indipendance
-
'స్వాతంత్య్రం' సాంగ్ లాంచ్ చేసిన తమ్మారెడ్డి భరద్వాజ
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదగా స్వాతంత్రం మా స్వాతంత్ర్యం అనే పాటను విడుదల చేశారు. ప్రజానాట్యమండలి రూపకల్పనలో ఎం శేషగిరి రచించిన ఈ పాటను శ్రీనివాస్ నందుల సంగీత సారధ్యంలో లక్ష్మణ్ పూడి పాడారు. సాంగ్‌ను లాంచ్ చేసిన అనంతరం తమ్మారెడ్డి భరద్వాజ ఇలా మాట్లాడారు.సాంగ్ విడుదల సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. 'స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు అయ్యింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మన దేశం ఆర్థికంగా, టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందింది. కానీ నిరక్షరాస్యత, పేదరికంలో చాలా కుటుంబాలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ పరిస్థితులు అన్నిటిని దృష్టిలో పెట్టుకుని లక్ష్మణ్ పూడి గారు స్వాతంత్ర్యం మీద చేసిన సాంగ్ అద్బుతంగా ఉంది.' అన్నారు. ప్రజానాట్యమండలి గాయకుడు లక్ష్మణ్ పూడి మాట్లాడుతూ.. 'నేను కారులో వెళుతున్నప్పుడు సిగ్నల్స్ దగ్గర భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న వారిని పలకరించాను. వారికి స్వాతంత్య్రం అంటే ఏమిటో తెలియదు. దేశం మీద ప్రేమతో ఇలాంటి నిరక్షరాస్యులను పాటతో మేల్కొల్పటానికి ఈ సాంగ్ చేయడం జరిగింది. సాంగ్ లాంచ్ చేసిన మా గురువు గారు భరద్వాజ్ గారికి కృతజ్ఞతలు' అని ఆయన అన్నారు. కార్యక్రమానికి సినిమా డైరెక్టర్ కర్రి బాలాజీ, వంశీ లక్ష్మణ్ పూడి తదితరులు హాజరయ్యారు. -
స్వాతంత్య్రాన్ని ఊహించిన ‘బోస్’ ఏం చేశారు?
భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పలువురు నేతలు కీలకపాత్ర పోషించారు. అయితే అటువంటి వారిలో ఒకరైన సుభాష్ చంద్రబోస్ పోషించిన పాత్ర ఎనలేనిది. ఈరోజు(జనవరి 23) నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి. 2021 సంవత్సరంలో బోస్ జయంతిని శౌర్య దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందే సుభాష్ చంద్రబోస్ భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారనే సంగతి మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశానికి 1947లో బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం లభించింది. అయితే దీనికి నాలుగేళ్ల క్రితమే సుభాష్ చంద్రబోస్ భారతదేశంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1943 అక్టోబరు 21న భారత్‌కు స్వాతంత్ర్యం రాకముందే బోస్ సింగపూర్‌లో ‘ఆజాద్ హింద్’ ప్రభుత్వాన్ని స్థాపించారు. తాను చేపట్టిన ఈ చర్యతో భారతదేశంలో బ్రిటిష్ పాలన ఎక్కువ కాలం సాగదని బ్రిటీష్ వారికి బోస్ సందేశం ఇచ్చారు. 1943, జూలై 4న సింగపూర్‌లోని క్యాథే భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో స్వాతంత్ర్య పోరాట యోధుడు రాస్ బిహారీ బోస్ ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ బాధ్యతలను సుభాష్ చంద్రబోస్‌కు అప్పగించారు. ఈ నేపధ్యంలో ఆజాద్ హింద్ ప్రభుత్వం 1943, అక్టోబర్ 21న స్థాపితమయ్యింది. జపాన్, ఫిలిప్పీన్స్, జర్మనీ తదితర తొమ్మిది దేశాల నుంచి కూడా ఈ ప్రభుత్వానికి గుర్తింపు వచ్చింది. ఈ ప్రభుత్వంలో సుభాష్ చంద్రబోస్ ప్రధానమంత్రిగా, విదేశాంగ మంత్రిగా, రక్షణ మంత్రిగా పనిచేసినట్లు సమాచారం. ఆర్థిక శాఖను ఎస్సి ఛటర్జీకి, ప్రచార