
తెలంగాణ బిల్లుపై కొనసాగుతున్న అనిశ్ఛితి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు) 15వ లోక్సభ చివరి సమావేశాల్లోనే ఆమోదం పొందుతుందని ఒక పక్క ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చెబుతున్నప్పటికీ ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన సీన్ మొత్తం ఢిల్లీకి మారిపోయింది. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఆ పార్టీ ఇరుప్రాంతాల ముఖ్యనేతలు, ప్రధాన ప్రతిపక్షం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, తెలంగాణ పోరాట యోధుడు, టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ... ఇలా ముఖ్యనేతలు అందరూ ఢిల్లీలోనే ఉన్నారు. కేంద్ర మంత్రి జైరామ్ రమేష్ను తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిశారు. కేంద్ర హోంశాఖ కార్యాలయం ఎదుట సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు ధర్నా నిర్వహించారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. సమైక్యరాష్ట్ర పోరాట యోధుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రేపు జంతర్‌మంతర్ వద్ద నిరసన దీక్ష చేపట్టనున్నారు.
లోక్సభ స్పీకర్ మీరాకుమార్ అధ్యక్షతన జరిగిన అఖిపలక్ష సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. బిల్లుపై స్పష్టతరాలేదు. రాష్ట్ర విభజనకు బిజెపి ఆమోదం తెలుపుతున్నా, బిల్లుకు మద్దతుపై ఆ పార్టీ ఇంకా స్పష్టమైన అభిప్రాయం బయలకు వెల్లడించడంలేదు. ప్రధానమంత్రి పంపిన బిల్లును ముఖ్యమంత్రి తిరస్కరించారని, కాంగ్రెస్ డబుల్ గేమ్ ఆడుతోందని బిజెపి నాయకురాలు సుష్మాస్వరాజ్ విమర్శించారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీనేతలే వ్యతిరేకిస్తున్నారని, మరికొందరు సమర్థిస్తున్నారని ఆమె అన్నారు. కెసిఆర్ మాత్రం ఈ పార్లమెంటు సమావేశాలలోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని కోరారు. అయితే అఖిలపక్ష సమావేశం తరువాత ఆయన మాట్లాడకుండా వెళ్లిపోయారు.
బిల్లుపై కాంగ్రెస్ ముందుకెళితే పోడియం వద్దే ఉండి అడ్డుకుంటామని వైఎస్ జగన్ చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఎవరు దీక్ష చేసినా తాము మద్దతిస్తామని ఆయన ప్రకటించారు. తమకు పార్టీలతో సంబంధం లేదని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారికే తమ మద్దతని జగన్ స్పష్టం చేశారు. మరోపక్క సభను అడ్డుకోవడం వల్ల తెలంగాణ సమస్య పరిష్కారం కాదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమలనాథ్ చెప్పారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా నడిపేందుకు సహకరించాలని ఆయన సభ్యులను కోరారు.
మరో పక్క కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) ఈరోజు చివరిసారిగా సమావేశమై అర్ధగంటలో చెకచెకా తెలంగాణ బిల్లుకు పలు సవరణలు ఆమోదించింది. బిల్లుకు తుది రూపం ఇచ్చినట్లు జిఓఎం బృందం సభ్యులు సుశీల్ కుమార్ షిండే, గులామ్ నబీ ఆజాద్ చెప్పారు. 15వ లోక్‌సభ ఆఖరి సమావేశాలు ఈ నెల 5 నుంచి 21వ తేదీ వరకు కొనసాగుతాయి. తెలంగాణ బిల్లును ఈ నెల 7న గానీ, 11న గానీ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలలో ఏ మేరకు ఆమోదం లభిస్తుందో వేచిచూడవలసిందే.