పవిత్ర కుటీరం
వైవిధ్యం: సికింద్రాబాద్ సర్దార్‌పటేల్ రోడ్డు.. ఈశ్వరీబాయి విగ్రహం నుంచి ప్యాట్నీ వైపు వెళ్తుంటే ఎడమవైపు ఓ పవిత్ర కుటీరం (అవర్ సాక్రెడ్ స్పేస్) కొలువై ఉంటుంది. బయటి రణగొణ ధ్వనుల నుంచి లోపలకు అడుగుపెట్టగానే.. మండువేసవిలో సాయంకాలం మల్లెల పరిమళం ముప్పిరిగొన్నట్టుంటుంది. పోగొట్టుకున్న బాల్యం తిరిగి చేతికందిన అనుభూతి. పచ్చటి చెట్ల మధ్య సుతిమెత్తని మట్టినేల పాదాలను ముద్దాడుతుంది. ఉరుకులు పరుగుల జీవితంలో నేలను విడిచి సాము చేస్తున్న జనాన్ని ఒక్కసారి కుదిపి మూలాల్లోకి తీసుకెళ్తుంది. సంగీతం, నాట్యం, చిత్రలేఖనంతో పాటు మెడిటేషన్, యోగా.. ఆసక్తి వుంటే చాలు ఐదేళ్ల పిల్లల నుంచి 85 ఏళ్ల పండు ముదుసలి వరకూ ఇక్కడ ఏవైనా నేర్చుకోవచ్చు. కల్మషం లేని మనసులతో పాటు కల్తీ లేని వస్తువులు కూడా దొరుకుతాయక్కడ.
‘ఏడు తరాల నుంచి మాది సికింద్రాబాద్. యూఎస్ వెళ్లి ఎన్విరాన్‌మెంట్‌లో మాస్టర్స్ చేశాను. 14 ఏళ్లు ఎన్విరాన్‌మెంటలిస్ట్‌గా శాన్‌ఫ్రాన్సిస్కోలో అంతర్జాతీయ కంపెనీలతో కలిసి పనిచేశాను. అయితే నాకు డాన్స్ అంటే ప్రాణం. అలా ఒడిస్సీ నేర్చుకున్నాను. పెద్ద పెద్ద బ్రిడ్జిలు, కాలువలకు సంబంధించిన ప్రాజెక్టుల మీద పనిచేస్తున్నప్పుడు కూడా నా సంతోషం కోసం డాన్స్ చేసే దాన్ని. నేను పొందిన జాయ్‌ని ఇతరులకు పంచడమనేది గొప్ప జాప్ అనుకుంటా. అందుకే... అక్కడ పనిచేసిన అనుభవం అవర్ సాక్రెడ్ స్పేస్ కంస్ట్రక్ట్ చేశాను. అక్కడి మిత్రులు చాలా మంది వచ్చి ఇక్కడ ఎన్నో మంచి వర్క్ షాపులు నిర్వహిస్తున్నారు.
కళలు అంటే ఆసక్తి ఉన్న ఎవరికైనా ఆ స్థలం స్వాగతం పలుకుతుంది. ఆసక్తికి వయసు అడ్డు రాకూడదని నమ్మిన నయనతార ఈ సంస్థను 2013లో స్థాపించారు. ఒడిస్సీ నృత్యం చేస్తున్నప్పుడు కలిగిన సంతృప్తిని, కళల అభ్యాసం వల్ల కలిగే ప్రశాంతతని అందరికీ పంచాలనే ఈ స్పేస్ ఏర్పాటు చేశానంటారు. మెడిటేషన్, డాన్సింగ్, డ్రాయింగ్ ద్వారా మైండ్ స్టిల్‌నెస్‌కు చేరుకుంటుంది. అప్పుడు ప్రశాంతతను అనుభూతి చెందొచ్చు. దానినే సాక్రెడ్ అంటారు. అదే డివైన్ కూడా. అందుకే ఈ ప్లేస్‌కి ఆ పేరు పెట్టాను అంటారావిడ.
ఆదివారం అంగడి
ఈ ప్లేసులో ఏది అమ్మాలనే ఆలోచన నాకు ముందు లేదు. ఎన్విరాన్‌మెంటలిస్ట్‌ని కావటంతో పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ వల్ల కలిగే హాని నాకు తెలుసు. అయితే యూఎస్‌లో ఆర్గానిక్ ఫుడ్ దొరికేది. ఇక్కడికి వచ్చాక బాబు కోసం ఆర్గానిక్ ఫుడ్ కావాలని వెతికాను. ఎక్కడా దొరకలేదు. అప్పటినుంచే ఆర్గానిక్ పద్ధ్దతిలో కూరగాయలు పెంచుతున్నాను. అవి అందరికీ అందుబాటులోకి తేవాలనుకుని ఈ ఆదివారం అంగడి ఏర్పాటు చేశాం’ అంటూ స్పేస్ ప్రాధాన్యతను వివరించారామె.
ఖర్చు భరించగలమా?
బయట ఇతర గ్యాలరీలు, కల్చరల్ ప్లేస్‌లతో పోల్చుకుంటే ఇక్కడి రేట్స్ చాలా జెన్యూన్. మధ్య తరగతి నుంచి సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే ఫీజులతో ఇక్కడ అన్ని శిక్షణలు ఇస్తారు. కళ ఏదైనా కావచ్చు.. ఈ వయసులో వెళ్లి బయట నేర్చుకుంటే ఎవరేమనుకుంటారో అని ఫీలవ్వాల్సిన సంశయం లేదిక్కడ. పసిపిల్లల నుంచి పండు ముదుసలి వరకూ నేర్చుకుంటారు. నేర్పిస్తారు కూడా.
ఏమేం నేర్చుకోవచ్చు...
2000 ఏళ్ల పురాతన చైనీయుల థాయ్-చి విద్యను ఇక్కడ నేర్చుకోవచ్చు. ఒడిస్సీ, కథక్, కూచిపూడి, భరతనాట్యం, మోహిని ఆట్టం, జానపద నృత్యాలతోపాటు కర్ణాటక, హిందుస్తానీ సంగీతాలనూ అభ్యసించొచ్చు. మెడిటేషన్, యోగా, యోగా టీచర్ ట్రైనింగ్, కథలు వినిపించడం, తెలుగు భాషా గీతాలు, కథలు, నేర్చుకోవచ్చు. పెయింటింగ్, స్కల్క్చర్‌తో పాటు ఇకబానా, ఎన్విరాన్‌మెంట్ అవేర్‌నెస్, నాటకాలు ఇక్కడి ప్రత్యేకత. ఇక ఆదివారం అంగడి(ఆర్గానిక్ బజారు) అయితే వెళ్లి చూడాల్సిందే. అంతేనా... 2500 ఏళ్ల క్రితం నాటి అంతరించిపోతున్న పటచిత్ర కళకు చేయూతనిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే బుట్టల అల్లిక లాంటి ఎకో ఫ్రెండ్లీ ఉత్పాదనలకు ప్రోత్సాహం లభిస్తోంది. సంతోషాన్ని నలుగురికి పంచటంలో ఎంతో తృప్తి ఉందంటున్నారు నయనతార.
నాన్ వాయిలెన్స్...
నాన్ వయోలెన్స్ కమ్యూనికేషన్ మీద ఈ నెల 18న ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అవతలి మనిషి బాధ వినగలగడం ద్వారా శాంతి చేకూర్చగలం. అదే దీని లక్ష్యం. ఈ స్కిల్ నేర్చుకోవడం ద్వారా చాలా మందికి మంచి జరుగుతుందని నమ్ముతున్నాను.