విభాగాన్ని ఎస్ఎకి అప్పగించారు. ఈ తాత్కాలిక ప్రభుత్వం అనేక దేశాలలో రాయబార కార్యాలయాలను కూడా ప్రారంభించింది. ఆజాద్ హింద్ ఫౌజ్ తాత్కాలిక ప్రభుత్వం తపాలా స్టాంపులను కూడా విడుదల చేసింది. నేషనల్ ఆజాద్ బ్యాంక్, ఆజాద్ హింద్ రేడియో, రాణి ఝాన్సీ రెజిమెంట్లను కూడా ఏర్పాటు చేసింది. ఆ సమయంలో బోస్ ఆజాద్ హింద్ ఫౌజ్‌లో మహిళల విభాగాన్ని ఏర్పాటు చేశారు. నాటి మహిళా విభాగానికి చెందిన సైనికులు వైద్యం, గూఢచర్యంలో నిపుణులుగా పేరొందారు. ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ను 1915, అక్టోబరు 29న రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్, రాస్ బిహారీ బోస్, నిరంజన్ సింగ్ గిల్ స్థాపించారు. తర్వాత వారు దానిని సుభాష్ చంద్రబోస్‌కు అప్పగించారు. వివిధ నివేదికల ప్రకారం ఆ సమయంలో బోస్ సారధ్యంలో 85 వేల మంది సాయుధ సైనికులు ఉండేవారు. 1943 డిసెంబర్ 30న బ్రిటిష్ వారిని ఓడించిన తర్వాత అండమాన్ నికోబార్‌లో తొలిసారిగా ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. దీనికి సుభాష్ చంద్రబోస్ సారధ్యం వహించారు. -
ఆత్మగౌరవం గురించి బాపూజీ ఏమన్నారు?
సత్యం, అహింసల మార్గాన్ని అనుసరించి భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ. అక్టొబరు 2న జాతిపిత జన్మదినం. ప్రపంచంలోని చాలా మంది ప్రముఖులు నేటికీ గాంధీజీని తమ స్ఫూర్తిదాతగా భావిస్తారు. గాంధీజీలోని నాయకత్వ లక్షణాలు, అనుసరించిన విలువలు, ఆయన గుణగణాలు దేశాన్ని ఏకం చేయడానికి దోహదపడ్డాయి. బాపుజీ అనుసరించిన జీవన శైలిని నేటికీ విజయానికి ఉత్తమమైన మార్గంగా పరిగణిస్తారు. జాతిపిత జన్మదినోత్సవం సందర్భంగా ప్రతీఒక్కరికీ ఉపకరించే గాంధీజీ బోధనలలోని కొన్నింటిని ఇప్పుడు తెలుసుకుందాం. వ్యక్తి ఆలోచనలే అతనిని తీర్చిదిద్దుతాయి. అందుకే మనం ఏమనుకుంటామో అదే అవుతాం. మనం చేసే ఏ ఒక్క పని అయినా ఎవరికైనా సంతోషాన్ని కలిగించగలిగితే, అది వేలమంది తలలు వంచి చేసే ప్రార్థన కన్నా ఉత్తమమైనది. జీవితంలో చాలా సార్లు ప్రత్యర్థిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఎదుటివారిని ప్రేమతో గెలిచే ప్రయత్నం చేయాలి. ఈ ప్రపంచంలో నిజమైన శాంతి నెలకొనాలంటే యుద్ధానికి వ్యతిరేకంగా నిజమైన పోరాటం జరగాలి. దీనిని మనం మన పిల్లలతోనే ప్రారంభించాలి. అప్పుడే నిజమైన శాంతి వర్ధిల్లుతుంది. ఈ భూమిపై ఎప్పటికీ జీవించాలి అన్నట్లుగా మీ జీవితాన్ని మలచుకోండి. బలం అనేది శారీరక సామర్థ్యాల నుండి కాదు.. అసమానమైన సంకల్ప శక్తి నుండి సమకూరుతుంది. కాబట్టి మీ సంకల్ప శక్తిని బలంగా ఉండనివ్వండి. ఎవరినైనా కోల్పోయే వరకు వారి ప్రాముఖ్యతను చాలామంది అర్థం చేసుకోలేరు. అందుకే ముందుగానే ఎదుటివారి ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి. ఏదైనా పని చేసే ముందే దానిగురించి ఆలోచించండి. పని చేసిన తరువాత మీరు ఎంత ప్రయత్నించినా, మీ పనుల ఫలితాలు ఎలా ఉంటాయో ఎప్పటికీ తెలుసుకోలేరు. అందుకే మీరు చేసే పనిపైన మాత్రమే దృష్టి పెట్టండి. ఎవరైనా సరే ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోవడం కంటే పెద్ద నష్టం మరొకటి లేదు. అందుకే మీ ఆత్మగౌరవాన్ని మీరే కాపాడుకోండి. ఇది కూడా చదవండి: త్వరలో ప్రతి రైలులో ‘పాతాళ గంగ’.. అడక్కుండానే వాడుక నీరు! -
‘హైదరాబాద్ హౌస్’ యజమాని ఎవరు? డబ్బును నీళ్లలా ఎందుకు ఖర్చు చేశారు?
