ప్రేమ స్వరూపి
జ్యోతిర్మయం
లోకంలోని సమస్తమైన సమస్యలకు ‘ప్రేమ’యే పరి ష్కారమన్నట్లుగా జిడ్డు కృష్ణమూర్తి రాసిన పుస్తకాలు చూసి 1970 ప్రాంతంలో ఆయన బోధపట్ల నాకు కొంత విముఖత్వం ఏర్పడింది. అందుకు కారణం ఆయన ‘ప్రేమ’ అనే పదాన్ని ఎలా వాడుతున్నాడో నాకు అర్థం కాకపోవడం; అటు తర్వాత కొంత కాలానికి గానీ, కృష్ణమూర్తి గారు ‘ప్రేమ’ అనే పదాన్ని ఎలా వాడుకున్నారో అర్థం కాలేదు.
1943 ప్రాంతంలో ఓ పాశ్చాత్య గ్రంథ కర్త, కృష్ణ మూర్తితో ‘ప్రేమ విషయంలో మీ వైఖరి ఏమిటో వివరి స్తారా?’ అని అడిగినప్పుడు, వ్యక్తిగతమైన ప్రేమ అనేది నాకు లేదనే చెప్పవచ్చు. నేనె వరితో కలిసి ఉన్నాననే విష యం అప్రస్తుతం- సొంత తమ్ముడితోనైనా, లేక పూర్తిగా పరాయి మనిషితోనైనా అయి ఉండవచ్చు. ప్రేమానుభూతి నాతో సతతమూ ఉంటూనే ఉంటుంది. నన్ను కలిసిన వారెవరికైనా, ఆ అనుభూతి ప్రసరించకుండా అడ్డుకోలేను’ అన్నాడు.
అసలు ఈ ప్రపంచంలో తనని తారసిల్లిన ఏ మనిషినీ తాను అసహ్యించుకున్న సందర్భం కానీ, అతడికేమైనా తనకు నిమిత్తం లేదనుకున్న పరిస్థితి గానీ, ఎన్నడూ ఉదయించలేదా అని మరికాస్త తరచి ప్రశ్నించినప్పుడు, ‘నాకు అయిష్టమైన వాళ్లంటూ ఎవరూ ఉండరండీ. నా ప్రేమను వేరొకరి యెడల చూపించడం నేను కాదు, అని మీరు గ్రహించడం లేదా? నేనేమీ చేస్తూ ఉన్నా, ప్రేమ అలా ఉంటూనే ఉం టుంది; నా చర్మం రంగులాగానే. అందులో మార్పు కానీ, హెచ్చు తగ్గులు కానీ ఉండవు. అందువల్ల నాకు ‘నిమిత్తం లేని వారుగా’ మీరు భావిస్తున్నవారు, ‘నేను ఖాతరు చేయనక్కరలేనివారుగా మీరు భావిస్త్తున్న వారు, నా చుట్టూ మూగి ఉన్నా, ఆ ‘ప్రేమ’ అట్లాగే ఉంటుంది. కానీ నాకీ ‘ఐక్యతాభావం’ కేవలం మానవులతోనే కాదు. వృక్షాలతోనూ, చుట్టూ ఉన్న ప్రపంచంతోనూ, ఈ భావమే ఉంటుంది. భౌతికమైన భేదభావరూపాల గురించి కాదు, నే ప్రస్తావిస్తున్నది. వాస్తవం గురించి మాట్లాడుతున్నాను’ అన్నారు.
మరో సందర్భంలో ‘ప్రేమ’ను నిర్వచిస్తూ ‘అసూ యతో కానీ, మమకారంతో కానీ, ప్రేమ కలిసి ఉండ జాలదు. అందువల్ల ఏది ‘ప్రేమ’ కాదో తేల్చుకుంటే, అప్పుడది ‘ప్రేమ’ అవుతుంది. ప్రేమ అంటే ఏమిటి? అని నేనడగాల్సిన పని లేదు. ప్రేమకానిదంతా వదిలించుకుంటే, ప్రేమే మిగులుతుంది’ అన్నాడు.
మరో సందర్భంలో ‘ప్రేమ అంటే నా అర్థం, మదిలో ‘వేరు చేయకుండా’ ఉండే గుణమని! అంటే మనిషికీ మనిషికీ జాతి మత కుల ఆర్థిక సామాజిక తారతమ్యాలు పరిగణించకుండా వారిని ఒకటిగా చూడడం.
ఈ ప్రపంచంలో యాంత్రికమైన సమస్యలన్నిటికీ యాంత్రిక పరిష్కారాలు ఉంటాయి కానీ మానవ సంబంధమైన సమస్యలన్నిటినీ, కృష్ణమూర్తి గారు చెప్పే ‘ప్రేమ’ (వేరు భావం లేకపోవడం) ఒక్కటే పరిష్కరించగలదు.
- నీలంరాజు లక్ష్మీప్రసాద్