ప్రేమోపాసన | Jyotirmayam | Sakshi
Sakshi News home page

ప్రేమోపాసన

Published Mon, Feb 16 2015 2:45 AM | Last Updated on Sat, Sep 2 2017 9:23 PM

ప్రేమోపాసన

ప్రేమోపాసన

జ్యోతిర్మయం
 నంద వ్రజంలో ఒక గోపిక కొత్త ఇల్లు కట్టుకుంది. గృహ ప్రవేశానికి ఎందరో బంధువులు, ఆత్మీయులు వచ్చారు. వీళ్లేకాక ఆ గోపికకు ఎంతో ప్రియమైన ఒక ఇష్టసఖి కూడా బహుదూరం నుండి వచ్చింది. గృహ ప్రవేశానంతరం వాళ్లిద్దరూ యమునా నదీ స్నానానికి వెళ్లారు. జలకాలాడుతూ ఇష్టసఖి గోపికతో ‘చెలీ! నంద వ్రజంలో నివసించే మీరంతా ఎంతో అదృష్టవం తులు. శ్రీకృష్ణునితో రాసలీలలో పాల్గొనే మహద వకాశం మీకు ప్రాప్తించింది. అవునా!’ అని అన్నది. ‘నిజమే నేమో’ అన్నది గోపిక.

 ‘చెలీ రాసలీల జరిగిన ఆ ఒక్క రాత్రి ఆరు నెలల సాధా రణ రాత్రులతో సమానం అని అంటారు కదా! అంత సుదీర్ఘ కాలంలో శ్రీకృష్ణుడు ఎన్నిమార్లు తన బాహువల్లరిలో నిన్ను లాలించాడో చెప్పవా?’ అని అడిగింది కుతూహలంగా ఇష్టసఖి.
 గోపిక విలాసంగా నవ్వుతూ ‘సఖీ! రాసలీల తరగతి కాదు కదా, లెక్కల్నీ ఎక్కాల్నీ వల్లించటానికి! అది ఒక దుకాణం కాదు కదా, లెక్కలు సరిచూసుకోవ టానికి! శ్రీకృష్ణ ప్రేమ గణాంకాలకు అందేది కాదు. అది ఒక  అలౌకికమైన దివ్య రసానుభూతి. స్వామి సన్నిధికి చేరగానే నాకు శరీర సృ్పహ నశించింది.  అంతరంగం అంతరించిపోయింది. నా అహంభావం లీనమైపోయింది. నేను నేనుగా మిగలలేదు. ఇంక మిగిలింది పరమానందస్ఫూర్తియే! సత్‌చిత్ ఆనంద స్వరూపమే!’ అని అన్నది పరవశంగా.

 ‘అదృష్టవంతురాలివే చెలీ! ఆ దశకు చేరటానికి నువ్వు ఎంత జపాన్ని చేశావో? ఎన్ని వ్రతాల్ని అనుష్టిం చావో? ఎన్ని సత్కర్మల్ని చేశావో కదా!’ అని అన్నది ఇష్టసఖి. ‘సఖీ! నేనింత జపించాను, అంత ధ్యానిం చాను, ఇన్ని వ్రతాల్ని చేశాను అన్న లెక్కల్లో అహం ఉం టుంది. అహం ఉన్నంత కాలం స్వామి దక్కడు.  స్వామి విరహంలో ఎంత జ్వలించిపోయావు? సన్నిధికై ఎంతగా తపించావన్నదే ప్రధానం!’ అన్నది గోపిక.
 యమునా నదీ తీరంలోని చెట్ల పొదల్లో కూర్చొని ఒక సాధకుడు ఎంతో కాలంగా కృష్ణ మంత్రాన్ని జపిస్తున్నాడు. జప సంఖ్య కొన్ని కోట్లు దాటింది. శరీరం శుష్కించిందే కానీ, కృష్ణ దర్శనం కాలేదు. ఆ సాధకునికి ఆ కాంతల సంభాషణ వినిపించింది. వెంటనే ఆ సాధకుడు తన తప్పు తెలుసుకొని, జపమాలను యమునలోకి విసిరివేశాడు. ప్రేమోపాస నకు ఉద్యుక్తుడైనాడు.

 చేతిలో మాల ప్రధానం కాదు. చిత్తంలో ప్రేమ జ్వాల ప్రధానం. భగవంతుణ్ణి ప్రేమించాలి. విరహంలో జ్వలించాలి. హృదయం ద్రవించాలి. అశ్రువులు స్రవించాలి. ఈ సంసార క్లేశం నుండి జన్మ మృత్యు పరంపర నుండి ముక్తి పొందాలని పరితపించాలి. మహదానంద స్వరూపులం కావాలని, ప్రేమ స్వరూపులం కావాలని ధ్యానించాలి. అదే వినిర్మల భక్తి. కనుక మనం కూడా వినిర్మల భక్తులమై ప్రేమోపాసకులమై సాధనను కొనసాగిద్దాం. ప్రేమ స్వరూపుడైన స్వామి దర్శనాన్ని పొందుదాం. ప్రేమ స్వరూపులమై నిలిచిపోదాం!
     పరమాత్ముని
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement