భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పలువురు నేతలు కీలకపాత్ర పోషించారు. అయితే అటువంటి వారిలో ఒకరైన సుభాష్ చంద్రబోస్ పోషించిన పాత్ర ఎనలేనిది. ఈరోజు(జనవరి 23) నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి. 2021 సంవత్సరంలో బోస్ జయంతిని శౌర్య దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందే సుభాష్ చంద్రబోస్ భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారనే సంగతి మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
భారతదేశానికి 1947లో బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం లభించింది. అయితే దీనికి నాలుగేళ్ల క్రితమే సుభాష్ చంద్రబోస్ భారతదేశంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1943 అక్టోబరు 21న భారత్‌కు స్వాతంత్ర్యం రాకముందే బోస్ సింగపూర్‌లో ‘ఆజాద్ హింద్’ ప్రభుత్వాన్ని స్థాపించారు. తాను చేపట్టిన ఈ చర్యతో భారతదేశంలో బ్రిటిష్ పాలన ఎక్కువ కాలం సాగదని బ్రిటీష్ వారికి బోస్ సందేశం ఇచ్చారు.
1943, జూలై 4న సింగపూర్‌లోని క్యాథే భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో స్వాతంత్ర్య పోరాట యోధుడు రాస్ బిహారీ బోస్ ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ బాధ్యతలను సుభాష్ చంద్రబోస్‌కు అప్పగించారు. ఈ నేపధ్యంలో ఆజాద్ హింద్ ప్రభుత్వం 1943, అక్టోబర్ 21న స్థాపితమయ్యింది. జపాన్, ఫిలిప్పీన్స్, జర్మనీ తదితర తొమ్మిది దేశాల నుంచి కూడా ఈ ప్రభుత్వానికి గుర్తింపు వచ్చింది. ఈ ప్రభుత్వంలో సుభాష్ చంద్రబోస్ ప్రధానమంత్రిగా, విదేశాంగ మంత్రిగా, రక్షణ మంత్రిగా పనిచేసినట్లు సమాచారం. ఆర్థిక శాఖను ఎస్‌సి ఛటర్జీకి, ప్రచార విభాగాన్ని ఎస్‌ఎకి అప్పగించారు. ఈ తాత్కాలిక ప్రభుత్వం అనేక దేశాలలో రాయబార కార్యాలయాలను కూడా ప్రారంభించింది.
ఆజాద్ హింద్ ఫౌజ్ తాత్కాలిక ప్రభుత్వం తపాలా స్టాంపులను కూడా విడుదల చేసింది. నేషనల్ ఆజాద్ బ్యాంక్, ఆజాద్ హింద్ రేడియో, రాణి ఝాన్సీ రెజిమెంట్‌లను కూడా ఏర్పాటు చేసింది. ఆ సమయంలో బోస్ ఆజాద్ హింద్ ఫౌజ్‌లో మహిళల విభాగాన్ని ఏర్పాటు చేశారు. నాటి మహిళా విభాగానికి చెందిన సైనికులు వైద్యం, గూఢచర్యంలో నిపుణులుగా పేరొందారు.
‘ఆజాద్ హింద్ ఫౌజ్’ను 1915, అక్టోబరు 29న రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్, రాస్ బిహారీ బోస్, నిరంజన్ సింగ్ గిల్ స్థాపించారు. తర్వాత వారు దానిని సుభాష్ చంద్రబోస్‌కు అప్పగించారు. వివిధ నివేదికల ప్రకారం ఆ సమయంలో బోస్ సారధ్యంలో 85 వేల మంది సాయుధ సైనికులు ఉండేవారు. 1943 డిసెంబర్ 30న బ్రిటిష్ వారిని ఓడించిన తర్వాత అండమాన్ నికోబార్‌లో తొలిసారిగా ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. దీనికి సుభాష్ చంద్రబోస్ సారధ్యం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment