీర్చిదిద్దిన 30 పెయింటింగ్‌లను కూడా ఆర్డర్ చేశారు. వాటి విలువ రూ. 12,000. 'హైదరాబాద్ హౌస్' కోసం కార్పెట్‌లను ఇరాక్, టర్కీ, ఆఫ్ఘనిస్తాన్ నుండి తెప్పించారు. నిజాం హోదాకు తగినవిధంగా ఉండేలా ఒకేసారి 500 మంది అతిథులకు భోజన ఏర్పాట్లు చేసేందుకు వీలుగా వెండి ప్లేట్లు, కత్తులు, ఇతర వస్తువులను ఆర్డర్ చేశారు.
భవనాన్ని చూసిన నిజాం ఏమన్నారు?
1928 నాటికి ‘హైదరాబాద్ హౌస్’ పూర్తయింది. యూరోపియన్, మొఘల్ శైలిలో నిర్మితమైన ఈ భవనంలో మొత్తం 36 గదులు ఉన్నాయి. అందులో నాలుగు గదులు ‘జనానా’ అంటే మహిళలకు సంబంధించినవి. దాదాపు 10 ఏళ్లకు పూర్తయిన ఈ ‘హైదరాబాద్ హౌస్’లోకి అడుగుపెట్టినప్పుడు నిజాం ఎంతో బాధపడ్డారుట. నిజాంకు ఈ ‘హైదరాబాద్ హౌస్’ అస్సలు నచ్చక దానిని ‘గుర్రపుశాల’తో పోల్చారు. రూ. 50 లక్షలు ఖర్చు చేసినప్పటికీ ‘హైదరాబాద్ హౌస్’ అనేది కొన్ని చౌక భవనాల కాపీ మాత్రమే అని నిజాం పేర్కొన్నారట.
‘హైదరాబాద్ హౌస్’ ఇప్పుడు ఎవరిది?
స్వాతంత్ర్యం సిద్ధించాక సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యాయి. 1954లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ‘హైదరాబాద్ హౌస్’ని లీజుకు తీసుకుంది. ఇందుకు ప్రతిగా 1970ల వరకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి డబ్బు చెల్లిస్తూ వచ్చింది. అనంతరం కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక కేంద్రం, రాష్ట్ర మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన్ నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వానికి 7.56 ఎకరాల భూమిని ఇచ్చింది. దీంతో ‘హైదరాబాద్ హౌస్’ కేంద్రానికి సొంతమయ్యింది. ఇప్పుడు విదేశాంగ మంత్రిత్వ శాఖ హైదరాబాద్ హౌస్‌ను పర్యవేక్షిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment