పూజా కుమార్
కోలీవుడ్‌లో రంగప్రవేశం చేసిన ఇతర భాషా హీరోయిన్లు వారు ఏ రాష్ట్రానికి చెందిన వారయినా చెన్నైని ప్రధాన విడిదిగా చేసుకోవాలని ఆశిస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు దీనిని అనువైన నివాస స్థలంగా చేసుకుంటున్నారు. ఎమీ జాక్సన్, ప్రియా ఆనంద్‌లాంటి వారు ఇంతకు ముందు అమెరికా, లండన్‌లో నివశించినా ప్రస్తుతం వారి స్థావరం చెన్నైనే. తాజాగా ఈ పట్టికలో నటి పూజా కుమార్ చేరారు. ఈ మాజీ అమెరికా మిస్ ఇండియా కమల్ హాసన్ విశ్వరూపం చిత్రం ద్వారా వెలుగులోకొచ్చారు. అయితే అంతకు ముందే అంటే 2000వ సంవత్సరంలో దర్శక నిర్మాత కె.ఆర్.దర్శకత్వంలో వచ్చిన కాదల్ రోజావే చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. ఆ తరువాత ఈ అమ్మడు ఒక మలయాళ చిత్రం కూడా చేశారు.
కొంత గ్యాప్ తరువాత మళ్లీ కమల్ హాసన్ విశ్వరూపం చిత్రంతో కోలీవుడ్‌కు తీసుకొచ్చారు. ఆమె ఇప్పుడు కమల్ ఫేవరెట్ హీరోయిన్‌గా మారిపోయారని చెప్పొచ్చు. విశ్వరూపం తరువాత విశ్వరూపం -2 లో కూడా అవకాశం ఇచ్చిన కమల్ తాజాగా ఆయన నటిస్తున్న ఉత్తమ విలన్ చిత్రంలో కూడా హీరోయిన్‌గా చోటు కల్పించారు. అమెరికాలో ఉంటున్న ఈ బ్యూటీ తన మకాంను చెన్నైకి మార్చాలనే నిర్ణయానికి వచ్చారు. మరిన్ని తమిళ చిత్రాలతోపాటు బాలీవుడ్ నుంచి పిలుపు రావడమే తన చెన్నై మకాంకు కారణం అంటున్నారు పూజా కుమార్.