ధనార్జనలోనూ ధోనీ ధనా ధన్!
టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోని ఆటతోనే కాదు ఆదాయంతోనూ సంచలనాలు రేపుతున్నాడు. ధనార్జనలోనూ ధనా ధన్ ధోనీ దమ్ము చూపాడు. అతి సామాన్యంగా జట్టులోకి ప్రవేశించి అసామాన్యుడిగా మారిన ఈ జార్ఖండ్ ఆటగాడు అత్యంత ధనిక క్రీడాకారుడిగా అవతరించాడు. సంపాదనలో సచిన్ టెండూల్కర్ను మించిపోయాడు. మైదానం వెలుపల కూడా సంచనాలు సృష్టించగలనని నిరూపించాడు కూల్ కెప్టెన్. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ధనిక ఆటగాళ్ల జాబితాలో టాప్-20లో నిలిచి భారత ఆటగాళ్లలో అందరికంటే ముందున్నాడు.
జూన్ 2012 నుంచి జూన్ 2013 మధ్య ఏడాది కాలంలో ధోనీ వార్షికాదాయం 31.5 మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో రూ. 179 కోట్లు)గా ప్రముఖ పత్రిక ‘ఫోర్బ్స్’ లెక్కగట్టింది. ఇందులో ఆట ద్వారా 3.5 మిలియన్ డాలర్లు(రూ. 20 కోట్లు) సంపాదించాడు. వాణిజ్య ప్రకటనలు, ఇతరత్రా వాటి ద్వారా 28 మిలియన్ డాలర్లు(రూ. 150 కోట్లు) ఆదాయం సమకూరింది. 2013లో మిగతా ఆరునెల కాలాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే ధోనీ సంపాదన ఇంకా ఎక్కువ ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.
ధోనీ తర్వాత స్థానంలో సచిన్ నిలిచాడు. 22 మిలియన్ డాలర్ల (రూ. 125 కోట్లు) వార్షికాదాయంతో సచిన్ 51వ స్థానం దక్కించుకున్నాడు. అయితే సంపద విషయంలో సచిన్ తర్వాతే ధోని ఉన్నాడు. సచిన్ మొత్తం ఆస్తి ధోని సంపద కంటే మూడు రెట్లు ఎక్కువని వెల్త్ ఎక్స్ అనే సంస్థ ప్రకటించింది. యువరాజ్ సింగ్ కంటే ఐదు రెట్లు, రాహుల్ ద్రావిడ్ కంటే 8 రెట్లు, వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే 10 రెట్లు ఎక్కువ అని వెల్లడించింది. సచిన్ యావదాస్తిని 160 మిలియన్ డాలర్లుగా లెక్కగట్టింది. ధోని 50 మిలియన్లతో 2వ స్థానం, యువరాజ్ 30 మిలియన్లతో 3వ స్థానం, రాహుల్ ద్రావిడ్ 20 మిలియన్లతో 4వ స్థానం, కోహ్లి 15 మిలియన్లతో 5వ స్థానంలో ఉన్నారు.
‘ఫోర్బ్స్’ జాబితాలో గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ వుడ్స్ (అమెరికా) 78.1 మిలియన్ డాలర్ల ఆదాయంతో జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. రష్యా టెన్నిస్ భామ మరియా షరపోవా వరుసగా తొమ్మిదోసారి 'టాప్'లో నిలిచి రికార్డు సృష్టించింది. 26 ఏళ్ల షరపోవా 29 మిలియన్ డాలర్ల (రూ.176 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించింది. మహిళా అథ్లెట్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ 20.5 మిలియన్ డాలర్లతో రెండో స్థానం, నా లీ (చైనా-18.2 మిలియన్ డాలర్లు), విక్టోరియా అజరెంకా (బెలారస్-15.7 మిలియన్ డాలర్లు) తర్వాతి స్థానాల్లో దక్కించుకున్నారు.