
బిన్ లాడెన్ పై సమంత ప్రేమగీతం!
ఓ షేక్ ఒసామా నీవు నాకు ఓ తండ్రి.. ఓ అన్న లాంటి వాడివి.. నిన్ను ఎవరూ ప్రేమించనంతగా నేను ప్రేమించాను.. భౌతికంగా నీవు లేకపోయినా.. నీవు అందించిన స్పూర్తితో ముస్లింలందరూ ఏకం కావాలి అంటూ అంతర్జాతీయ నేరస్థుడు, కరడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ పై ఉన్న ఇష్టాన్ని 'వైట్ విడో' పేరున్న మరో ఉగ్రవాది సమంత లేత్వయిటే వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా బిన్ లాడెన్ ప్రేమించే వాళ్లుంటారా? ఉన్నా సరే.. బహిరంగంగా లేఖ ద్వారా ప్రేమను వ్యక్త పరుస్తారా? బిన్ లాడెన్ను ప్రేమించే వ్యక్తి మరో ఉగ్రవాది అన్నా అయుండాలి లేదా ఇస్లామిక్ మత తీవ్రవాది గా ముద్ర పడాలి.. ఇంకా అమెరికాపై పీకల్లోతు ద్వేషంతో రగిలిపోతుండాలి. ఇవన్నీకాకపోయినా కూడా ఇష్టం ఉంటుందా అంటే అవుననే చెప్పక తప్పట్లేదు. 'వైట్ విడో' పేరుతో ప్రసిద్దురాలైన, వివాదస్పద రీతిలో ఇస్లాం మతాన్ని పుచ్చుకున్న సమంత లేత్వయిటే అనే ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అందుకు సాక్ష్యంగా నిలిచింది. 2013 సెప్టెంబర్లో నైరోబిలోని మాల్ పై జరిగిన ఉగ్రదాడి వెనుక సమంత లేత్వయిటేదే హస్తం ఉందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఒసామా బిన్ లాడెన్ పై తనకు ప్రేమ ఉన్నట్టు ఆమె రాసిన లేఖలు బహిర్గతమవ్యడం చర్చనీయాంశమైంది.
బిన్ లాడెన్ పై ఉన్న అభిమానాన్ని, ఇష్టాన్ని, ప్రేమను వ్యక్తం చేస్తూ సమంత రాసిన లేఖ బ్రిటన్లోని అంతర్జాతీయ పత్రికల్లో ప్రధాన శీర్షికగా నిలిచింది. ఒసామాను తాను ఎంతగా ఇష్టపడిందో ఓ భావగీతాన్ని సమంత రచించిందని ఇండిపెండెంట్ పత్రిక ప్రచురించింది. సమంత రాసిన లేఖ అంతా తప్పుల తడకగా ఉన్నా.. అల్ ఖైదా వ్యవస్థాపకుడిపై తనకున్న ప్రేమను వ్యక్తం పరచడంలో సఫలమైందంటూ కథనాన్ని వెల్లడించింది. ఒసామా మరణంతో కుంగిపోయిన సమంత.. ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకుంటానని శపథం కూడా చేసిందట. ఆమె నేర చరిత్ర కూడా ఘనంగానే ఉంది.
ఇటీవల పోలీసులు జరిపిన సోదాలో సమంతకు చెందిన కంప్యూటర్, ఓ పెన్ డ్రైవ్ తోపాటు.. బాంబుల తయారీపై పరిశోధనకు ఆధారాలు లభించడంతో ఇంటర్ పోల్ అధికారులకు ముచ్చెమటలు పట్టాయట. కొద్దికాలం క్రితం నైరోబిలో సోమాలి ఇస్లామిక్ గ్రూప్ అల్ షాబాద్ దాడులు జరిపిన సమయంలో అక్కడే సమంత లేత్వయిటే ఉన్నట్టు తెలిసింది.
2005 జూలై 7 తేదిన కింగ్స్ క్రాస్, రస్సెల్ స్క్వేర్ ట్యూబ్ స్టేషన్ లో మానవ బాంబుగా మారిన జర్మైన్ లిండ్సే భార్య.. ఆ బాంబు పేలుళ్లు జరిగిన ఆరు రోజుల తర్వాత తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాంబు పేలుళ్ల తర్వాత ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులు గృహనిర్భంధం విధించి విచారించారు. లండన్ పేలుళ్లతో లేత్వయిటేకు ఉగ్రవాదులతో సంబంధమున్నట్టు సాక్ష్యాలు లభించాయి. ఆ సంఘటన తర్వాత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా మారింది. సమంతాను పట్టుకోవడానికి ఇంటర్ పోల్ అన్వేషణ కొనసాగిస్తునే రెడ్ నోటిస్ ను జారీ చేసింది. గత కొద్దికాలంగా ఆమె సోమాలి రాడికల్ ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్ అల్ షాబాబ్ సభ్యురాలిగా కొనసాగుతోంది. ముస్లిమేతర ఆలయాల్లో గ్రెనేడ్ దాడులకు పాల్పడినట్టు అనేక కేసులు నమోదయ్యాయి. 2012లో మాంబాసాలోని ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో జరిగిన దాడిలో సమంత కీలక సూత్రధారి. ఇలాంటి నేర చరిత్ర కలిగి అంతర్జాతీయ పోలీసులకు సవాల్ గా నిలిచిన సమంతా లేత్వయిటే ను మట్టుబెట్టకపోతే.. మరింత ముప్పు పొంచి ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.