జనన మరణాలు
జ్యోతిర్మయం
జనన మరణాలు అనేవి సర్వప్రాణులకు సహజములే. పుట్టిన ప్రతివాడు ఎప్పుడో ఒకప్పుడు గిట్టక మానడు. మరణించిన వానికి కూడా పుట్టుక తప్పదు. ఈ జనన మరణాలు అనేవి వదిలించుకుంటే వదిలేవి కావు. అట్టి జనన మరణాలను గూర్చి దుఃఖించుట తగదని శ్రీకృష్ణపరమాత్మ అర్జునుడికి
‘‘జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మమృతస్యచ
తస్మాదపరిహార్యే ర్థే నత్వం శోచితుమర్హసి॥
చేసిన ఉపదేశం అన్ని కాలాలకు అన్ని ప్రాంతా లకు చెందిన వ్యక్తులందరికీ వర్తించేదే.
‘‘ఈ దేహాలన్నీ నశించేవే (అంతవంత ఇమే దోహాః). మానవుడు చినిగిన బట్టలను వదిలిపెట్టి, కొత్త బట్టలను ధరించినట్లు జీవుడు పాతబడినట్టి శరీరాలను వదిలి, నూతన శరీరాలను ధరిస్తాడు’’
అందుకే పండితులైన వారు ప్రాణాలు పోయిన వారి గురించి కాని, ప్రాణాలతో ఉండి సమస్య లతో సతమతమయ్యే వారిని గురించి కాని దుఃఖిం చరు అని శ్రీకృష్ణపరమాత్మ అర్జునునికి చేసిన ఉప దేశం అర్జునుడి వలె ప్రతినిత్యం పలు సందర్భాలలో దీనులై, బలహీనులై కర్తవ్య నిర్వహణ చేయలేక సంభ్ర మకు, మోహానికి గురైన వారందరికీ మార్గ నిర్దే శకంగా నిలుస్తుంది.
వాలి మరణాన్ని సహించలేక దుఃఖిస్తున్న తార కు, హనుమంతుడు కర్తవ్యోపదేశం చేస్తూ ‘‘ప్రాణుల జనన మరణాలు అనిశ్చితాలు. ఈ విషయం బుద్ధి మంతురాలవు అయిన నీకు తెలియనిది కాదు. నీవం టి బుద్ధిమంతులు అనిశ్చితాలైన విషయాలను గురించి విచారించకుండా శుభకార్యాలను ఎంపిక చేసుకొని, అట్టి వాటిని నెరవేర్చుటకై ప్రయత్నించాలి.’’
‘‘జానాస్యనియతామేవం భూతానామాగతింగతిమ్
తస్మాచ్ఛుభంహి కర్తవ్యం పండితేనైవ లౌకికమ్॥
అని హనుమంతుడు తారకు చేసిన ఉపదేశం సకల మానవాళికి శిరోధార్యమై నిలుస్తుంది. ప్రతి జీవుడి శరీరంలో బాల్యం, యౌవనం, ముసలితనం అనేవి ఎట్లా సహజమైనవో అట్లే ఒక శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని పొందడం కూడా సహజకృత్యమే. సర్వ సహజాలైన ఈ జనన మరణాల విషయంలో మోహా నికి గురికాకుండా ఉండేది ధీరుడొక్కడే.
అట్లాంటి ధీరస్వభావాన్ని మానవులందరూ అల వరచుకొనవలసిన అవసరం ఎంతైనా ఉంది. పుట్టిన ప్రతివారికి అనివార్యమైన మరణం గురించి పరితపిం చడం, దుఃఖంతో చిక్కిశల్యం కావటం తగదనే తత్త్వా న్ని గుర్తించగలగాలి. ఈ అశాశ్వతమైన దేహాన్ని శాశ్వ తమైన, పునరావృత్తి రహితమైన పరమానందభరి తమైన మోక్షసాధనకై వినియోగించాలి ‘‘అశాశ్వతేన దేహేన సాధనీయంహి శాశ్వతమ్’’ కాబట్టి, అశాశ్వత మైన ఈ మానవ దేహం సహకారంతో శాశ్వతమైన మోక్షాన్ని పొందాలి. అప్పుడే పూర్వపుణ్యం వల్ల లభిం చిన ఈ మానవ జన్మకు సార్థకత చేకూరుతుందనే పరమ సత్యాన్ని మన మనస్సులో బలంగా నాటుకునే ప్రయత్నం చేద్దాం.
సముద్రాల శఠగోపాచార్యులు