జీ-20 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా ఢిల్లీలోని ‘హైదరాబాద్ హౌస్’లో ప్రధాని నరేంద్ర మోదీ, సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ కలుసుకున్నారు. 95 ఏళ్ల చరిత్ర కలిగిన ‘హైదరాబాద్ హౌస్’లో ప్రధాని మోదీని యువరాజు కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఢిల్లీలో హైదరాబాద్ హౌస్‌ను ఎవరు నిర్మించారో తెలుసా? సంస్థానాధీశులు ఢిల్లీకి పరుగులు స్వాతంత్య్రానికి ముందు భారతదేశంలో సుమారు 560 సంస్థానాలు ఉండేవి. ప్రతి సంస్థానానికి వాటి రాజులు, రాచరిక రాష్ట్రాలు, నవాబులు, నిజాంలు ఉండేవారు. నాటి రోజుల్లో స్థానికుల సమస్యలను వినేందుకు, వారితో సమన్వయం కోసం బ్రిటిష్ ప్రభుత్వం 1920లో 'ది ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్'ను ప్రారంభించింది. ఈ ఛాంబర్ సమావేశాలు ఢిల్లీలో జరుగుతుండేవి. దీంతో బ్రిటీష్ ప్రభుత్వం ఎప్పుడు పిలిచినా సంస్థానాధీశులు ఢిల్లీకి పరుగులు తీయాల్సి వచ్చేది. అయితే వారికి తగినట్లు అక్కడ సరైన ఏర్పాట్లు ఉండేవి కాదు. ఎకరా భూమి రూ.5000 చొప్పున కొనుగోలు ఆ సమయంలో మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ సంస్థానానికి నిజాంగా ఉండేవాడు. ఆయన ఢిల్లీలో తన స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపధ్యంలో భూమి కోసం అన్వేషణ ప్రారంభించారు. వైస్రాయ్ హౌస్ (ప్రస్తుతం రాష్ట్రపతి భవన్) సమీపంలోని 8.2 ఎకరాల స్థలాన్ని నిజాం కొనుగోలు చేశారు. అయితే ఆ భూమి కొద్దిగా తక్కువగా ఉందని భావించి, దానికి ఆనుకునివున్న ఓ భవనాన్ని కూడా కొనుగోలు చేశారు. అప్పట్లో నిజాం ఈ భూమిని ఎకరా రూ.5000 చొప్పున కొనుగోలు చేశారు. ‘వైస్రాయ్ హౌస్’ను పోలివుండేలా.. భూమిని కొనుగోలు చేసిన తర్వాత భవన నిర్మాణ మ్యాప్ తయారు చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీని బాధ్యతను నిజాం.. నాటి ప్రముఖ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లుటియన్స్‌కు అప్పగించారు. లుటియన్స్ ‘హైదరాబాద్ హౌస్’ కోసం ‘సీతాకోకచిలుక’ ఆకారంలో డిజైన్‌ను సిద్ధం చేశారు, ఇది దాదాపు ‘వైస్రాయ్ హౌస్’ను పోలి ఉంటుంది. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో దేశంలోనే అత్యంత ధనవంతుడైన నిజాం ‘హైదరాబాద్ హౌస్’కు తొలుత రూ.26 లక్షలు ఖర్చు చేయాలని అనుకున్నారు. అయితే ఆ తర్వాత ఈ మొత్తాన్ని రూ.50 లక్షలకు పెంచారు. ఆ రోజుల్లో బర్మా (ప్రస్తుతం మయన్మార్)కు చెందిన టేకు చెక్క నాణ్యమైనదిగా గుర్తింపు పొందింది. నిజాం ఈ భవన నిర్మాణానికి అవసరమైన కలపను అక్కడి నుంచి ఆర్డర్ చేశాడు. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్‌లు,ఇతర వస్తువులు న్యూయార్క్ నుండి ఆర్డర్ చేశారు. ఇంటీరియర్ డెకరేషన్‌కు విదేశాల నుంచి ఆర్డర్లు ఆ రోజుల్లో, లండన్‌లోని హాంప్టన్ అండ్ సన్స్ లిమిటెడ్, వారింగ్ అండ్ గిల్లో లిమిటెడ్ ఇంటీరియర్ డిజైనింగ్‌లో ప్రసిద్ధి చెందిన సంస్థలు. నిజాం ఈ రెండు కంపెనీలకు ‘హైదరాబాద్ హౌస్’ను అలంకరించే బాధ్యతను అప్పగించారు. అలంకారానికి లోటు రాకుండా ఉండేందుకు 1921లో ప్రపంచంలోని ప్రముఖ చిత్రకారులందరి నుంచి దాదాపు 17 పెయింటింగ్స్‌కు ఆర్డర్ ఇచ్చారు. అప్పట్లో ఈ పెయింటిగ్స్ ధర రూ.10,000 నుండి 20,000 వరకు ఉండేది. లాహోర్‌కు చెందిన ప్రముఖ చిత్రకారుడు అబ్దుల్ రెహ్మాన్ చుగ్తాయ్ తీర్చిదిద్దిన 30 పెయింటింగ్‌లను కూడా ఆర్డర్ చేశారు. వాటి విలువ రూ. 12,000. 'హైదరాబాద్ హౌస్' కోసం కార్పెట్లను ఇరాక్, టర్కీ, ఆఫ్ఘనిస్తాన్ నుండి తెప్పించారు. నిజాం హోదాకు తగినవిధంగా ఉండేలా ఒకేసారి 500 మంది అతిథులకు భోజన ఏర్పాట్లు చేసేందుకు వీలుగా వెండి ప్లేట్లు, కత్తులు, ఇతర వస్తువులను ఆర్డర్ చేశారు. భవనాన్ని చూసిన నిజాం ఏమన్నారు? 1928 నాటికి ‘హైదరాబాద్ హౌస్’ పూర్తయింది. యూరోపియన్, మొఘల్ శైలిలో నిర్మితమైన ఈ భవనంలో మొత్తం 36 గదులు ఉన్నాయి. అందులో నాలుగు గదులు ‘జనానా’ అంటే మహిళలకు సంబంధించినవి. దాదాపు 10 ఏళ్లకు పూర్తయిన ఈ ‘హైదరాబాద్ హౌస్’లోకి అడుగుపెట్టినప్పుడు నిజాం ఎంతో బాధపడ్డారుట. నిజాంకు ఈ ‘హైదరాబాద్ హౌస్’ అస్సలు నచ్చక దానిని ‘గుర్రపుశాల’తో పోల్చారు. రూ. 50 లక్షలు ఖర్చు చేసినప్పటికీ ‘హైదరాబాద్ హౌస్’ అనేది కొన్ని చౌక భవనాల కాపీ మాత్రమే అని నిజాం పేర్కొన్నారట. ‘హైదరాబాద్ హౌస్’ ఇప్పుడు ఎవరిది? స్వాతంత్ర్యం సిద్ధించాక సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యాయి. 1954లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ‘హైదరాబాద్ హౌస్’ని లీజుకు తీసుకుంది. ఇందుకు ప్రతిగా 1970ల వరకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి డబ్బు చెల్లిస్తూ వచ్చింది. అనంతరం కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక కేంద్రం, రాష్ట్ర మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన్ నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వానికి 7.56 ఎకరాల భూమిని ఇచ్చింది. దీంతో ‘హైదరాబాద్ హౌస్’ కేంద్రానికి సొంతమయ్యింది. ఇప్పుడు విదేశాంగ మంత్రిత్వ శాఖ హైదరాబాద్ హౌస్‌ను పర్యవేక్షిస్తోంది. -
స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు
గోదావరిఖని : స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సింగరేణి యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. ఆర్జీ–1 పరిధిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో వివిధ పాఠశాలల విద్యార్థులు, ఎస్అండ్పీసీ గార్డులు, సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున హాజరయ్యే కార్యక్రమంలో ఆర్జీ–1 సీజీఎం సీహెచ్.వెంకటేశ్వర్రావు జెండా ఆవిష్కరణ చేస్తారు. ఇందుకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నారు. స్టేడియంలో జరుగుతున్న పనులను ఎస్‌ఓటూ సీజీఎం సుధాకర్‌రెడ్డి, సివిల్ డీజీఎం సూర్యనారాయణ, ఎస్ఎస్ఓ జాకీర్ హుస్సేన్ శనివారం పర్యవేక్షించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు, ఎస్అండ్పీసీ సెక్యూరిటీగార్డులు మార్చ్ఫాస్ట్ రిహార్సల్ చేయగా అధికారులు పరిశీలించారు. గతేడాది కన్నా భిన్నంగా ఈసారి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు యాజమాన్యం చర్యలు తీసుకుంటోంది.